మంగళవారం 07 జూలై 2020
Khammam - Apr 27, 2020 , 01:30:03

ఖమ్మంలో కరోనా కేసులు తగ్గుముఖం

ఖమ్మంలో కరోనా కేసులు తగ్గుముఖం

ఖమ్మం ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఖమ్మం జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గింది. రక్త నమూనాలు ఇచ్చేందుకు ఆదివారం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఐసోలేషన్‌ వార్డుకు ఏ ఒక్కరూ రాకపోవడంతో కేసులు తగ్గుముఖం పట్టినట్లుగా చెప్పవచ్చు. లాక్‌డౌన్‌ పటిష్ట అమలులో పోలీసు శాఖ, కరోనా కట్టడిలో జిల్లా వైద్యారోగ్యశాఖ సఫలీకృతమయ్యాయి. ఈ నెల 21న నమోదైన ఖమ్మం మహిళదే ఆఖరి పాజిటివ్‌ కేసు. ఈ నెల ప్రథమార్థం నుంచే జిల్లా ఆరోగ్యశాఖ పాజిటివ్‌ వ్యక్తుల కాంటాక్ట్‌లను ఛేదించింది. క్వారంటైన్‌, హోంక్వారంటైన్‌లలో అనుమానితులను ఉంచి పరీక్షించింది. పాజిటివ్‌ వ్యక్తుల కాంటాక్ట్‌లన్నీ నెగిటివ్‌గా నమోదయ్యాయి. అలాగే 14 రోజుల వరకు కొత్త కేసులు నమోదు కాకపోవడంతో కంటైన్మెంట్‌ జోన్లలోని నిబంధనలను అధికారులు సడలించారు. ప్రస్తుతం ఖమ్మం ఖిల్లా, బీకే బజార్‌ మాత్రమే కంటైన్మెంట్‌ జోన్లుగా ఉన్నాయి. సాయంత్రం 6 గంటల తరువాత ఖమ్మం జిల్లాలో కర్ఫ్యూ యథావిధిగా కొనసాగుతున్నదని పోలీసు అధికారులు తెలిపారు. అదేవిధంగా ఖమ్మం జిల్లాలో సూర్యాపేట సరిహద్దుతోపాటు రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలనూ మూసివేసి కర్ఫ్యూను పటిష్టంగా అమలు చేయడంతో కరోనా వ్యాప్తిని నివారించగలిగారు. కాగా ప్రభుత్వ క్వారంటైన్లలో సేవలు పొందిన వారు ప్రస్తుతం హోం క్వారంటైన్‌లలో ఉన్నారు. 

కరోనా కొత్త కేసులు లేవు: డీఎంహెచ్‌వో 

మయూరి సెంటర్‌: జిల్లాలో ఇప్పటికే ఉన్న ఎనిమిది కరోనా పాజిటివ్‌ కేసులు మినహా ఆదివారం కొత్త కేసులేమీ నమోదు కాలేదని డీఎంహెచ్‌వో మాలతి పేర్కొన్నారు. జిల్లాలో విదేశీ ప్రయాణికులు 585 మంది ఉన్నారని తెలిపారు. ప్రభుత్వ క్వారంటైన్‌లో 16 మంది ఉన్నట్లు చెప్పారు. జిల్లాలో ఇప్పటి వరకు ప్రభుత్వాసుపత్రి ఐసోలేషన్‌ వార్డులో 1763 మంది ఓపీ, 686 మంది ఐపీ చికిత్సలు పొందారన్నారు. ఇప్పటి వరకు 757 మంది రక్త నమూనాలను పరీక్షలకు పంపగా వారిలో 650 మందికి నెగిటివ్‌ అని రిపోర్టులు వచ్చాయని, ఇంకా 102 మంది రిపోర్టులు రావాల్సి ఉందని వివరించారు. 

త్రీటౌన్‌లో డ్రోన్‌ కెమెరాతో గస్తీ..

ఖమ్మం క్రైం: సీపీ తఫ్సీర్‌ ఇక్బాల్‌ ఆదేశాల మేరకు త్రీటౌన్‌ సీఐ శ్రీధర్‌ ఆ ప్రాంతంలో డ్రోన్‌ కెమెరాతో లాక్‌డౌన్‌ అమలు తీరును పర్యవేక్షించారు. ప్రజలతో రద్దీ ఉన్న ప్రాంతాలను గుర్తించి సమీపంలో గస్తీ నిర్వహిస్తున్న బ్లూ కోల్ట్స్‌, పెట్రోకార్‌ సిబ్బందిని అప్రమత్తం చేశారు. 

వివిధ దుకాణాల వద్ద వినియోగదారులు సామాజిక దూరం పాటించేలా, ప్రజలు మాస్కులు ధరించేలా చర్యలు చేపట్టారు. కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా మార్కెట్ల వద్ద, దుకాణాల వద్ద ప్రజలు గుంపులుగా చేరకుండా లాక్‌డౌన్‌ నిబంధనలు కచ్చితంగా పాటించాలని సీఐ శ్రీధర్‌ సూచించారు. డ్రోన్‌ కెమెరా ద్వారా ప్రతి రోజూ పర్యవేక్షణ చేపడుతున్నట్లు తెలిపారు. 


logo