బుధవారం 03 జూన్ 2020
Khammam - Mar 29, 2020 , 02:17:50

స్వీయ నియంత్రణే శ్రీరామరక్ష

స్వీయ నియంత్రణే శ్రీరామరక్ష

 • పారిశుధ్య పనులు ముమ్మరంగా చేపట్టాలి
 • సామాజిక దూరం పాటించాలి
 • ధాన్యం కొనుగోలు కేంద్రాలను గ్రామాల్లో ఏర్పాటు చేయాలి..
 • విదేశాల నుంచి వచ్చే వారిని తప్పనిసరిగా క్వారంటైన్‌ చేయాలి..
 • ఐసోలేషన్‌ వార్డులను పెంచుకోవాలి
 • అతికొద్దిమందితో సీతారామ కల్యాణం నిర్వహించుకోవాలి
 • కరోనా వైరస్‌పై అధికారుల సమీక్షలో రవాణామంత్రి పువ్వాడ అజయ్‌
 • అధికారుల చర్యలు భేష్‌ : ఎంపీ కవిత, జెడ్పీ చైర్మన్‌, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు

‘కరోనా ప్రపంచాన్ని కబళిస్తున్నది.. మానవాళిని అతలాకుతలం చేస్తున్నది.. జాగ్రత్తలు పాటించి  కొవిడ్‌-19పై మనదే విజయమని నిరూపిద్దాం.. అందుకు ప్రతిఒక్కరూ సహకరించాలి.. అధికారులు అనుక్షణం అప్రమత్తంగా ఉండి ప్రజలను మహమ్మారి నుంచి కాపాడాలి.. వైద్యారోగ్యశాఖ జిల్లాలో ఐసోలేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేసుకోవాలి.. వాటిలో అన్ని వసతులు ఉండేలా చర్యలు తీసుకోవాలి.. అవసరమైన అన్ని పరికరాలు సమకూర్చుకోవాలి..’ అని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు.. శనివారం కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని క్లబ్‌లో కలెక్టర్‌ ఎంవీ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.. భద్రాద్రి బ్రహ్మోత్సవాలకు భక్తులెవరూ రావొద్దని, శ్రీరామనవమికి స్వామివారి కల్యాణోత్సవాలను సైతం నిరాడంబరంగా నిర్వహించాలని సూచించారు.. ఏప్రిల్‌ 14వరకు అందరూ స్వీయ నిర్బంధం పాటించాలని.. అదే మనకు శ్రీరామరక్ష అన్నారు.. సమావేశంలో ఎంపీ కవిత, ప్రభుత్వ విప్‌ రేగా, ఎమ్మెల్యేలు వనమా, హరిప్రియ, జడ్పీ చైర్మన్‌ కోరం, ఎమ్మెల్సీ బాలసాని పాల్గొన్నారు.. - భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : కంటికి కనిపించకుండా వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్‌  వ్యాప్తి నిరోధానికి స్వీయ నియంత్రణే శ్రీరామరక్ష అని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. వైరస్‌ వ్యాపించకుండా అంతిమ లక్ష్యంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం క్లబ్‌లో కరోనా వైరస్‌ నిర్మూలనపై జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అజయ్‌ మాట్లాడుతూ.. ముందస్తుగా వైద్యశాలల్లో ఐసోలేషన్‌ వార్డులను పెంచుకోవాలన్నారు. మందులు, టెస్టింగ్‌ కిట్‌లు సరిపడా ఉన్నాయా లేవా అని కలెక్టర్‌ ఎంవీ రెడ్డిని, వైద్యారోగ్యశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పట్టణాలు, గ్రామపంచాయతీల్లో లాక్‌డౌన్‌ను పూర్తిస్థాయిలో అమలు చేయాలన్నారు. పారిశుధ్య పనులను ముమ్మరం చేయాలని ఆదేశించారు. స్వీయ నిర్బంధం పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విదేశాలు, ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు విదేశాల నుంచి 194 మంది జిల్లాకు వచ్చినట్లు గుర్తించామని, వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి హోం క్వారంటైన్‌లో, వైద్యుల పర్యవేక్షణలో ఉంచామని అసిస్టెంట్‌ కలెక్టర్‌ దురిశెట్టి అనుదీప్‌ మంత్రికి తెలిపారు. బియ్యం పంపిణీలో సామాజిక దూరం కచ్చితంగా పాటించాలని, గుంపులు గుంపులుగా వచ్చిబియ్యం తీసుకోకుండా చర్యలు చేపట్టాలని డీఎస్‌వోను ఆదేశించారు. ఇప్పటికే 60 శాతం బియ్యం పంపిణీ కేంద్రాలకు చేరాయని, మిగిలిన బియ్యాన్ని కూడా చేరవేస్తున్నామని చెప్పారు. వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని మార్కెటింగ్‌ అధికారులను మంత్రి అజయ్‌ ఆదేశించారు. 216 గ్రామాల్లో తక్షణమే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేశామని రవాణాధికారి రవీందర్‌ తెలిపారు. సరిహద్దుల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేశామన్నారు. అనుమానితులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని మంత్రి అజయ్‌కుమార్‌కు వివరించారు. జిల్లా కేంద్రంలో ఇప్పటికే మూడు పాజిటివ్‌ కేసులు ఉన్నందున పారిశుధ్య నివారణకు తీసుకుంటున్న చర్యలపై మున్సిపల్‌ కమిషనర్లను అడిగి తెలుసుకున్నారు. జిల్లా కేంద్రంలో బ్లీచింగ్‌, సోడియం హైపో క్లోరైడ్‌ ద్రావణాన్ని అన్ని ప్రాంతాల్లో స్ప్రే చేసినట్లు చెప్పారు. అంతేకాకుండా ఇంటింటి సర్వే నిర్వహించి అనుమానితులు ఉంటే హైదరాబాద్‌కు పంపుతున్నామని అసిస్టెంట్‌ కలెక్టర్‌ అనుదీప్‌ మంత్రికి తెలిపారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన డీఎస్పీ కుమారుడు, డీఎస్పీతో పాటు వంట మనిషితో ప్రత్యక్షంగా సంబంధం ఉన్న వారందరినీ కరోనా పరీక్షల్లో నెగిటీవ్‌ వచ్చినా హోం క్వారంటైన్‌ చేశామన్నారు. హోం క్వారంటైన్‌లో ఉండకుండా నిబంధనలు అతిక్రమించిన రామ్మూర్తి అనే వ్యక్తిని మణుగూరులోని ఐసోలేషన్‌ వార్డుకు తరలించామన్నారు. ఇప్పటికే మణుగూరులో వంద పడకల ఐసోలేషన్‌ వార్డును ఏర్పాటు చేశామని, భద్రాచలం, కొత్తగూడెం, పాల్వంచలో కూడా ఐసోలేషన్‌ వార్డులు ఉన్నాయన్నారు. అనంతరం డీఎంహెచ్‌వో భాస్కర్‌నాయక్‌ను వైద్య ఆరోగ్యశాఖ తీసుకుంటున్న చర్యలపై అడిగి తెలుసుకున్నారు. ప్రైమరీ కాంటాక్ట్స్‌, సెకండరీ కాంటాక్ట్స్‌ ఎవరినీ వదిలిపెట్టవద్దని సూచించారు. డీపీఏ కిట్లు, మాస్కులు, శానిటైజర్లు టెస్టింగ్‌ కిట్స్‌, రక్తపూతల సేకరణకు శిక్షణ పొందిన వారు ఎంత మంది ఉన్నారని, ఎన్‌-95 మాస్కులు ఎన్ని ఉన్నాయని మంత్రి అడిగి తెలుసుకున్నారు. కొత్తగూడెం జిల్లా కేంద్రాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించినందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి కరోనాను నిరోధించడమే అంతిమ లక్ష్యంగా పనిచేయాలని మంత్రి అజయ్‌కుమార్‌ అన్నారు. శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కల్యాణాన్ని అతి తక్కువ మందితో నిర్వహిస్తామన్నారు. ప్రజలందరూ టీవీల ద్వారా మాత్రమే వీక్షించాలని, ఎవరూ భద్రాచలం రాకూడదన్నారు. ఆదివారం సాయంత్రం సీఎం కేసీఆర్‌ అన్ని జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. ఏప్రిల్‌ 14 వరకు లాక్‌డౌన్‌ ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. రోడ్లపైకి వచ్చే వారిపై చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ప్రతి గ్రామంలో ఏఎన్‌ఎం, ఆశలు, అంగన్‌వాడీ టీచర్లు, పంచాయతీ సిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహించి విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించాలన్నారు. పారిశుధ్య కార్మికులకు తప్పనిసరిగా మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్‌, హ్యాండ్‌వాషర్లు అందించి అవగాహన కల్పించాలన్నారు. ఈ సమీక్షలో జెడ్పీ వైస్‌ చైర్మన్‌ కంచర్ల చంద్రశేఖర్‌రావు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కాపు సీతాలక్ష్మి, జిల్లా ఎస్పీ సునీల్‌దత్‌, అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. 

