బుధవారం 03 జూన్ 2020
Khammam - Apr 03, 2020 , 01:48:16

కమనీయం.. సీతారాముల కల్యాణం

కమనీయం.. సీతారాముల కల్యాణం

భద్రాచలం, నమస్తే తెలంగాణ : దక్షిణ అయోధ్య పురి అయిన భద్రాద్రిలో శ్రీసీతారాముల కల్యాణ వేడుక కనువల పండువగా జరిగింది.. వేదమంత్రాల ఘోష, మంగళవాద్యాల చప్పుళ్ల మధ్య రామాలయంలోని బేడా మండపంలో గురువారం మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్‌ లగ్నంలో నేత్రపర్వంగా సాగింది.. తొలుత అర్చకులు ధ్రువమూర్తుల కల్యాణం నిర్వహించారు. శ్రీసీతారామచంద్రస్వామివారిని మంగళవాద్యాల చప్పుళ్ల నడుమ బేడా మండపానికి తీసుకొచ్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యఃవచనం, రక్షా బంధనం, మోక్షబంధనం గావించారు. రామయ్య కుడి చేతికి, సీతమ్మకు ఎడమ చేతికి రక్షాసూత్రాలు తొడిగారు. గోదానం చేసి మహాసంకల్పం పఠించారు. సాక్షాత్‌ విష్ణు స్వరూపుడైన శ్రీరామునికి శ్రీమహాలక్ష్మీ స్వరూపమైన సీతను జగత్కల్యాణార్థ్ధం కన్యాదానం చేశారు. సీతారాముల కల్యాణ వైభవాన్ని చాటిచెప్పే రూపం చుర్గిక పఠించారు. మంగళవాద్యాలు మారు మోగుతుండగా వేద మంత్రాల మధ్య అభిజిత్‌ లగ్నం సమీపించగానే అర్చకులు జీలకర్ర, బెల్లం మిశ్రమాన్ని సీతారాముల శిరస్సుపై ఉంచారు. మాంగళ్య పూజలో మంగళసూత్రంతో పాటు ముగ్గురు అమ్మవార్లను ఆవాహనం చేశారు. జనకమహారాజు, దశరథమహారాజు తరఫున చేయించిన రెండు మంగళసూత్రాలతో పాటు భక్తరామదాసు సీతమ్మకు చేయించిన మరొక మంగళసూత్రం కలిపి మూడు సూత్రాలతో మాంగళ్యధారణ గావించారు. స్వామివారికి పచ్చల పతకం, సీతమ్మకు చింతాకు పతకం, లక్ష్మణస్వామికి రామమాడ అలంకరించారు. కరోనా కట్టడి కోసం లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో అర్చకులు, ఆలయ అధికారులు ఈ వేడుకలను నిరాడంబరంగా నిర్వహించారు.. శుక్రవారం ఆలయంలో కనుల పండువగా శ్రీరామపట్టాభిషేకం జరుగనుంది. 

పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు అందజేత...

రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రమణాచారి, దేవాదాయశాఖ కమిషనర్‌ అనీల్‌కుమార్‌, ప్రభుత్వం తరఫున శ్రీసీతారామచంద్రస్వామివారికి పట్టువస్ర్తాలు, ముత్యా ల తలంబ్రాలు అందజేశారు. కల్యాణానికి హాజరైన వారిలో మహబూబాబాద్‌ ఎంపీ మాలోతు కవిత, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, జడ్పీ చైర్మన్‌ కోరం కనకయ్య, ఎస్పీ సునీల్‌దత్‌, జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మణ్‌, భద్రాచలం న్యాయమూర్తి సురేశ్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ దిండిగాల రాజేందర్‌, ఆర్డీవో స్వర్ణలత, ఏఎస్పీ రాజేశ్‌చంద్ర, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ తెల్లం వెంకట్రావు, ఆలయ ప్రధాన అర్చకులు సీతారామానుజాచార్యులు, విజయరాఘవన్‌, స్థానాచార్యులు స్థలసాయి, వేద పండితులు గుదిమెళ్ల మురళీకృష్ణమాచార్యులు పాల్గొన్నారు.

యాప్‌ ద్వారా రామయ్య తలంబ్రాలు..

కల్యాణ మహోత్సవాన్ని భక్తులు నేరుగా వీక్షించలేకపోయిన నేపథ్యంలో తలంబ్రాలు పొందేందుకు T-App Folio యాప్‌ను ప్రారంభించినట్లు భద్రాద్రి రామాలయ అధికారులు తెలిపారు. గురువారం ఆలయంలో ఈ యాప్‌ను రాష్ట్ర దేవాదాయశాఖమంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ప్రారంభించారు. 

పర్ణశాలలో సాదాసీదాగా..

పర్ణశాల: పర్ణశాల ఆలయంలో గురువారం అర్చకులు నిరాడంబరంగా శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణ వేడుక నిర్వహించారు. అభిజిత్‌ లగ్నంలో వేదపండితులు నర్సింహాచార్యులు, అర్చకుడు కిరణ్‌కుమారాచార్యులు, భార్గవాచార్యులు కల్యాణం జరిపించారు. ఆలయ సూపరింటెండెంట్‌ భవానీ రామకృష్ణ దంపతులు కల్యాణానికి పట్టువస్ర్తాలు తీసుకురాగా తహసీల్దార్‌ శ్రీనివాసరావు, ఎంపీడీవో మల్లేశ్వరి, సీఐ వెంకటేశ్వర్లు అందజేశారు. 


logo