గురువారం 02 జూలై 2020
Khammam - Apr 18, 2020 , 00:48:56

సడలిస్తే ప్రమాదమే..

సడలిస్తే ప్రమాదమే..

  • 20 నుంచి కొన్ని రంగాలకు మినహాయింపులు సరికాదు
  • కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు 
  • తెలంగాణ రాష్ట్రంలో పకడ్బందీగా అమలు చేయాలని వినతి 

కరోనా వైరస్‌ పూర్తిస్థాయిలో అదుపులోకి రాలేదు.. దేశవ్యాప్తంగా రోజురోజు కేసులు పెరుగుతున్నాయి.. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను సడలించేందుకు నిర్ణయం తీసుకుంది.. దీనిని ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు.. లాక్‌డౌన్‌ను ఎత్తివేయడం ఎంతమాత్రం మంచిదికాదని, ఇన్ని రోజులు పడ్డకష్టం మొత్తం వ్యర్థమవుతుందని వారు వాపోతున్నారు.. పోలీసులు ఇంత కఠినంగా వ్యవహరిస్తేనే ప్రజలు బయట తిరుగుతున్నారని, లాక్‌డౌన్‌ను సడలిస్తే ప్రజలు ఒక్కసారిగా బయటకు వస్తే వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశం ఉందని ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లేనని ప్రజలు అంటున్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ/ఖమ్మం మామిళ్లగూడెం: కరోనా (కొవిడ్‌-19) వ్యాప్తి పూర్తిస్థాయిలో అదుపులోకి రాకముందే ఈ నెల 20 నుంచి కేంద్ర ప్రభుత్వం దశల వారీగా లాక్‌డౌన్‌ను సడలించేందుకు నిర్ణయం తీసుకోవడం పట్ల ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదకరమైన వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్న దశలో కొన్ని రంగాలకు సడలింపులు ఇస్తూ కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేయడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కరోనా వైరస్‌ పూర్తి నియంత్రణలోకి వచ్చే వరకూ లాక్‌డౌన్‌ను కొననసాగించాలని, రాష్ట్రంలోనైనా పకడ్బందీగా అమలుచేయాలని, తాము పూర్తి సహకారం అందిస్తామని ప్రజలు కోరుతున్నారు. సడలింపులపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 

కరోనా వైరస్‌ను అంతమొందించేంత వరకు విశ్రమించేది లేదని తెగేసి చెప్తున్నారు ఉమ్మడి జిల్లా ప్రజలు. 26 రోజులుగా కొనసాగుతున్న లాక్‌డౌన్‌తో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. నిత్యావసర వస్తువులు, అత్యవసర పనులు ఉన్న వారు తప్ప మిగతా వారందరూ స్వీయ నియంత్రణ పాటిస్తూ కరోనా మహమ్మారిపై యుద్ధభేరి మోగిస్తున్నారు. మార్చి 24 నుంచి ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం ప్రజల విజయమేనని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌ ఎంవీ రెడ్డి అభిప్రాయపడ్డారు. కాగా కేంద్ర ప్రభుత్వం సూచించిన విధంగా జోన్ల పద్ధతి కాకుండా సంపూర్ణ లాక్‌డౌన్‌ను పాటించేందుకు జిల్లా వాసులు మొగ్గుచూపుతున్నారు.  

లాక్‌డౌన్‌ మరింత గట్టిగా అమలుచేయాలి...

“కరోనా వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను మరింత గట్టిగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో కొన్ని రంగాలకు సడలింపు ఇవ్వనుండడం సరికాదు. వైరస్‌ మరింత వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది.” 

-మునగాల రామకృష్ణ, మెడికల్‌ షాపు యజమాని, ఖమ్మం

ఇబ్బందులున్నా ఆరోగ్యమే ప్రధానం..

“కరోనా వైరస్‌ను అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ప్రజలందరమూ సహకరిస్తున్నాం. ఆరోగ్యమే ప్రధానం కాబట్టి ఇబ్బందులున్నా భరిస్తున్నాం. వైరస్‌ వ్యాప్తిని పూర్తిగా అరికట్టిన తరువాతే లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తే బాగుంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుండడం సంతోషం.” 

