మంగళవారం 07 జూలై 2020
Khammam - Mar 27, 2020 , 00:32:31

ఆపత్కాలంలో ఆపన్నహస్తం

ఆపత్కాలంలో ఆపన్నహస్తం

  • ఉమ్మడి జిల్లాలో ఉచిత రేషన్‌ పంపిణీ షురూ
  • లాక్‌డౌన్‌ నేపథ్యంలో నిరుపేదలకు అండగా ప్రభుత్వం
  • సుమారు 6 లక్షల కుటుంబాలకు పైగా లబ్ధి
  • కుటుంబానికి రూ.1,500 నగదు అందేలా చర్యలు

కరోనా విపత్తు ప్రజలను కలవరపెడుతున్నది.. రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాలను అతలాకుతలం చేస్తున్నది.. ఇలాంటి ఆపత్కాలంలో నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం ఆపన్నహస్తం అందిస్తున్నది.. 21 రోజుల పాటు లాక్‌డౌన్‌ నేపథ్యంలో పేదలను ఆదుకోవాలని సంకల్పించింది.. తెల్లరేషన్‌ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికీ రూ.1,500 నగదు అందజేయాలని నిర్ణయించింది.. కుటుంబంలో ఒక్కొక్కరికీ 12 కిలోల బియ్యం అందేలా తక్షణ చర్యలు తీసుకుంటున్నది.. దీనిలో భాగంగా ఉమ్మడి జిల్లాలో రేషన్‌ పంపిణీ షురూ అయింది.. ఖమ్మం జిల్లాలో 669, భద్రాద్రి జిల్లాలో 110 చౌక దుకాణాలు ఉండగా అధికారులు గురువారం ప్రాథమికంగా పంపిణీ ప్రారంభించారు.. యుద్ధప్రాతిపదికన పంపిణీ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు..  దీంతో ప్రజానీకం నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

ఖమ్మం సిటీ/కొత్తగూడెం సింగరేణి: కరోనా మహమ్మారిని పారదోలేందుకు కట్టుదిట్టమైన చర్యలు.. దేశమంతటా లాక్‌డౌన్‌.. రాత్రి వేళల్లో నిరవధిక కర్ఫ్యూ.. ఈ నేపథ్యంలో పేదల పొట్ట నింపేందుకు కంకణం కట్టుకుంది సీఎం కేసీఆర్‌ సర్కార్‌.. రెక్కాడితే కానీ డొక్కనిండని వేలాది కుటుంబాలకు కడుపునిండా భోజనం పెట్టి, ఇంటి పట్టునే ఉంచాలనే కృతనిశ్చయంతో ఉచిత బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టింది. తెలుపు రేషన్‌ కార్డులో నమోదైన ప్రతి సభ్యుడికి ఉచితంగా 12 కేజీల బియ్యాన్ని అందించబోతున్నది. దీనికిగాను జిల్లాల వారీగా స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేయటంతో సంబంధిత అధికారులు ఆగమేఘాల మీద బియ్యం పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేశారు. కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ ఆదేశానుసారం జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు రేషన్‌ కార్డుల్లోని సభ్యులందరికీ సమాన ప్రాతిపదికగా బియ్యం కేటాయించారు. వీటి వివరాలన్నింటినీ ఆన్‌లైన్‌లో పొందుపరిచారు. ప్రస్తుతం యావత్‌ తెలంగాణ వ్యాప్తంగా ఈ-పాస్‌ ఆన్‌లైన్‌ యంత్రాల ద్వారా రేషన్‌ బియ్యం పంపిణీ చేస్తున్న సంగతి విదితమే. తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసిన బియ్యాన్ని కూడా అదే మాదిరిగా రేషన్‌ షాపుల ద్వారా తెలుపు కార్డుదారులందరికీ నయాపైసా భారం పడకుండా ఉచితంగా సరఫరా చేయనున్నారు. 

రేషన్‌ దుకాణాలకు బియ్యం..

తెలంగాణ ప్రభుత్వం పౌరసరఫరాల శాఖ ద్వారా ప్రతినెలా అందిస్తున్న రేషన్‌ బియ్యానికి డీలర్లు డీడీలు తీశారు. వాటికి సంబంధించిన బియ్యాన్ని ఆయా షాపులకు తరలించేందుకు జిల్లా అధికారులు ఉపక్రమించారు. ఖమ్మం నగరపాలకసంస్థ, మధిర, వైరా, సత్తుపల్లి మున్సిపాలిటీలతోపాటు 21 మండల కేంద్రాలకు అనుసంధానంగా ఉన్నటువంటి గోదాముల నుంచి దాదాపు 13వేల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని రేషన్‌ దుకాణాలకు ఆగమేఘాల మీద తరలిస్తున్నారు. 

4.05 లక్షల కుటుంబాలకు లబ్ధి..

