మంగళవారం 07 జూలై 2020
Khammam - Mar 27, 2020 , 01:02:26

స్వచ్ఛంద దిగ్బంధం

స్వచ్ఛంద దిగ్బంధం

  • ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న లాక్‌డౌన్‌
  • ఇళ్లకే పరిమితమవుతున్న ప్రజలు
  • ప్రజల మధ్యకు ప్రజాప్రతినిధులు
  • బైక్‌పై సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర పర్యటన
  • పాల్వంచలో కూరగాయల ధరలను ఆరా తీసిన ఎమ్మెల్యే వనమా

ఖమ్మం, నమస్తే తెలంగాణ /రఘునాథపాలెం/ ఖమ్మం వ్యవసాయం/ ఖమ్మం క్రైం/ మయూరిసెంటర్‌: కొవిడ్‌ -19 వ్యాప్తిని అరికట్టేందుకు పోలీస్‌ శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ప్రభుత్వం విధించిన ఆంక్షలకు అనుగుణంగా ప్రజలను బయటకి రానివ్వకుండా నిరంతర పర్యవేక్షణ చేపడుతూ కఠినమైన చర్యలు తీసుకుంటున్నది. గురువారం జిల్లాలోని సత్తుపల్లి, వైరా, మధిర, పాలేరు, ఖమ్మం ప్రాంతాల్లో ఉన్న ప్రధాన రహదారుల వెంట బారికేడ్లను ఏర్పాటు చేశారు. వివిధ సబ్‌డివిజన్‌ ఏసీపీలు పర్యవేక్షణ చేస్తున్నారు. నాయికన్‌గూడెం, బోనకల్లు, కల్లూరు, సత్తుపల్లి జిల్లా సరిహద్దుల వద్ద బారికేడ్లను ఏర్పాటు చేసి కేవలం నిత్యావసర వస్తువుల రవాణాకు మాత్రమే అనుమతులిస్తున్నారు. పోలీస్‌ కమిషనర్‌ తఫ్సీర్‌ ఇక్బాల్‌ వివిధ దుకాణాలను పరిశీలించారు. ఖమ్మం నగరం 2వ డివిజన్‌ పాండురంగాపురంలో, మండల కేంద్రం రఘునాథపాలెంలో ఏర్పాటు చేసిన కూరగాయల కేంద్రాలను ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మద్దినేని వెంకటరమణ ప్రారంభించారు. వైరస్‌ నేపథ్యంలో ప్రజల వద్దకే తక్కువ ధరలకు కూరగాయలను తీసుకువచ్చి అమ్మకాలను చేపడుతున్నట్లు చెప్పారు. 5వ డివిజన్‌లో కార్పొరేటర్లు నాగండ్ల కోటి, ఆత్కూరి హనుమాన్‌, ఎస్‌ వెంకన్న కలిసి ప్రారంభించారు. గ్రామస్థులందరికి ఉచితంగా కూరగాయలను పంపిణీ చేశారు. అదేవిధంగా గురువారం ఉదయం మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మద్దినేని వెంకటరమణ నగరంలోని హోల్‌సేల్‌ వ్యాపారుల క్రయవిక్రయాలను జిల్లా మార్కెటింగ్‌శాఖ అధికారి సంతోశ్‌కుమార్‌తో కలిసి పర్యవేక్షించారు. నిత్యావసర వస్తువుల కొరత రాకుండా ఉండేందుకు వ్యాపారులు, కార్మికులు చొరవ తీసుకోవాలని ఖమ్మం ఏఎంసీ చైర్మన్‌ గురువారం తన కార్యాలయంలో వర్తకసంఘం, కార్మిక సంఘాల నాయకుల సమావేశంలో సూచించారు. 

 టీఆర్‌ఎస్‌ నగర అధ్యక్షుడు, 16 వ డివిజన్‌ కార్పొరేటర్‌ కమర్తపు మురళి డివిజన్‌లో ప్రజలకు మాస్క్‌లు పంపిణీ చేసి, లాక్‌డౌన్‌ నేపథ్యంలో 1000 కేజీల టమాట, 1000కేజీల కీరదోస, బచ్చలకూర, పాలకూర, తోటకూరతో పాటు 2000 మాస్కులను 1200 కుటుంబాలకు ఉచితంగా అందజేశారు. 48వ డివిజన్‌ ప్రజలకు ఆ డివిజన్‌ కార్పొరేటర్‌ తోట రామారావు ఆధ్వర్యంలో గురువారం ఉచితంగా కూరగాయలను పంపిణీ చేశారు.

టాస్క్‌ఫోర్స్‌ ఆధ్వర్యంలో దాడులు...