-తమ్మిశెట్టి ఉపేందర్‌, రైతు, ఖమ్మం  

సడలింపు అవసరం లేదు..

“కరోనా వైరస్‌ నివారణకు ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌లో కొన్ని రంగాలకు నిబంధనలు సడలించాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ప్రజలు కొంత ఇబ్బందులు పడినా కాస్త ఓపిక పడితే ప్రాణాలు పదిలంగా ఉంటాయి. కంటికి కనిపించకుండా ప్రాణాలు తీస్తున్న వైరస్‌ కంటే ప్రస్తుతం ప్రజలు పడుతున్న ఇబ్బందులు అంత కష్టమైనవేమీ కాదు. వైరస్‌ను పూర్తిగా అదుపు చేసేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా సహకరిస్తాం.” 

-బీ.జీవిత, గృహిణి, ఖమ్మం

సడలింపుపై కేంద్రం పునరాలోచించాలి..

“కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్‌ను పూర్తిగా కొనసాగించాలి. అయితే ఈ నెల 20 నుంచి కేంద్ర ప్రభుత్వం కొన్ని రంగాలకు మినహాయింపులు ఇవ్వడం సరికాదు. దేశంలో ఉన్న కరోనా వైరస్‌ వ్యాప్తి పరిస్థితులను మరోసారి గమనించి కేంద్రం పునరాలోచించాల్సిన అవసరం ఉంది.” 

-కొడెం తార, మాజీ సర్పంచ్‌, ఖానాపురం హవేలీ; ఖమ్మం 

తగ్గే వరకు ఇంట్లో ఉండటమే మంచిది

“అదేదో మాయదారి రోగం వచ్చిందట. ఎవరూ ఎవరినీ కలవొద్దట. అందుకోసం ఎవరూ ఇంటి నుంచి బయటికి వెళ్లొద్దట. అందుకే అందరమూ ఇంట్లోనే ఉంటున్నాం. కరోనా పూర్తిగా తగ్గేంత వరకు ఇంటి వద్దనే ఉండటం మంచిది. బయటికి రాకుండా పూర్తిగా తగ్గిందని సర్కారోళ్లు చెప్పినంకనే బయటికి వస్తాం.”

-నల్లబెల్లి జార్జి, రుద్రంపూర్‌, కొత్తగూడెం

ఇబ్బందులు ఉన్నా తప్పదు..

“కరోనా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించింది. తిండికి ఇబ్బందులు లేకుండా మనిషికి 12 కేజీల చొప్పున బియ్యం ఇచ్చింది. ఖర్చులకు రూ.1500 నగదును కూడా అందించింది. ఇవిగాక మరికొన్ని ఇబ్బందులున్నా ఆరోగ్యంగా ఉండాలంటే ఇంట్లోనే ఉండక తప్పదు. పిల్లల భవిష్యత్‌ కోసమైనా కరోనా తగ్గేంత వరకు ఇంట్లోనే ఉందాం.”

-దరావత్‌ నాగమణి, గృహిణి, కొత్తగూడెం

ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు

“కరోనా వైరస్‌ను అరికట్టాలంటే ఇంటి వద్దనే ఉండాలి. ఈ నెల 20 తరువాత లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించి కొన్ని రంగాలకు మినహాయింపులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించటం కొంత ఇబ్బందికరం. ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు కదా. బతికుంటే ఏదైనా సాధించవచ్చు. ప్రాణాలతో చెలగాటం వద్దు. మేమంతా లాక్‌డౌన్‌ను పాటిస్తాం.”

-ఇమ్మడి లక్ష్మయ్య, చండ్రుగొండ

సడలిస్తే మరింత విస్తరిస్తుంది

“లాక్‌డౌన్‌ను సడలించి కొన్ని రంగాలకు మినహాయింపులు ఇస్తే కరోనా వైరస్‌ మరింత విస్తరిస్తుంది. ఆ తరువాత దాన్ని పూర్తిస్థాయిలో అరికట్టడం కష్టం. ప్రస్తుతం ఇంత కఠినంగా అమలు చేస్తున్నా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది. ఈ తరుణంలో సడలింపులు ఇవ్వడం సరైన నిర్ణయం కాదు.”  

 -గుండగాని సమ్మక్క, తుంటుబాలుతండా, ఇల్లెందు 


logo