ఆదివారం 12 జూలై 2020
Khammam - Apr 25, 2020 , 02:51:22

జయహో దుర్గాభవానీ..

జయహో దుర్గాభవానీ..

  • దాతృత్త్వం చాటుకున్న యాచకురాలు
  • భిక్షాటన సొమ్ము, పింఛన్‌ డబ్బులతో సహాయం
  • కరోనా నివారణ కమిటీకి పండ్లు, మజ్జిగ పంపిణీ
  • అభినందించిన మంత్రి ‘పువ్వాడ’, ఎంపీ ‘నామా’
  • సొషల్‌ మీడియాలో సేవలపై ప్రశంసలు 

దాతలపైనే ఆధారపడాల్సి వచ్చినా, చేతనైంది చేయాలనుకుంది.. స్థాయి చిన్నదని ఎరిగినా చిరస్థాయిగా నిలిచే పనికి పూనుకుంది.. చేతిలో చిల్లిగవ్వ లేకున్నా సాయపడాలనే పట్టుదలతో ముందుకు సాగింది.. ఎవరైనా పెడితే తినడం లేదంటే పస్తులుండే పేద తల్లి, దగ్గరున్నదంతా దానం చేసి పెద్ద మనస్సును చాటింది.. వైకల్యం శరీరానికే కాని మంచిని పంచాలనుకునే సంకల్పానికి కాదని తెలియజెప్పింది. భిక్షాటన చేసి కూడబెట్టుకున్న సొమ్ముకు తోడు అంగవైకల్యానికి సర్కారు అందజేస్తున్న సహాయపు పింఛన్‌నూ జమ చేసింది.. కరోనాతో జనవాళి విలవిలలాడుతున్న వేళ తనవంతుగా తోడ్పాటుకు ముందుకొచ్చింది.. మహమ్మారిని అరికట్టే విధుల్లో తమ వారికి దూరంగా ఉంటున్న సిబ్బందికి మనోధైర్యం కల్పించింది.. అరటి పండ్లు, మజ్జిగ ప్యాకెట్లు పంచి అమ్మతనాన్ని చాటుకుంది.. అశ్వారావుపేటకు చెందిన యాచకురాలు  దుర్గాభవాని ఉదారత్వంపై “నమస్తే తెలంగాణ” అందిస్తున్న కథనం..

అశ్వారావుపేట, నమస్తే తెలంగాణ : అశ్వారావుపేట పట్టణంలోనే కోనేరు బజార్‌కు చెందిన కొటికలపూడి దుర్గా భవాని తల్లిదండ్రులు సత్యనారాయణ, కృష్ణ కుమారిలతో కలిసి నర్సరీ పనిచేసుకుంటూ కుటుంబ పోషణలో భాగమైంది. సుమారు ఏడేళ్ల క్రితం వ్యవసాయ కూలీ శ్రీనుతో వివాహమైంది. వీరికి రేవంత్‌ కుమార్‌, గణేశ్‌ కుమార్‌ అనే ఇద్దరు కుమారులు. వివాహం అనంతరం భర్తతో కలిసి కూరగాయల దుకాణంలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటుంది. సాఫీగా సాగుతున్న ఆమె జీవితంలో విధి వక్రించింది. కొద్ది రోజుల వ్యవధిలోనే తల్లిదండ్రులతో పాటు భర్త కూడా అనారోగ్యంతో మృతిచెందాడు. మానసికంగా కుంగిపోయిన దుర్గాకు ఆరేళ్ల క్రితం పక్షవాతం వచ్చి మాట కూడా పడిపోయి జీవి తం మరింత చీకటిమయమైంది. ఈ క్రమంలోనే పట్టణానికి చెందిన మాచవరపు రత్నకుమారి దుర్గా పిల్లలిద్దరినీ హైదరాబాద్‌ తీసుకెళ్లి చదివిస్తున్నారు. అప్పటి నుంచి దుర్గా ఒంటరిగానే ఉంటోంది. భిక్షాటన చేసుకుంటూ రోజులు వెల్లదీస్తున్నది. కాగా, ఆమె ఆంగవైకల్యాన్ని గుర్తించిన ప్రభుత్వం పింఛన్‌ మంజూరు చేసింది. దీంతో పింఛన్‌ సొమ్ముతో పాటు ఇటు భిక్షాటన చేసుకుంటూ కాలం గడుపుతోంది. 

