శుక్రవారం 03 జూలై 2020
Khammam - Apr 23, 2020 , 03:07:29

స్వీయ నియంత్రణే శ్రీరామరక్ష

స్వీయ నియంత్రణే శ్రీరామరక్ష

  • రాష్ట్ర రవాణా శాఖ మంత్రి 
  • పువ్వాడ అజయ్‌కుమార్‌ 
  • ఇల్లెందు పట్టణంలో విస్తృత పర్యటన

ఇల్లెందు నమస్తే తెలంగాణ: ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటిస్తేనే కరోనా మహమ్మారిని దూ రం చేయగలుగుతామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ అన్నారు. ఇల్లెందు పట్టణంలో బుధవారం ఆయన విస్తృతంగా పర్యటించారు. మున్సిపాలిటీ పరిధిలో పారిశుధ్య పనులను స్వయంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్మికులు భౌతికదూరం పాటిస్తూ పనులు చేయాలని చెప్పారు. ఎస్‌బీఐని సందర్శించి అధికారులతో మాట్లాడారు. తీసుకుంటున్న జాగ్రత్తలను అడిగి తెలుసుకున్నారు. తొలుత కూరగాయల మార్కెట్‌లో విక్రయాలను పరిశీలించారు. విక్రయదారుడు జానీ సమకూర్చిన కూరగాయలు పేదలకు మంత్రి ,ఎమ్మెల్యే బానోత్‌ హరిప్రియ, జడ్పీ చైర్మన్‌ కోరం కనకయ్య పంపిణీ చేశారు.  

లాక్‌డౌన్‌ మరింత కఠినంగా అమలు చేయాలి..

 కరోనా వైరస్‌ వ్యాప్తిని నివారించడంలో జిల్లా అధికారులు సఫలీకృతులయ్యారని మంత్రి పువ్వాడ జిల్లా అధికారులను అభినందించారు. ఇదే తరహాలో రానున్న రోజుల్లో లాక్‌డౌన్‌ మరింత కఠినంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. బుధవారం మున్సిపల్‌ కార్యాలయంలో జిల్లా అధికారులతో లాక్‌డౌన్‌ నేపథ్యంలో తీసుకుంటున్న చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు తీసుకున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు లేనందున ఇతర జిల్లాల నుంచి ఎవరూ ప్రవేశించకుండా చెక్‌పోస్టుల వద్ద పకడ్బందీగా చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేస్తూ ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించేలా ప్రజలను ఎప్పటికప్పుడు చైతన్యపర్చాలన్నారు. పేదలు, వలస కూలీలు ఇబ్బంది పడకుండా అధికారులు పర్యవేక్షిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ దిండిగాల రాజేందర్‌, మున్సిపల్‌ చైర్మన్‌ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, వైస్‌చైర్మన్‌ జానీ, అడిషనల్‌ కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, మున్సిపల్‌ ప్రత్యేకాధికారి వెంకటేశ్వరరెడ్డి, ఆర్డీవో స్వర్ణలత, డీపీవో ఆశాలత, కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి , నియోజకవర్గ స్థాయి అధికారులు, తహసీల్దార్‌ మస్తాన్‌రావు  పాల్గొన్నారు. 


logo