తెలంగాణ ప్రభుత్వం పేదలకు ప్రతినెలా రేషన్‌ షాపుల ద్వారా రూ. 1కే కిలో చొప్పున బియ్యం పంపిణీ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో పేదలకు ఉచితంగా బియ్యం అందించే ఒక మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జిల్లాలోని ఖమ్మం నగరం, మధిర, వైరా, సత్తుపల్లి పట్టణాలతోపాటు 21 మండలాల్లో మొత్తం 669 రేషన్‌ దుకాణాలున్నాయి. వాటి పరిధిలో ఎఫ్‌ఎస్‌సీ 3,78,954, ఏఎఫ్‌ఎస్‌సీ 26,383, అన్నపూర్ణ 3, మొత్తం 4,05,396 రేషన్‌ కార్డులు మనుగడలో ఉన్నాయి. ఆయా కార్డుల్లోని సభ్యుల ఆధారంగా ఒక్కో వ్యక్తికి 12 కేజీల చొప్పున దాదాపు 13 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని సరఫరా చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే జిల్లాలో దాదాపు 100కుపైగా రేషన్‌ దుకాణాలకు బియ్యం తరలించగా, 5 షాపుల్లో బియ్యం పంపిణీ ప్రక్రియను ప్రారంభించినట్లు పౌరసరఫరాల అధికారులు చెబుతున్నారు.  

నేటి   పంపిణీ

జిల్లాలో ఉచిత బియ్యం పంపిణీకి అన్నిరకాల ఏర్పాట్లు జరిగాయి. కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ ఆదేశానుసారం పౌరసరఫరాల అధికారులు బియ్యం కేటాయింపుల ప్రక్రియను పూర్తిచేశారు. ఉచిత బియ్యం పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మండలస్థాయిలో సంబంధిత తహసీల్దార్లకు తగు సూచనలు చేశారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో సివిల్‌ సప్లయిస్‌ డీటీలు, ఆర్‌ఐలు, వీఆర్‌వోల పర్యవేక్షణలో రేషన్‌ డీలర్ల ద్వారా పేదలకు అందించనున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో వందకుపైగా దుకాణాలకు బియ్యం వెళ్లగా, మూడు షాపుల్లో బియ్యం పంపిణీ జరిగింది. తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్‌ రావటంతో అక్కడ పూర్తిస్థాయిలో కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. దాంతో గ్రామంలోని రెండు రేషన్‌ దుకాణాలు, పక్కనే ఉన్నటువంటి నారాయణపురం గ్రామంలోని రేషన్‌ షాపు ద్వారా ప్రజలకు బియ్యం అందించారు. శుక్రవారం నుంచి జిల్లాలోని మిగిలిన 666 రేషన్‌ దుకాణాల్లో ఉచిత బియ్యం పంపిణీ ప్రక్రియ ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నారు.     

రేషన్‌ డీలర్లకు దిశానిర్దేశం..

  • రేషన్‌ దుకాణాల్లో ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్న సమయంలో డీలర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌, అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌ తగు సలహాలు, సూచనలు చేశారు. 
  • ఏప్రిల్‌ నెలలో రేషన్‌ కోటాతోపాటు, ఎఫ్‌ఎస్‌సీ కార్డులోని ఒక్కో వ్యక్తికి 12 కిలోల చొప్పున ఉచితంగా బియ్యాన్ని అందించాలి.
  • కార్డుదారులు ఒకేసారి రేషన్‌ దుకాణాలకు పరుగులు పెట్టవద్దు. వార్డుల వారీగా వెళ్లి బియ్యం తెచ్చుకోవాలి..
  • రేషన్‌ దుకాణం వద్ద డీలర్‌ సబ్బు లేదా శానిటైజర్‌ అందుబాటులో ఉంచాలి. కార్డుదారులు వారి చేతులను శుభ్రం చేసుకున్న తర్వాతనే ఈ-పాస్‌ యంత్రం ద్వారా వేలిముద్రలు తీసుకోవాలి.
  • కార్డుదారులందరూ సామాజిక దూరం విధిగా పాటించాలి. ఒకరికి ఒకరి మధ్యన కనీసం మూడు అడుగుల దూరంలో వరుసక్రమంలో నిలబడాలి. కార్డుదారులు విధిగా మాస్క్‌లు ధరించాలి.
  • ఆయా సూచనలను తూచా తప్పక పాటించే విధంగా సంబందిత తహసీల్దార్లు పర్యవేక్షించాలి.

