బుధవారం 03 జూన్ 2020
Khammam - Mar 29, 2020 , 02:26:44

నేటి నుంచి భద్రాద్రిలో నవాహ్నిక బ్రహ్మోత్సవాలు

నేటి నుంచి భద్రాద్రిలో నవాహ్నిక బ్రహ్మోత్సవాలు

  • వెండి కలశాలతో స్వామివారికి అభిషేకం
  • దీక్షా వస్ర్తాలు అందించనున్న ఈవో నరసింహులు

భద్రాచలం, నమస్తే తెలంగాణ: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో క్షేత్ర మాసోత్సవాల్లో భాగంగా ఆదివారం నవాహ్నిక బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. అర్చకులు ముందుగా ఉత్సవ మూర్తులకు బేడా మండపంలో ఉత్సవారంభ స్నపనం నిర్వహిస్తారు. ఉదయం 7 గంటలకు స్వామివారిని బేడా మండపంలో వేంచేయింప చేస్తారు. 8 గంటలకు అర్చకులు పవిత్ర గోదావరి నది నుంచి తీర్థబిందె తీసుకొచ్చి అభిషేకం, విశ్వక్సేన ఆరాధన, రక్షాబంధన  నిర్వహిస్తారు. ఆలయ అధికారులకు ఆచార్య, బ్రహ్మ, రుత్వికులకు వేద శాస్త్ర ఇతిహాస పురాణాదుల వారికి దేవస్థానం ఈవో నరసింహులు చేతుల మీదుగా దీక్షా వస్ర్తాలు ఇస్తారు. తొమ్మిది వెండి కలశాలతో స్వామివారికి అభిషేకం నిర్వహిస్తారు. మహాకుంభాన్ని మూలమూర్తులకు ప్రోక్షిస్తారు. అనంతరం ఆచార్య, బ్రహ్మ, రుత్వికులకు, మూలమూర్తులు, ఉత్సవ మూర్తులకు కంకణ ధారణ గావిస్తారు. సాయంత్రం యాగశాలలో అంకురారోపణ, పుట్ట మట్టితో పూజలు, నవ ధాన్యాలతో అంకురారోపణ, అఖండ దీపారాధన, ద్వారతోరణ పూజ, వాస్తు పూజ నిర్వహిస్తారు.కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఉత్సవాలు సాదాసీదాగా జరుగనున్నాయి.

సర్వాంగ సుందరంగా రామాలయం

దేవాదాలయ అధికారులు ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. చలువ పందిళ్లతో ఆలయ ప్రాంగణం కళకళలాడుతున్నది. విద్యుదీపాలంకరణ రాత్రిళ్లు కాంతులీనుతున్నది. 31న అగ్నిప్రతిష్ట, ధ్వజారోహణం, ఏప్రిల్‌ 1న ఎదుర్కోలు ఉత్సవం, 2న శ్రీసీతారాముల కల్యాణం, 3న శ్రీరామ పట్టాభిషేకం నిర్వహించనున్నట్లు విశ్రాంత ప్రధాన అర్చకుడు పొడిచేటి జగన్నాథచార్యులు తెలిపారు. రామాలయం అనుబంధ ఆలయమైన పర్ణశాల రామాలయంలోనూ నవాహ్నిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు. ఆదివారం నుంచి స్వామివారికి దర్బార్‌ సేవలు, పవళింపు సేవలు, వెండి రథ సేవలు, ఆర్జిత సేవలు నిలిపివేస్తున్నట్లు వివరించారు.


logo