గురువారం 09 జూలై 2020
Khammam - Apr 26, 2020 , 03:05:39

భద్రాద్రి జిల్లాలో అకాల వర్షం

భద్రాద్రి జిల్లాలో అకాల వర్షం

 • తడిసిన ధాన్యం రాశులు
 • మోరంపల్లి బంజరలో
 • తాటిచెట్టుపై రెండు పిడుగులు
 • ఆందోళనలో రైతన్నలు..

కొత్తగూడెం, నమస్తే తెలంగాణ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అకాల వర్షం కురిసింది. భద్రాచలం, పినపాక, ఇల్లెందు, అశ్వారావుపేట, కొత్తగూడెం నియోజకవర్గాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. సాయంత్రం ఐదు గంటల నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడటంతో రాశులుగా వేసిన ధాన్యం తడిసింది. అక్కడక్కడ చెట్లపై పిడుగులు పడ్డాయి. దుమ్ముగూడెం, పర్ణశాల, పాల్వంచ, సుజాతనగర్‌ మండలాల్లో భారీ వర్షం కురిసింది. రైతులు బస్తాల్లో నింపే సమయానికి వర్షం పడటంతో కల్లాల్లోనే ధాన్యం తడిసింది. కొంతమంది రైతులు కల్లాల్లో ధాన్యపురాశులపై పట్టాలు కప్పి కాపాడుకున్నారు.

 • పాల్వంచ మండలంలోని సోములగూడెం, జగన్నాథపురం, కేశవాపురం, నాగారం, దంతెలబోర తదితర ప్రాంతాల్లో వడగండ్లతో కూడిన వర్షం కురిసింది. సాయంత్రం 4.30 గంటల నుంచి గంటసే పు వర్షం కురిసింది. పూరి గుడిసెల పైకప్పులు ఎగిరిపోయాయి. కల్లాల్లోని ధాన్యంపై రైతులు పట్టాలు కప్పి కాపాడుకున్నారు. పాల్వంచ పట్టణంలో గంటసేపు భారీ వర్షం కురిసింది.
 • దుమ్ముగూడెం మండలంలో శనివారం సాయం త్రం అకాల వర్షం కురిసింది. పలు గ్రామాల్లో చెట్లు పడిపోయాయి. కే.లక్ష్మీపురం ధాన్యం కొనుగోలు కేంద్రంలోని ధాన్యం పూర్తిగా తడిసింది. గ్రామాల్లోని కొన్ని పూరిళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి.
 • సుజాతనగర్‌ మండల కేంద్రంలోని జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో ధాన్యం రాశులు, బస్తాలపై రైతులు ప ట్టాలు కప్పి కాపాడుకున్నారు. వర్షం తగ్గిపోయిన తరువాత తరగతి గదుల్లో భద్రపరిచారు.
 • బూర్గంపహాడ్‌ మండలం మోరంపల్లి బంజరలోని పాత బజార్‌లో ఇళ్ల రాజేశ్‌, పోరుపల్లి సంజీవరావు ఇళ్ల పక్కనున్న తాటిచెట్లపై రెండు పిడుగులు పడ్డాయి. ఆ తాటిచెట్లు కాలిపోయాయి. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యపు రాశులపై రైతులు టార్పాలిన్‌ పట్టాలు కప్పారు. కొందరు రైతుల ధాన్యం తడిసింది. సారపాక సినిమాహాల్‌ సెంటర్‌ వద్ద కరెంటు స్తంభం విరిగింది.
 • మణుగూరు మండలంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. వరి పొలాల్లో, ధాన్యం  కొనుగోలు కేంద్రాలో ఆరబోసిన  ధాన్యం తడిసింది. పలుచోట్ల చెట్లు కూలాయి. మణుగూరులోని ఫారెస్ట్‌ రేంజ్‌ కార్యాలయ ఆవరణలోని రెండు చెట్లపై పిడుగులు పడ్డాయి.
 • మణుగూరు మండలంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. వరి పొలాల్లో, ధాన్యం  కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన  ధాన్యం తడిసింది. పలుచోట్ల చెట్లు కూలాయి.
 • అన్నపురెడ్డిపల్లి మండలంలో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది.
 • చండ్రుగొండ మండలంలో భారీ వర్షం కురిసింది.


logo