భదాద్రి కొత్తగూడెం జిల్లాలో8,36,187 మందికి లబ్ధి

కొత్తగూడెం సింగరేణి: కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రజలెవరూ బయట తిరగకుండా ఇళ్లల్లోనే ఉంటూ స్వీయ నిర్బంధం పాటించాలని ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా, వారికి ఆహారం ఏర్పాటు చేయడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తెల్లరేషన్‌ కార్డులున్న వారికి ఒక్కో వ్యక్తికి 12 కేజీల బియ్యాన్ని ఉచితంగా పంపిణీ  చేసేందుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా జిల్లావ్యాప్తంగా 2,64,645 ఆహార భద్రత కార్డులు, 18,792 అంత్యోదయ కార్డులు, 4 అంత్యోదయ అన్నా యోజన కార్డులు మొత్తం కలిపి 2,83,441 కార్డులు ఉన్నాయి. 8,36,187 మంది లబ్ఢిదారులకు మొత్తం 10,034 మెట్రిక్‌ టన్నుల బియ్యం పంపిణీ చేయనుండగా, గోడౌన్ల నుంచి ఆయా రేషన్‌ షాపులకు బియ్యాన్ని సరఫరా చేశారు. గురువారం నుంచే కొన్ని షాపుల్లో ఉచిత బియ్యాన్ని పంపిణీ చేశారు. ఏప్రిల్‌ 1వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా  అన్ని షాపుల్లో ఉచిత బియ్యం పంపిణీని పూర్తి చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖాధికారులు స్పష్టం చేశారు. కాగా, జిల్లాలోని 110 చౌకదుకాణాలకు గాను ఇప్పటి వరకు 31 షాపులకు బియ్యం పంపిణీ చేశారు. ఇంకా 79 షాపులకు బియ్యం పంపిణీ చేయాల్సి ఉంది.  

మండలాల వారీగా కార్డుల వివరాలు.. 

జిల్లాలోని అశ్వాపురం మండలంలో 10,865 కార్డులకు గాను 31,513 మంది లబ్ధిదారులు ఉన్నారు. వారికి 3,78,156 కేజీల బియ్యం పంపిణీ చేయనున్నారు. అశ్వారావుపేటలో 16,757 కార్డులకు గాను 49,198 మంది లబ్ధిదారులకు 5,90,376 బియ్యం, భద్రాచలంలో 10,877 రేషన్‌ కార్డులకు గాను 31,073 మంది లబ్ధిదారులకు 3,72,876 బియ్యం పంపిణీ చేయాల్సి ఉంది. బూర్గంపాడు మండలంలో 16,573 కార్డులకు గాను, 49,100 మంది లబ్ధిదారులకు 5,89,200 బియ్యం పంపిణీ చేస్తారు. చర్ల మండలంలో 12,509 కార్డులకు గాను 38,192 మంది లబ్ధిదారులకు 4,58,304 కేజీలు, దమ్మపేట మండలంలో 15,638 కార్డులకు గాను 45,695 మంది లబ్ధిదారులుండగా 5,48,341కేజీలు, దుమ్ముగూడెం మండలంలో 12,910 కార్డులకు 38,643 మందికి 4,63,716 కేజీలు, జూలూరుపాడులో 9,583 కార్డులకు 28,556 మందికి 3,42,672 కేజీల బియ్యం, మణుగూరులో 16,645 కార్డులకు 50,203 మందికి 6,02,436 కేజీల బియ్యం పంపిణీ చేయాల్సి ఉంది. పాల్వంచ మండలంలో 27,753 కార్డులకు 81,205 మందికిగాను 9,74,460 కేజీలు, టేకులపల్లి మండలంలో 13,481 కార్డులకు 42,425 మందికి 5,09,100 కేజీల బియ్యం, ఇల్లెందులో 24,787కార్డులకు 71,356 మందికి 8,56,272 కేజీల బియ్యం, ములకలపల్లిలో 10,688 కార్డులకు 31,437 మందికి 3,77,244 కేజీల బియ్యం, సుజాతనగర్‌ మంలంలో 8,473 కార్డులకు 25,152 మందికి 3,01,824 కేజీల బియ్యం, చుంచుపల్లిలో 9,878 కార్డులకు 28,126 మందికి 3,37,512 కేజీల బియ్యం, లక్ష్మీదేవిపల్లిలో 10,592 కార్డులకు 32,106 మందికి 85,272 కేజీల బియ్యం, అన్నపురెడ్డిపల్లిలో 6,377 కార్డులకు 17,370 మందికి 2,08,440 కేజీల బియ్యం పంపిణీ చేయాల్సి ఉంది. ఆళ్లపల్లి మండలంలో 3,185 కార్డులకు 10,192 మందికి 1,22,304 కేజీల బియ్యం, గుండాల మండలంలో 4229 కార్డులకు 13,536 మందికి 1,62,432 కేజీల బియ్యం, కరకగూడెంలో 4,506 కార్డులకు 14,027 మందికి 1,68,324 కేజీలు, పినపాక మండలంలో 9,708 కార్డులకు 28,601 మందికి 3,43,212 కేజీలు, కొత్తగూడెంలో 18,892 కార్డులకు 54,569 మందికి 6,53,628 కేజీలు, చండ్రుగొండ మండలంలో 8,535 కార్డులకు గాను 24,012 మందికి 2,88,144 కేజీల బియ్యం పంపిణీ చేయాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 2,83,441 కార్డులకు గాను 8,36,187 మంది లబ్ధిదారులు ఉండగా.. 10,034.244 టన్నుల బియ్యాన్ని అందజేయనున్నారు.


logo