గురువారం 09 జూలై 2020
Khammam - Apr 28, 2020 , 03:00:33

స్వరాష్ట్రం కోసమే టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం

స్వరాష్ట్రం కోసమే టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం

  • కేసీఆర్‌ సీఎం కావడం తెలంగాణ ప్రజల అదృష్టం 
  • దేశంలోని అన్ని రాష్ర్టాలకు తెలంగాణ ఆదర్శం 
  • ఖమ్మంలో ఘనంగా టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం 
  • పార్టీ కార్యాలయంలో జెండా ఎగురవేసిన మంత్రి పువ్వాడ  
  • హాజరైన పాలేరు, వైరా ఎమ్మెల్యేలు కందాల, లావుడ్యా 
  • అమరులకు మంత్రి నివాళి.. తన ఇంటిపై జెండా ఆవిష్కరణ

ఖమ్మం, నమస్తే తెలంగాణ: తెలంగాణ సాధన, రాష్ట్ర అభివృద్ధి కోసమే 20 ఏళ్ల క్రితం తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) పార్టీ ఆవిర్భవించిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రగతిని ఆచరణలో చూపిన ఘనత పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కే సాధ్యమైందన్నారు. టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం ఖమ్మం నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయం (తెలంగాణ భవన్‌)లో మంత్రి పువ్వాడ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ముందుగా ప్రొఫెసర్‌ జయశంకర్‌, తెలంగాణ తల్లి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ర్టాన్ని, ప్రజల బతుకులను బాగు చేయాలనే ఆలోచనతోనే కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ను స్థాపించారని, అందుకు అనుగుణంగానే సీఎంగా నేడు స్వరాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నారని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించడమే ఏకైక లక్ష్యంగా 2001 ఏప్రిల్‌ 27న ఆవిర్భవించిన టీఆర్‌ఎస్‌ ఆ లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేసిందని వివరించారు. కేసీఆర్‌ సీఎం కావడం తెలంగాణ ప్రజల అదృష్టమని, దేశంలోని అన్ని రాష్ర్టాలకూ మన రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తున్నదని పేర్కొన్నారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ చిత్రపటానికి టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి తాతా మధు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ పూలమాల వేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. పార్టీ 20 వసంతాల వేడుకలను ఘనంగా నిర్వహించే కార్యక్రమం ఉన్నా.. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా దానిని నిర్వహించలేకపోయామని అన్నారు. పాలేరు, వైరా ఎమ్మెల్యేలు కందాల ఉపేందర్‌రెడ్డి, లావుడ్యా రాములునాయక్‌, మేయర్‌ పాపాలాల్‌, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్‌ నల్లమల వెంకటేశ్వరరావు, డీసీసీబీ అధ్యక్షుడు కే.నాగభూషణం, డీసీఎంఎస్‌ చైర్మన్‌ రాయల శేషగిరిరావు, మార్క్‌ఫెడ్‌ రాష్ట్ర వైస్‌ చైర్మన్‌ బొర్రా రాజశేఖర్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఎండీ ఖమర్‌, ఏఎంసీ చైర్మన్‌ మద్దినేని వెంకటరమణ, కార్పొరేటర్లు బత్తుల మురళి, కమర్తపు మురళి, నాయకులు బీరెడ్డి నాగచంద్రారెడ్డి, ఆర్‌జేసీ కృష్ణ, బొమ్మెర రామ్మూర్తి, బెల్లం వేణు, బచ్చు విజయకుమార్‌, తుంబూరు దయాకర్‌రెడ్డి, రామకృష్ణ, కృష్ణచైతన్య, స్వర్ణకుమారి, స్వరూపారాణి, కొల్లు పద్మ, శోభారాణి, షకీనా, శైలజ, సుబ్బారావు పాల్గొన్నారు.  

అమరవీరులకు నివాళులర్పించిన మంత్రి 

మయూరి సెంటర్‌లోని అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ నివాళులర్పించారు. తొలుత టీఆర్‌ఎస్‌ 20 వసంతాల వేడుకల్లో భాగంగా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ తన ఇంటిపై పార్టీ జెండాను ఎగురవేశారు. 


logo