సోమవారం 13 జూలై 2020
Khammam - Apr 23, 2020 , 03:11:01

వలస కూలీలకు పునరావాసం కల్పిస్తాం..

వలస కూలీలకు పునరావాసం కల్పిస్తాం..

  • మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌

కూసుమంచి: వలస కూలీలకు పునరావాసం కల్పిస్తామని, ఎవరూ అధైర్య పడొద్దని మంత్రి అజయ్‌కుమార్‌ భరోసా కల్పించారు. బుధవారం ఆయన జిల్లా సరిహద్దు గ్రామమైన నాయకన్‌గూడెంలో చెక్‌పోస్టును పరిశీలించి మాట్లాడారు. ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన 500 మందికి వలస కూలీలకు పునరావాసం కల్పిస్తున్నట్లు చెప్పారు. సూర్యాపేటజిల్లాలో కరోనా ప్రభావం ఎక్కువ ఉన్నందున రాకపోకలను నిషేధించా లన్నారు. అక్కడి నుంచి ఎవరు జిల్లాలోకి ప్రవేశించినా అధికారులు, ప్రజాప్రతినిధులదే బాధ్యత అని అన్నారు. అప్‌ అండ్‌ డౌన్‌ చేసే ఉద్యోగులను సైతం రానివ్వొదని ఆదేశాలు జారీ చేశారు. సోలీపురం, కాకరవాయి వద్ద కూడా రాకపోకలను కట్టడి చేయాలన్నారు. సరిహద్దుల వద్ద తీసుకుంటున్న భద్రతా చర్యలపై ఆయన కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌, సీపీ తఫ్సీర్‌ ఇక్బాల్‌ను అడిగి తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తున్నామని, పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని వారు బదులిచ్చారు. పాలేరులో 150 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేశామని, అవసరం అయితే ఉపయోగిస్తామని కలెక్టర్‌ తెలిపారు. కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు భేష్‌ అని మంత్రి అభినందించారు. ఆయన వెంట ఎంపీపీ బానోత్‌ శ్రీనివాస్‌, డీసీసీబీ డైరెక్టర్‌ ఇంటూరి శేఖర్‌, ఏసీపీ వెంకటరెడ్డి, తహసీల్దార్‌ శిరీష, సీఐ మురళీ, ఎస్‌ఐ అశోక్‌రెడ్డి, ఎంపీడీఓ కరుణాకర్‌రెడ్డి ఉన్నారు. 

నేలకొండపల్లి:సూర్యాపేటలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నందున జిల్లా సరిహద్దుల నుంచి కొత్త వ్యక్తులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, లాక్‌డౌన్‌ పకడ్బందీగా అమలు జరిగేలా చూడాలని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. పైనంపల్లి వద్ద ఏర్పాటు చేసిన జిల్లా సరిహద్దు చెక్‌పోస్టును బుధవారం ఆయన పరిశీలించారు. లాక్‌డౌన్‌ను పాటించకుంటే కరోనాను అదుపు చేయలేమన్నారు. ఆయన వెంట  ఎస్సై గౌతమ్‌, పార్టీ మండల అధ్యక్షుడు ఉన్నం బ్ర హ్మ య్య, డీసీఎంఎస్‌ డైరెక్టర్‌ నాగుబండి శ్రీనివాసరావు, తహసీల్దార్‌ వీరభద్రం, ఎంపీడీవో రవికుమార్‌ పాల్గొన్నారు. 


logo