మంగళవారం 07 జూలై 2020
Khammam - Mar 27, 2020 , 01:04:48

నిర్బంధం నిర్మానుష్యం..

నిర్బంధం నిర్మానుష్యం..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: కరోనా వైరస్‌ నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్‌డౌన్‌కు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజల నుంచి మంచి స్పందన కనిపిస్తున్నది. వారు స్వీయ నిర్బంధం పాటించడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. జిల్లావ్యాప్తంగా అంతర్రాష్ట్ర సరిహద్దులైన అశ్వారావుపేట, భద్రాచలం (చింతూర్‌ రోడ్డు), దమ్మపేట, దుమ్ముగూడెం తదితర ప్రాంతాల్లో పోలీసులు చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, ఆంధ్రా నుంచి వచ్చిన వాహనాలను అడ్డుకుని వెనక్కి పంపించారు. పాల్వంచ మున్సిపాలిటీలో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పర్యటించారు. లాక్‌డౌన్‌పై కమిషనర్‌ శ్రీకాంత్‌, ఇతర అధికారులతో కలిసి సమీక్షించారు. ఐసోలేషన్‌ వార్డులను ఏర్పాటు చేసేందుకుగాను మణుగూరులోని వంద పడకల ఆస్పత్రిని కలెక్టర్‌ డాక్టర్‌ ఎంవీ రెడ్డి పరిశీలించారు.

పాల్వంచ: పట్టణంలో లాక్‌ డౌన్‌ విజయవంతంగా సాగుతున్నది. కేటీపీఎస్‌ కాలనీ పూర్తిగా దిగ్బంధంలో ఉంది. రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి.

చుంచుపల్లి: మండలంలో లాక్‌డౌన్‌ను ఎస్సై అరుణ, ఎంపీపీ బాదావత్‌ శాంతి పర్యవేక్షించారు. నిబంధనలను ఉల్లంఘించి రోడ్డుపైకి వచ్చిన వాహన చోదకులను హెచ్చరించి వదిలేశారు.

నాగారం చెక్‌పోస్ట్‌ తనిఖీ

పాల్వంచ రూరల్‌:  మండలంలోని నాగారం ఆర్టీఏ చెక్‌పోస్టును తహసీల్దార్‌ గంగాభవాని గురువారం తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు.

హెడ్డాఫీస్‌లో మాస్కుల పంపిణీ

కొత్తగూడెం సింగరేణి: కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు సింగరేణి హెడ్డాఫీస్‌లో ఉద్యోగులు, వ్యాపారులకు ఉచితంగా మాస్కులను డైరెక్టర్‌(పా) చంద్రశేఖర్‌ గురువారం పంపిణీ చేశారు.

పెరుగన్నం ప్యాకెట్ల పంపిణీ

పాల్వంచ: లాక్‌డౌన్‌ విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి, బిచ్చగాళ్లకు పెరుగన్నం ప్యాకెట్లను స్థానిక  అంబేద్కర్‌ సెంటర్‌లోగల విశ్వం కర్రీ పాయింట్‌ యజమాని వీసంశెట్టి విశ్వేశ్వరరావు గురువారం అందజేశారు. మతి స్థిమితం లేని వారికి, బిచ్చగాళ్లకు రెండు రోజులుగా అన్నం ప్యాకెట్లను కేటీపీఎస్‌ కార్మికుడు దుగ్గిరాల సుధాకర్‌ అందజేస్తున్నారు.

భద్రాచలం నియోజకవర్గంలో...

భద్రాచలం, నమస్తే తెలంగాణ: పట్టణంలో లాక్‌డౌన్‌ను ఏఎస్పీ రాజేశ్‌చంద్ర ఆధ్వర్యంలో పట్టణ సీఐ వినోద్‌, ఎస్సైలు నరేశ్‌, సురేశ్‌ సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. వైద్యారోగ్య శాఖ సిబ్బంది సర్వే నిర్వహిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలను సేకరిస్తున్నారు. పంచాయతీల్లో పారిశుధ్య పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలపై రెవెన్యూ యంత్రాంగం నిఘా వేసింది. పట్టణంలోని పలు దుకాణాలను గురువారం తూనికలు, కొలతల శాఖ అధికారులు, సిబ్బంది పరిశీలించారు.

