ఆదివారం 12 జూలై 2020
Khammam - Apr 06, 2020 , 01:23:31

లాక్‌డౌన్‌ మరింత పటిష్టం చేయాలి

లాక్‌డౌన్‌ మరింత పటిష్టం చేయాలి

  • రవాణా శాఖ మంత్రి  పువ్వాడ అజయ్‌కుమార్‌
  • ప్రభుత్వ ప్రధానాసుపత్రిలో ఐసోలేషన్‌ వార్డుల పరిశీలన

ఖమ్మం, నమస్తే తెలంగాణ: కరోనా వైరస్‌ వ్యాప్తిని జిల్లాలో అరికట్టేందుకు చేపట్టిన చర్యలను భవిష్యత్తులో ఇ దేవిధంగా కొనసాగించాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పు వ్వాడ అజయ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. లాక్‌డౌన్‌ను మ రింత పటిష్టం చేయాలన్నారు. ఆదివారం కలెక్టరేట్‌ ప్రజ్ఞా సమావేశ మందిరంలో కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌తో కలిసి వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులతో సమీక్షా నిర్వహించారు. జిల్లాలో ఒక్క పాజిటివ్‌ కేసు నమోదు కాకపోవడంతో అధికార యంత్రాంగం చేసిన కృషిని మంత్రి అభినందించారు. ఇదే స్ఫూర్తితో అధికారులు కరోనాను కట్టడి చేయాలన్నారు. జిల్లా సరిహద్దులో ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితి తీవ్రంగా ఉన్నందున మన జిల్లా సరిహద్దు ప్రాంతాల గ్రామాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇతర ప్రాంతాల నుంచి గ్రామాలకు కొత్తగా వచ్చిన వారి సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరించాలన్నారు. గతంలోనూ వచ్చిన వారిపై నిఘా పెట్టాలని మంత్రి చెప్పారు. మరో నెలరోజులపాటు ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఇవ్వరాదని మంత్రి అధికారులను ఆదేశించారు. జిల్లాకు ఇప్పటి వరకు విదేశాల నుంచి వచ్చిన, ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లివచ్చిన, ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన వారి వివరాలను మంత్రి సమీక్షించారు. కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటి వరకు 571 మంది విదేశాల నుంచి వచ్చారని, వారిలో 556 మందిని హోమ్‌ క్వారంటైన్‌లో ఉంచినట్లు తెలిపారు. ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లివచ్చిన 10 మందిని శారద పాలిటెక్నిక్‌ కళాశాల, ప్రభుత్వ క్వారంటైన్‌లో ఉంచినట్లు తెలిపారు. జిల్లా ప్రధాన ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కరోనా ఐసోలేషన్‌లో ఇప్పటి వరకు 139 మంది రక్త నమూనాలను సేకరించి నిర్ధారణకు పంపగా వారిలో 111 నమూనాలు నెగిటివ్‌గా రిపోర్టు వచ్చిందన్నారు. మరో 28 నమూనాల రిపోర్డులు రావాల్సి ఉందని తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, డీఎంహెచ్‌వో డాక్టర్‌ మాలతి, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వెంకటేశ్వర్లు, డీఆర్‌వో శిరీష, డీఎస్‌ఓ డాక్టర్‌ కోటిరత్నం, ఆర్‌ఎంవో డాక్టర్‌ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

 పకడ్బందీగా చర్యలు చేపట్టాం..

మయూరి సెంటర్‌:జిల్లాలో కరోనా వైరస్‌ కట్టడికి పకడ్బందీ చర్యలు చేపట్టామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ తెలిపారు. ఆదివారం జిల్లా కలెక్టర్‌ ఆర్‌వీ. కర్ణన్‌తో కలిసి జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కరోనా ప్రత్యేక విభా గాలను  మంత్రి సందర్శించారు. ఇన్‌ పేషెంట్‌, ఔట్‌ పేషెంట్‌, ఐసీయూ వార్డులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు పాజిటివ్‌ కేసులు నమోదు కాలేదని, వైరస్‌ ప్రబల కుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నా మన్నారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 170 పడకలతో పాటు అదనంగా 50 ఐసీయూ బెడ్స్‌, మమత ఆసుపత్రిలో 200 పడకలు, ఐసోలేషన్‌ వార్డుతో పాటు, శారద పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రభుత్వ క్వారంటైన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. కలెక్టర్‌ నేతృత్వంలో వైద్యాధికారులు పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తు అప్రమత్తంగా ఉన్నారని మంత్రి అన్నారు. ప్రధాన ఆసుపత్రిలో ప్రస్తుతం 200 పీపీఈ కిట్స్‌ అందు బాటులో ఉన్నాయని, ఆదివారం మరో వెయ్యి కిట్స్‌ తెప్పించి సిబ్బందికి మంత్రి అందజేశారు. ఏప్రిల్‌ 14 వరకు ప్రజలందరూ లాక్‌డౌన్‌ను తప్పనిసరిగా పాటించాలని, అత్యవసర, వైద్య సేవలకు తప్ప రోడ్లపైకి రావద్దని మంత్రి ప్రజలను కోరారు. గృహ నిర్బంధం పాటించడం ద్వారా మన కుటుంబాన్ని రాష్ర్టాన్ని, దేశం మొత్తాన్ని కాపాడుకున్నవారమవుతామని, ప్రజలు ప్రభుత్వానికి పూర్తిగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. 

నగరంలో పర్సనల్‌ శానిటైజర్‌ ఎన్‌క్లోజర్‌..

కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణలో భాగంగా ఆధునిక సాంకేతికతో రూపొందించబడిన పర్సనల్‌ శానిటైజర్‌ ఎన్‌ క్లోజర్‌ను నగరంలోని సర్దార్‌ పటేల్‌ స్టేడియం వద్ద ప్రజలకు అందుబాటులోకి తెచ్చినట్లు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ తెలిపారు. ఆదివారం ఈ శాని టైజర్‌ ఎన్‌క్లోజర్‌ను మంత్రి అజయ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పర్సనల్‌ శానిటైజర్ల లో ప్రజలు 25 సెకన్ల పాటు నిలబడితే వారి దుస్తువులపై ఉండే వైరస్‌లు నశిస్తాయన్నారు. కార్యక్రమంలో కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌, నగర మేయర్‌ డాక్టర్‌ పాపాలాల్‌, నగరపాలక సంస్థ కమిషనర్‌ అనురాగ్‌ జయంతి, డిప్యూటీ మేయర్‌ బత్తుల మురళీప్రసాద్‌, పబ్లిక్‌ హెల్త్‌ ఎగ్జిక్యూటీవ్‌ ఇంజినీర్‌ రంజిత్‌ కుమార్‌, మున్సిపల్‌ శాఖ డీఈ ధరణీకుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 


logo