బుధవారం 03 జూన్ 2020
Khammam - Mar 30, 2020 , 01:10:02

సామాజిక దూరం తప్పనిసరి

సామాజిక దూరం తప్పనిసరి

  • దూరప్రాంతాల నుంచి వచ్చిన వారి వివరాలివ్వండి
  • ప్రజలకు అవగాహన కల్పిస్తున్న అధికారులు, పోలీసులు
  • పాలేరు నియోజకవర్గంలో కొనసాగుతున్న లాక్‌డౌన్‌ 

(ఖమ్మం రూరల్‌, నమస్తే తెలంగాణ/ కూసుమంచి/ కూసుమంచి రూరల్‌/ నేలకొండపల్లి/ తిరుమలాయపాలెం): కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు సామాజిక దూరం తప్పనిసరి అని అధికారులు, పోలీసులు సూచిస్తున్నారు. ఈ మేరకు ప్రజలకు, వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు. పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి, ఖమ్మం రూరల్‌, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం మండలాల్లో ఆదివారం కూడా లాక్‌డౌన్‌ కొనసాగింది. హైదరాబాద్‌ - ఖమ్మం ప్రధాన రహదారిపై నాయకన్‌గూడెం చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. జిల్లాలో ఎవరు అడుగు పెట్టినా వారి పూర్తి వివరాలు సేకరించాకే లోపలికి అనుమతిస్తున్నారు. అనుమానితులు ఉంటే సీపీ తఫ్సీర్‌ ఇక్బాల్‌ను సంప్రదించి ఆయన ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నారు. చేగొమ్మ సొసైటీ చైర్మన్‌, డీసీసీబీ డైరెక్టర్‌ ఇంటూరి శేఖర్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు మల్లీడి వెంకటేశ్వరరావు కూసుమంచిలో కరోనా గురించి అవగాహన కల్పించారు. ఖమ్మం రూరల్‌ మండలం గూడూరుపాడు, తనగంపాడు పంచాయతీల్లో హర్షిణీ డెవలపర్స్‌ ఎండీ, సొసైటీ డైరెక్టర్‌ అల్లిక వెంకటేశ్వరరావు మాస్కులను పంపిణీ చేశారు. కూసుమంచి మండలం గైగోళ్లపల్లిలో 80 మాస్కులు పంపిణీ చేశారు. మహారాష్ట్ర నుంచి మిర్చికోతలకు వచ్చిన కూలీలకు మునిగేపల్లిలో 5 క్వింటాళ్ల బియ్యం పంపిణీ చేశారు. నేలకొండపల్లిలో పిచికారీ చేసేందుకు సోడియం హైపోప్లోరైడ్‌ ద్రావణాన్ని సొసైటీ చైర్మన్‌, డీసీఎంఎస్‌ డైరెక్టర్‌ నాగుబండి శ్రీనివాసరావు అందించారు. తిరుమలాయపాలెం మండలంలో 40 మంది సర్పంచ్‌లు, 18 మంది ఎంపీటీసీలు తమ ఒక నెల గౌరవ వేతనం రూ.3 లక్షలను సీఎంఆర్‌ఎఫ్‌కు విరాళంగా ప్రకటించారు. ఆదివారం ఎంపీడీవో, తహసీల్దార్‌లకు ఆ చెక్కు అందజేశారు. తిరుమలాయపాలెం మండలంలోని పలు అంగన్‌వాడి కేంద్రాల్లో ఆదివారం మహిళా దివ్యాంగులకు బియ్యం, పప్పు పంపిణీ చేశారు. 

క్వారంటైన్‌కు అనుమానితుడు

ఈ నెల 14 నుంచి 17 వరకూ ఢిల్లీ ఉండి వచ్చిన ఖమ్మం రూరల్‌ మండలానికి చెందిన ఓ వ్యక్తిని అధికారులు ఆదివారం క్వారంటైన్‌కు తరలించారు. ఢిల్లీలో మత ప్రార్థనల్లో జిల్లాకు చెందిన 9 మంది పాల్గొన్నారు. అందులో మండలానికి చెందిన ఆ వ్యక్తి కూడా ఉన్నాడు. అయితే ఆ ప్రార్థనల్లో పాల్గొన్న మరో ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఈ నెల 28న కరోనాతో చనిపోవడంతో వెంటనే అధికారులు అప్రమత్తమై రూరల్‌ మండలానికి చెందిన వ్యక్తిని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలోని క్వారంటైన్‌కు తరలించారు. 

కార్మికులకు నిత్యావసరాలు పంపిణీ

చింతకాని, మార్చి 29 : మండలంలో తిమ్మినేనిపాలెం, తిర్లాపురం గ్రామాల్లోని ఇటుక బట్టీలు, డబుల్‌ బెడ్‌రూం నిర్మాణ పనులు నిర్వహిస్తున్న 78 వలస కార్మిక కుటుంబాలకు ఆదివారం రూ.లక్ష విలువైన సామగ్రిని సర్పంచ్‌ దమ్మాలపాటి శ్రీదేవి, ఇటుక బట్టీ నిర్వాహకులు అందించారు. బాధితులకు 50 కేజీల బియ్యం, కూరగాయలు, వంట సరుకులు అందించారు. మండలంలోని ఆయా గ్రామాల్లో సర్పంచుల ఆధ్వర్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా బ్లీచింగ్‌ను వీధుల్లో ముమ్మరంగా చల్లించారు. 

పాలిటెక్నిక్‌ కళాశాల ఉద్యోగుల ఆందోళన

రఘునాథపాలెం: కరోనా నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటించిన సెలవుల్లో ఉన్న తమను మే ఒకటి నుంచి విధులకు రావద్దంటూ రఘునాథపాలెంలోని ఎస్‌ఎన్‌మూర్తి కళాశాల ఉత్తర్వులు జారీ చేయడం పట్ల ఉద్యోగులు, సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. 


logo