గురువారం 02 జూలై 2020
Khammam - Apr 22, 2020 , 02:13:11

జిల్లాలో పాజిటివ్‌ కేసుల సంఖ్య ఎనిమొది

జిల్లాలో పాజిటివ్‌ కేసుల సంఖ్య ఎనిమొది

ఖమ్మం సిటీ: ఖమ్మంలో కరోనా కలకలం రేపుతోం ది. వైరస్‌ కట్టడికి జిల్లా యంత్రాంగం ఎంతటి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ పాజిటివ్‌ కేసులు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే జిల్లాలో ఏడుగురు కరోనాతో బాధపడుతున్న విష యం తెలిసిందే. తాజాగా మరో మహిళను మహమ్మారి ఆవహించింది. నగరంలోని బీకే బజార్‌ ప్రాంతానికి చెందిన మహిళకు కరోనా సోకినట్లు మంగళవారం అధికారులు నిర్ధారించారు. ఖిల్లా బజార్‌లో పాజిటివ్‌ వ్యక్తి ఇంట్లో ఈమె కొంతకాలంగా కూలీగా పనిచేస్తున్నది. కుటుంబ పెద్దకు కరోనా రావటంతో కొద్దిరోజుల క్రితమే సదరు మహిళను కూడా ప్రభుత్వ క్వారంటైన్‌కు తరలించారు. వైద్యారోగ్యశాఖ అధికారులు అన్నిరకాల వైద్యపరీక్షలు నిర్వహించగా, సోమవారం రాత్రి పలువురి రిపోర్టులు వచ్చాయి. వాటిల్లో బీకే బజార్‌కు చెందిన మహిళకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కాగా జిల్లాలో కరోనా వ్యాప్తిపై పూర్తిస్థాయిలో దృష్టిసారించిన అధికారులు నిజనిజాలను గుర్తించటంలో సఫలీకృతం అయ్యారు. ఇప్పటి వరకు వస్తున్న పాజిటివ్‌ కేసులన్నీ ఢిల్లీ వెళ్లివచ్చిన పెద్దతండాకు చెందిన వ్యక్తి ద్వారానే సోకినట్లుగా తేల్చారు. మోతీనగర్‌లో ఒకరు, ఖిల్లాబజార్‌లోని ఒకే ఇంట్లో ఆరుగురు కరోనా బారినపడటానికి కారణం ఒక్కరేనని అధికారులు స్పష్టంచేస్తున్నారు.

నగరంలో నాలుగు కంటైన్మెంట్‌ జోన్‌లు..

నగరంలో కంటైన్మెంట్‌ జోన్‌ల సంఖ్య నాలుగుకు చేరింది. తొలుత పెద్దతండాకు చెందిన వ్యక్తికి కరోనా సోకటంతో అప్రమత్తమైన అధికారులు ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ అదుపులోకి తీసుకున్నారు. మరికొద్ది రోజుల్లోనే ఖిల్లాబజార్‌, మోతీనగర్‌ ఏరియాల్లో పాజిటివ్‌ కేసులు నమోదు కావటంతో వాటిల్లో కూడా వాహనాల రాకపోకలను నిషేధించారు. తాజాగా బీకే బజార్‌కు చెందిన మహిళకు కరోనా సోకటంతో, ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్‌ జోన్‌గా ప్రకటించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కంటైన్మెంట్‌ జోన్‌ పరిధిలో కర్ఫ్యూ వాతావరణం నెలకొంటుంది. ఎలాంటి అవసరం ఉన్నప్పటికీ ప్రజలను ఇంటి నుంచి బయటకు రానివ్వరు. నిత్యావసరాలను సైతం అధికారులే ఇంటింటికీ సరఫరా చేస్తారు. బీకే బజార్‌లోని మెజారిటీ ప్రాంతంలో ప్రయివేట్‌ దవాఖానాలు ఉండటంతో జిల్లా అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. కేవలం వైద్యశాలలకు వచ్చేవారిని మాత్రమే ఈ ప్రాంతంలోకి అనుమతివ్వనున్నారు.  దీనికి సంబంధించి రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌, సీపీ తఫ్సీర్‌ ఇక్బాల్‌ కలిసి పోలీసు, రెవెన్యూ, వైద్యారోగ్యశాఖ, నగరపాలకసంస్థ యంత్రాంగానికి దిశానిర్దేశం చేశా రు. జిల్లా వైద్యారోగ్యశాఖ లెక్కల ప్రకారం మొత్తం 531 మంది శాంపిల్స్‌ సేకరించి పరీక్షల కోసం పంపించారు. వాటిల్లో 456 మంది రిపోర్టులు నెగెటివ్‌ రాగా, 66 మందివి పెండింగ్‌లో ఉన్నాయి. కరోనా పాజిటివ్‌గా తేలినవారు ఎనిమిది మంది ఉన్నారు.  

పాజిటివ్‌ కేసుల సంఖ్య ఎనిమిది:జిల్లా కలెక్టర్‌

ఖమ్మం జిల్లాలో మరొకరికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ పేర్కొన్నారు. మంగళవారం జడ్పీ సమావేశ మందిరంలో పోలీసు కమిషనర్‌ తప్సీర్‌ ఇక్బాల్‌తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో కరోనా వ్యాప్తి గురించి వివరించారు. బీకే బజార్‌ను సైతం కంటైన్మెంట్‌ జోన్‌ జాబితాలోకి చేర్చుతున్నామని వెల్లడించారు. పోలీసు కమిషనర్‌ తఫ్సీర్‌ ఇక్బాల్‌ మాట్లాడుతూ.. బుధవారం నుంచి ప్రతిఒక్కరూ నిబంధలను కచ్చితంగా పాటించాలని, అతిక్రమించిన వారి వాహనాలను సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. ఉదయం, సాయత్రం వాకింగ్‌ చేసేవారిపై, ఆరు బయట షటిల్‌, క్రికెట్‌ ఇతర ఆటలు ఆడేవారిపైనా కేసులు నమోదు చేస్తామన్నారు. విలేకరుల సమావేశంలో అడిషనల్‌ డీసీపీ దాసరి మురళీధర్‌, నగరపాలకసంస్థ కమిషనర్‌ అనురాగ్‌ జయంతి, డీఎంహెచ్‌వో డాక్టర్‌ మాలతి, వైద్యులు కోటిరత్నం, బొల్లికొండ శ్రీనివాసరావు పాల్గొన్నారు. 


logo