దుమ్ముగూడెం: మండల కేంద్రమైన లక్ష్మీనగరంలో లాక్‌డౌన్‌ అమలును గురువారం సీఐ వెంకటేశ్వర్లు సమీక్షించారు. పోలీస్‌ సిబ్బందితో ఆయన మాట్లాడుతూ... అనవసరంగా రోడ్లపైకి వాహనాలతో వచ్చే వారితో కఠినంగా వ్యవహరించాలన్నారు. అత్యవసరమైతే తప్ప ఎవరినీ బయటకు అనుమతించవద్దని ఆదేశించారు.

పర్ణశాల: దుమ్ముగూడెం మండలం ప్రగళ్లపల్లి పంచాయతీ ప్రజలకు గురువారం ఎంపీటీసీ సభ్యుడు రామారావు, సర్పంచ్‌ లక్ష్మి అవగాహన కల్పించారు.

రేషన్‌ పంపిణీకి ఏర్పాట్లు

దుమ్ముగూడెం: లాక్‌డౌన్‌ నేపథ్యంలో నిరుపేదలకు రేషన్‌ అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తహసీల్దార్‌ శ్రీనివాసరావు తెలిపారు. లక్ష్మీనగరం తహసీల్‌లో గురువారం రేషన్‌ డీలర్లతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ.. శుక్రవారం నుంచి మండలవ్యాప్తంగా రేషన్‌ అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు. రేషన్‌ దుకాణాల వద్ద వినియోగదారులు గుమిగూడకుండా ముందుగా టోకెన్లు ఇస్తున్నట్లు చెప్పారు. అనంతరం, లక్ష్మీనగరంలోని కిరాణా దుకాణాలను పరిశీలించారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే నిత్యావసర సరుకులు, కూరగాయలు విక్రయించాలని ఆదేశించారు. ధరల పట్టికను దుకాణాల ఎదుట తప్పనిసరిగా ప్రదర్శించాలన్నారు. ఆర్‌ఐ మల్లన్న పాల్గొన్నారు.

శుభకార్యాలొద్దు

పర్ణశాల: దుమ్ముగూడెం మండలం బండిరేవు గ్రామంలో శుభకార్యం నిర్వహిస్తున్నారనే సమాచారంతో గురువారం అక్కడకు ఎంపీడీవో బైరవ మల్లేశ్వరి, జడ్పీటీసీ సభ్యురాలు సీతమ్మ వెళ్లారు. శుభకార్యం నిర్వహిస్తున్న కుటుంబ సభ్యులు, బంధువులకు కరోనా వైరస్‌ వాప్తిపై అవగాహన కల్పించా రు. అందరి క్షేమం కోసం శుభకార్యాన్ని నిర్వహించవద్దని, కొన్ని రోజులపాటు వాయిదా వేసుకోవాలని కోరారు. పొలాల్లోని కూలీల వద్దకు జడ్పీటీసీ సభ్యురాలు వెళ్లి, కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు పాటించాల్సిన జాగ్రత్తలను వివరించారు. సర్పంచ్‌ జయ, పర్ణశాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్‌సీ) హెచ్‌ఏ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు

పాల్వంచ: పాల్వంచ పట్టణంలోని అంబేద్కర్‌ కూడలిలో గల రిలయన్స్‌ స్మార్ట్‌ సూపర్‌ మార్కెట్‌ను గురువారం కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఆకస్మికంగా సందర్శించారు. కూరగాయలను అధిక ధరలకు అమ్మడాన్ని, కుళ్లిన టమాటాలను గమనించి అక్కడి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బయటి మార్కెట్లో పచ్చి మిరపకాయలు కిలో రూ.40కే దొరుకుతుంటే.. ఇక్కడ రూ.58కు ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నించారు. లాక్‌డౌన్‌ ఉన్నంత వరకు ఎక్కువ ధరలకు అమ్మితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అందుబాటు ధరలకే అమ్మాలని సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట డీసీఎంఎస్‌ చైర్మన్‌ కొత్వాల శ్రీనివాసరావు, సీఐ నవీన్‌, ఎస్సై ప్రవీణ్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు బొందిలి హరి, చిన్న పండు, సంతోష్‌ రెడ్డి, నారకట్ల రాజశేఖర్‌, ఫరీద్‌, మురళి తదితరులు ఉన్నారు.


logo