శుక్రవారం 03 జూలై 2020
Khammam - Apr 27, 2020 , 01:28:16

నేడే గులాబీ పండుగ

నేడే గులాబీ పండుగ

  • ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం..
  • తొలి, మలి దశ ఉద్యమంలో అలుపెరుగని పోరు
  • నాడు సర్వ శక్తులూ ఒడ్డి పోరాడిన టీఆర్‌ఎస్‌ 
  • నేడు అడ్రస్‌లేని ప్రధాన రాజకీయ పార్టీలు
  • అతిపెద్ద రాజకీయ పార్టీగా టీఆర్‌ఎస్‌ అవతరణ

ఖమ్మం ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) ఆవిర్భావ వేడుకలను సోమవారం జరుపుకునేందుకు గులాబీ శ్రేణులు సర్వం సన్నద్ధమయ్యాయి. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గులాబీ పండుగ జరుగనుంది. 2001 ఏప్రిల్‌ 27న కే చంద్రశేఖర్‌రావు (కేసీఆర్‌) నేతృత్వంలో పురుడు పోసుకున్న టీఆర్‌ఎస్‌ సోమవారానికి 18 ఏళ్ల మైలురాయిని పూర్తిచేసుకుంది. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని, కనీవినీ ఎరుగని పోరాటాలను చేసి, చుక్క రక్తం కూడా చిందకుండా తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి చరిత్ర సృష్టించింది. తెలంగాణలోని పాత 10 జిల్లాల ప్రకారం చూస్తే ఖమ్మం మినహా మిగిలిన తొమ్మిది జిల్లాల్లోనూ మొదటి నుంచీ టీఆర్‌ఎస్‌ పెద్ద పార్టీగానే ఉండేది. జిల్లాలో ఉనికిని మాత్రమే చాటుకునేది. తొలి రోజుల్లో కేవలం గుప్పెడుమంది కార్యకర్తలు మాత్రమే టీఆర్‌ఎస్‌లో ఉండేవారు. కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు ప్రాంతాల్లో ఉద్యమకారుల బలం తప్ప టీఆర్‌ఎస్‌ పార్టీకి బలమైన స్థానం ఉండేది కాదు. 2009 వరకు జిల్లాలో చెప్పుకోదగిన క్యాడర్‌ కూడా లేని పరిస్థితి. అప్పట్లో సింగరేణి కార్మికులు మినహా టీఆర్‌ఎస్‌ను ఆదరించిన వారు లేరంటే అతిశయోత్తి కాదు. 2014 సార్వత్రిక ఎన్నికల సందర్భంలో కూడా అలాంటి పరిస్థితే ఉండేది. జిల్లాలోని 10 నియోజవర్గాల్లో టీఆర్‌ఎస్‌ పోటీ చేసినప్పటికీ ఒక్క కొత్తగూడెం నియోజకవర్గంలో మాత్రమే గెలిచింది. ఆ పార్టీ తరఫున జలగం వెంకటరావు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అదే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తెలంగాణలో అత్యధిక సీట్లు సాధించి కేసీఆర్‌ నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తరువాత జరిగిన రాజకీయ పరిణామాల్లో ఇతర పార్టీల నుంచి అనేకమంది ప్రజాప్రతినిధులు, నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరారు. 2018 చివరి అంకంలో జరిగిన ముందస్తు శాసనసభ ఎన్నికల్లో కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్‌ఎస్‌ ఒకేఒక్క స్థానాన్ని కైవసం చేసుకుంది. అయినప్పటికీ తదనంతర పరిణామాల్లో ఇతర పార్టీల తరఫున గెలుపొందిన శాసనసభ్యులు టీఆర్‌ఎస్‌లో చేరారు. 

ఉమ్మడి ఖమ్మంలో ప్రస్తుతం ఏడుగురు ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో ఉన్నారు. 2019లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరఫున నామా నాగేశ్వరరావు భారీ మెజార్టీని సాధించి చరిత్ర సృష్టించారు. అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ 95 శాతం స్థానాల్లో గెలుపొందింది. ఉమ్మడి ఖమ్మంలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ప్రధాన ప్రతిపక్ష పార్టీల అడ్రస్‌ గల్లంతైంది. 