పీడీఎస్‌ బియ్యం పంపిణీ జాగ్రత్తగా చేయాలి

 • మెచ్చ నాగేశ్వరరావు, అశ్వారావుపేట ఎమ్మెల్యే  

ప్రజలందరికీ పీడీఎస్‌ బియ్యం జాగ్రత్తగా పంపిణీ చేయాలి.  ట్రాక్టర్ల ద్వారా వార్డుల వారీగా రేషన్‌కార్డు దారులకు బియ్యంతో పాటు నిత్యావసర వస్తువులను పంపిణీ చేయాలి. కరోనా కట్టడికి అధికారులు చేస్తున్న సేవలు అభినందనీయం.

జిల్లా అధికారుల సేవలు అభినందనీయం

 • ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు

కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఇప్పటి వరకు ప్రభుత్వ అధికారులు తీసుకున్న చర్యలు అభినందనీయం. మణుగూరు బీటీపీఎస్‌, సారపాకలలో పరిశ్రమలు ఉన్న కారణంగా అక్కడ ఇతర రాష్ర్టాల నుంచి వచ్చి పనిచేస్తున్న కార్మికులు అధికంగా ఉన్నారు.  ఒక రూమ్‌లో సుమారు 15 మంది వరకు ఉంటున్నారు. వైరస్‌ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా ఒక రూమ్‌లో తక్కువ మంది ఉండేలా చూడాలి. డయాలసిస్‌ రోగులను ప్రత్యేకంగా చూసి వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి. 

ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలి

 • మహబూబాబాద్‌ ఎంపీ మాలోత్‌ కవిత 

ప్రజలు స్వీయ నియంత్రణ పాటించి కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించాలి. కరోనా కట్టడికి సీఎం కేసీఆర్‌ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు.  ఇతర రాష్ర్టాల నుంచి జిల్లాలో పనిచేస్తున్న కాంట్రాక్టు కూలీలకు పీడీఎస్‌ బియ్యం అందించేందుకు కలెక్టర్‌ చొరవ చూపాలి.  జిల్లాలోని ఎన్‌ఆర్‌ఐలు, పారిశ్రామిక వేత్తలు, ఔత్సాహికుల నుంచి విరాళాలు సేకరించాలి. విరాళాలు ఇచ్చే దాతలను ప్రోత్సహించాలి. 


logo