మానవత్వం చాటి ప్రశంసలు... 

కాగా, ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ట చర్యలు చేపట్టాయి. ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌ను అధికార యంత్రాంగం పకడ్బందీగా అమలు చేస్తున్నది. వైరస్‌ నివారణలో ప్రాణాలను పణంగా పెట్టి అహర్నిశలు పనిచేస్తున్న వివిధ శాఖల అధికారులు, సిబ్బందిని చూసిన దుర్గాభవాని చలించిపోయింది. ఒకరికి సాయం చేసే స్థితిలో లేకపోయినా తనవంతుగా       ఏదైనా చేయాలని రెండు నెలల నుంచి ఖర్చు పెట్టకుండా దాచుకున్న పింఛన్‌ సొమ్ముకు భిక్షాటనలో వచ్చిన డబ్బును జత చేసి రూ.6 వేలు పోగు చేసింది. ఆ డబ్బుతో ఈ నెల 21వ తేదీన అరటి పండ్లు, మజ్జిగ కొనుగోలు చేసింది. పలువురు యువకుల సహకారంతో ఆటోలో వెళ్లి కరోనా కట్టడికి ఏర్పాటు చేసిన శిబిరాలు, చెక్‌పోస్ట్‌ల వద్ద విధుల్లో ఉన్న పోలీసులు, వైద్యాధికారులు, పారిశుధ్య సిబ్బందికి స్వయంగా అందించింది. ఆమె దాతృత్త్వంపై రవాణా శాఖామంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు, జడ్పీ చైర్మన్‌ కోరం కనకయ్య, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు తదితరులతో పాటు పలువురు స్థానికులు అభినందనలు తెలిపారు. తన జీవితానికి భరోసా లేకున్నా ప్రజా సేవలో నిమగ్నమైన ఆమె గొప్పగుణాన్ని ప్రశంసలతో ముంచెత్తారు. పలువురు నాయకులు ఫోన్‌లో ఆమెతో మాట్లాడా రు. దుర్గాభవాని కుటుంబ నేపథ్యం తెలుసుకుని పలువురు చలించిపోయారు. సమాజం హర్షించే విధంగా మంచి పని చేశావంటూ పొగడ్తలతో ముంచెత్తారు. ఆమె అందించిన సేవలకు టీఆర్‌ఎస్‌ నాయకులు,ప్రెస్‌క్లబ్‌ బాధ్యులు శాలువాలతో సత్కరించారు. ఆమె సేవ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

సాయం చేయాలనిపించింది..

  • దుర్గా భవాని, యాచకురాలు, అశ్వారావుపేట

కరోనా వైరస్‌ నివారణకు అధికార్లు, సిబ్బంది పడ్తున్న కట్టం సూసి సాయం చెయ్యాలనిపిచ్చింది. రోజూ అడుక్కుంట తిరిగేదాన్ని. అట్ల వచ్చిన పైసలకు తెలంగాణ గౌర్నమెంట్‌ ఇచ్చిన 2 నెలల పించిన్‌ పైసలుగూడా కల్పిన. అవ్వీఇవ్వీ గల్పితే మొత్తం ఆరువేల రూపాలైనయ్‌. వాటితో అరటి పండ్లు, సల్ల ప్యాకెట్లు కొనుక్కొని కొందరు పిలగాండ్లను ఎంటేసుకుని కరోనా డ్యూటీ చేత్తాన సార్లకు ఇయ్యడం సంబురంగున్నది. 


logo