మలిదశ ఉద్యమానికీ పురుడు పోసినం..

తెలంగాణలో 1969లో ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమాన్ని నాటి పాలకులు, రాజకీయ నాయకులు కుట్రలతో నీరుగార్చారు. అయినప్పటికీ స్వరాష్ట్ర ఆకాంక్ష మాత్రం నివురుగప్పిన నిప్పులా, మబ్బుల మాటున దాగిన సూర్యుడిలా ఉండిపోయింది. ఈ క్రమంలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ చూపిన తొవ్వలో తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను భుజానికెత్తుకున్నారు. అన్నాబత్తుల రవీంద్రనాథ్‌ ఇచ్చిన స్ఫూర్తితో 2009 నవంబర్‌ 29న ఆమరణ నిరహార దీక్షకు పూనుకున్నారు. ‘కేసీఆర్‌ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో..’ అని భీష్మించారు. దీంతో గడగడలాడిన నాటి సీమాంధ్ర పాలకులు కేసీఆర్‌ను అదేరోజు అరెస్టు చేసి ఖమ్మానికి తీసుకొచ్చారు. ఇక్కడ వలసవాదులు, సమైక్యవాదులు ఎక్కువగా ఉంటారు కాబట్టి సమస్యలు తలెత్తవని, తద్వారా ఉద్యమాన్ని అణగదొక్కవచ్చునని భావించారు. 

కానీ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మలిదశ ఉద్యమకర్తను అరెస్టు చేసి ఖమ్మానికి తీసుకొస్తున్నారన్న విషయం తెలియగానే తెలంగాణ శక్తులన్నీ ఏకమై కేసీఆర్‌కు అండగా నిలబడ్డాయి. జిల్లా ఉద్యమ బిడ్డల పోరాటాన్ని చూసిన కేసీఆర్‌ తొలుత జిల్లా జైల్లో, తర్వాత ప్రభుత్వాసుపత్రిలో దీక్షను కొనసాగించారు. ఇదే పది జిల్లాల మలిదశ ఉద్యమానికి మరోమారు నాంది పలికింది.

గుబాళించిన ‘గులాబీ’ దండు                

స్వరాష్ట్ర సాధన కోసమే పురుడు పోసుకున్న టీఆర్‌ఎస్‌.. ఉద్యమ పురిటిగడ్డపై అలుపెరుగని పోరాటం చేసింది. సమైక్యవాదుల అడ్డాగా ఉన్న ఈ గుమ్మంపై అనేక ఉద్యమాలు చేపట్టింది. సొంతంగా చెప్పుకోతగిన బలం లేకపోయినా ప్రజల మద్దతును కూడగట్టి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొట్లాడింది. టీజేఏసీ, టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ తెలంగాణ కోసం ఏ పిలుపునిచ్చినా వెనుకడుగు వేయలేదు. సకల జనుల సమ్మె విజయవంతంగా కొనసాగింది. టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి జిల్లా అధ్యక్షులుగా దుగ్గినేని భాస్కర్‌రావు, తాళ్లూరి వెంకటేశ్వరరావు, దిండిగల రాజేందర్‌ పనిచేశారు.

ఎగసిన పోరుజెండా..

2009 నవంబర్‌ 29న ఆమరణ నిరహార దీక్షను భగ్నం చేసి కేసీఆర్‌ను ఖమ్మానికి తీసుకురాగానే ఇక్కడ పోరుజెండా ఎగిరింది. ఉద్యమ శ్రేణులు ఖమ్మం జిల్లా జైలును ముట్టడించాయి. తెలంగాణ ఉద్యమానికి తెలంగాణలో ఇంతటి మద్దతు లభించడాన్ని గమనించిన కేసీఆర్‌ జైల్లోనూ దీక్షను కొనసాగించారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో అధికారులు ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. అక్కడా ఉద్యమకారుల పోరాటం ఆగలేదు. 