అధిక ధరలకు విక్రయాలు కొనసాగిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ వెంకట్రావు అన్నారు. జిల్లాలో కొనసాగుతున్న లాక్‌డౌన్‌ నేపథ్యంలో గురువారం ధరలను నియంత్రించేందుకు ఖమ్మం నగరంలోని వివిధ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో దుకాణాల్లో టాస్క్‌ఫోర్స్‌ ఆధ్వర్యంలో దాడులు చేసి అధిక ధరలకు విక్రయాలు జరుపుతున్న శ్రీనివాస్‌, కిశోర్‌లపై కర్ఫ్యూ నిబంధనల ఉల్లంఘన చట్టం కింద కేసు నమోదు చేసి టూటౌన్‌, అర్బన్‌ పోలీస్‌స్టేషన్లకు అప్పగించారు. లాక్‌డౌన్‌లో భాగంగా యాచకులకు, అనాథలకు నగరంలో టీఆర్‌ఎస్‌ పార్టీ యువజన నాయకులు (హాట్‌స్పాట్‌)మహ్మద్‌ అశ్రిఫ్‌ ఆధ్వర్యంలో 30వ డివిజన్‌లో ఉచితంగా భోజనం ప్యాకెట్లు పంపిణీ చేశారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు గురువారం 43వ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు పోతురాజు బాల, వెలంపల్లి వెంకటసుబ్బారావుల నేతృత్వంలో త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌, ట్రాఫిక్‌ పోలీసులకు మాస్కులను అందజేశారు.

స్వస్థలానికి వెళ్లేందుకు ప్రత్యేక అనుమతులు..

 శుభకార్యాలకు ఇతర ప్రాంతాల నుంచి ఖమ్మంకు వచ్చిన ముస్లిం మైనార్టీలు జనతా కర్ఫ్యూ వల్ల తిరిగి వారి స్వస్థలాలకు వెళ్లేందుకు ప్రభుత్వం నుంచి అనుమతులిచ్చారు. గురువారం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఎండీ ఖమర్‌, కార్పొరేటర్‌ షౌకత్‌అలీ, హఫీజ్‌ జవ్వాద్‌లు కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌, సీపీ తఫ్సీర్‌ ఇక్బాల్‌ల దృష్టికి సమస్యను తీసుకెళ్లి వివరించినట్లు తెలిపారు. వారిని ఏపీ రాష్ట్రంలోని గుంటూరు, నంద్యాల, కర్నూల్‌లకు పంపారు. 21వ డివిజన్‌లో అంబేద్కర్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్‌ను శుక్రవారం నుంచి సిక్వెల్‌ ఫంక్షన్‌ హాలులో ఏర్పాటు చేస్తున్నట్లు డివిజన్‌ కార్పొరేటర్‌ కర్నాటి కృష్ణ తెలిపారు. కరోనా వైరస్‌ నిర్మూలనకు ప్రజలంతా కృషి చేసి కరోనా రహిత ఖమ్మం జిల్లాగా తీర్చి దిద్దుకుందామని డిప్యూటీ మేయర్‌ బత్తుల మురళీప్రసాద్‌ అన్నారు. గురువారం 24వ డివిజన్‌లో పర్యటించి అవగాహన కల్పించారు.

వైద్యుల సేవలు భేష్‌..

కొవిడ్‌ -19 అనుమానితులకు వైద్యసేవలందించేందుకు జిల్లా వైద్యారోగ్యశాఖ, వైద్యవిధాన పరిషత్‌ విభాగాలు ఎంతగానో కృషి చేస్తున్నాయి. ఇతర జిల్లాల నుంచి జలుబు, దగ్గు, జ్వరం ఉందనే అనుమానంతో వచ్చిన వారికి వ్యాధి లక్షణాలు కనిపిస్తే పరీక్షలు నిర్వహించి హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఇప్పటివరకు జిల్లాలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు లేకుండా జిల్లా వైద్యారోగ్యశాఖ, ప్రభుత్వ వైద్యులు అహర్నిశలు కృషి చేస్తూ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. కరోనా అనుమానితులకు 104 వాహనం ద్వారా రవాణా సదుపాయం కల్పించడంతో పాటు లక్షణాలున్న వారిని నిర్ధారణ పరీక్షలు చేసేందుకు కలెక్టర్‌ ఆర్‌వీ.కర్ణన్‌ చొరవతో జిల్లా ఆసుపత్రిలోనే కరోనా శ్యాంపిళ్ల సేకరణకు కావాల్సిన సదుపాయాల కేటాయింపులు చేశారు. నమూనాలను ప్రత్యేక అంబులెన్స్‌లో గాంధీ ఆసుపత్రికి పంపేందుకు ఏర్పాట్లు చేశారు.  నుంచి జిల్లాకు వచ్చిన వారి సమాచారం సేకరిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో గల ట్రామాకేర్‌ భవనంలో 120 పడకలతో వీరికి సేవలందించనున్నారు. దీంతో పాటు మమత వైద్యశాలలో 40 పడకలు, ప్రత్యేక గదులు ఏర్పాటు చేశారు. రఘునాథపాలెం మండలంలో శారద కళాశాలలో 500 పడకలతో క్వారంటైన్‌ సేవల కోసం సిద్ధంగా ఉంచామని డీఎంహెచ్‌వో మాలతీ తెలిపారు.


logo