లాఠీలతో పోలీసులు కుళ్లబొడుస్తున్నా ‘జై తెలంగాణ’ అంటూ నినదించారు. చివరికి కేసీఆర్‌ను ఖమ్మం నుంచి హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. కాగా ఆనాడు ఖమ్మంలో జరిగిన ఉద్యమమే మరోమారు యావత్‌ తెలంగాణ సమాజంలో అగ్గి రాజేసింది. 

నేడు పార్టీ జెండా ఎగురవేయనున్న మంత్రి

టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఖమ్మంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ సోమవారం ఉదయం 9:30 గంటలకు పార్టీ జెండాను ఆవిష్కరించనున్నారు. అనంతరం భక్తరామదాసు కళాక్షేత్రంలో వెయ్యి మంది పేదలకు నిత్యావసర సరుకులను, మాస్కులను పంపిణీ చేయనున్నట్లు మంత్రి పీఏ రవికిరణ్‌ తెలిపారు. 

ప్రజాకాంక్షను నెరవేర్చిన టీఆర్‌ఎస్‌ 

  • శ్రేణులకు పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు: తుమ్మల 

ఖమ్మం, నమస్తే తెలంగాణ: ఈ రెండు దశాబ్దాల కాలంలో టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిందని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలో రాష్ట్రం దేశానికే దిక్సూచిగా మారిందని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు తుమ్మల శుభాకాంక్షలు తెలిపారు. వినూత్న పథకాలతో ప్రజల్లో తిరుగులేని విశ్వాసాన్ని కేసీఆర్‌ నేతృత్వంలోని టీఆర్‌ఎస్‌ పార్టీ నింపిందన్నారు. గడిచిన ఆరేళ్లలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సుమారు రూ.45 వేల కోట్లను కేటాయించిన సీఎం కేసీఆర్‌కు పార్టీ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. జాతీయ రహదారుల నిర్మాణాలు, ఇరిగేషన్‌, విద్యుత్‌ ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటూ అనేక అద్భుతాలు, గొప్ప విజయాలు సాధిస్తున్నదని పేర్కొన్నారు. ఇవి టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులకు గర్వకారణాలని కితాబిచ్చారు. ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనాను తెలంగాణలో సీఎం కేసీఆర్‌ అదుపులో ఉంచారన్నారు. కరోనా నేపథ్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిరాడంబరంగా జరుపుకోవాలని పార్టీ నాయకత్వం నిర్ణయించిందన్నారు. ఈ నిర్ణయాన్ని శ్రేణులు గౌరవించాలని కోరారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి అండగా ఉంటున్న తెలంగాణ ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు తుమ్మల ఆదివారం ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు.

భౌతిక దూరం పాటిస్తూ నిర్వహించాలి..

కరోనా వైరస్‌ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ వేడుకలను భౌతిక దూరం పాటిస్తూ నిర్వహించాలి. నేడు టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలందరూ ఎక్కడి వారు అక్కడే తమ ఇళ్లపై టీఆర్‌ఎస్‌ జెండా ఎగురవేయాలి. రక్తదాన కార్యక్రమాన్ని వారం రోజులపాటు కొనసాగించాలి. చుట్టుపక్కల ప్రాంతాల్లో సహాయం, అవసరం ఉన్న నిరుపేదలను గుర్తించి వారిని ఆదుకోవాలి.

  -మంత్రి పువ్వాడ ఆజయ్‌కుమార్‌ 

వేడుకలను నిరాడంబరంగా జరుపుకోవాలి.. 

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ వేడుకలను శ్రేణులు నిరాడంబరంగా జరుపుకోవాలి. టీఆర్‌ఎస్‌ ఆవిర్భవించి రెండు దశబ్దాలైంది. ఆవిర్భావ దినోత్సవంలో తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించాలి. పార్టీ శ్రేణులు కచ్చితంగా లాక్‌డౌన్‌ నిబంధనలను పాటించాలి.  

-టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి తాతా మధు


logo