మంగళవారం 07 జూలై 2020
Khammam - Mar 23, 2020 , 02:41:26

గడప దాటలె..

గడప దాటలె..

  • జనతా కర్ఫ్యూ విజయవంతం
  • స్వచ్ఛందంగా ప్రజల గృహ నిర్బంధం
  • సంపూర్ణంగా నిలిచిపోయిన ప్రజారవాణా
  • జిల్లావ్యాప్తంగా నిర్మానుష్యంగా మారిన రహదారులు 
  • తెరుచుకోని వర్తక, వాణిజ్య, వ్యాపార సముదాయాలు 
  • వెలవెలబోయిన బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు 
  • అత్యవసర సేవలు మినహా సకలం బంద్‌...
  • ఇంటికే పరిమితమైన మంత్రి పువ్వాడ, ఎంపీ నామా, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ 
  • చప్పట్లతో కృతజ్ఞతలు తెలిపిన కలెక్టర్‌ కర్ణన్‌, సీపీ తఫ్సీర్‌ ఇక్బాల్‌ 

కరోనాకు జిల్లా ప్రజలు బదులిచ్చారు.. స్వచ్ఛందంగా ‘జనతా కర్ఫ్యూ’ పాటించి ప్రాణాంతక వైరస్‌ను కట్టడి చేశారు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన పిలుపు మేరకు మహమ్మారిపై యుద్ధం ప్రకటించారు.. ప్రజానీకం ఎవరూ బయటకు రాకపోవడంతో ఖమ్మం జిల్లా కేంద్రంతో పాటు ప్రధాన పట్టణాలైన వైరా, మధిర, సత్తుపల్లి రహదారులు ఆదివారం నిర్మానుష్యంగా కనిపించాయి.. షాపింగ్‌ కాంప్లెక్సులు, పెట్రోలు బంకులు, ప్రధాన కూడళ్లు, మాల్స్‌ జనం లేక వెలవెలబోయాయి.. పల్లెల్లో సైతం ప్రజలెవరూ బయటకు రాకుండా స్వీయ నిర్బంధం పాటించారు. కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌, సీపీ తఫ్సీర్‌ ఇక్బాల్‌ పరిస్థితిని సమీక్షించారు.. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ హైదరాబాద్‌లో, ఎంపీ నామా ఢిల్లీలో, ఎమ్మెల్యేలు సండ్ర, రాములునాయక్‌, కందాల, జడ్పీ చైర్మన్‌ కమల్‌రాజు, ఎమ్మెల్సీ బాలసానిలు ఇంటి నుంచి బయటకు రాలేదు.. సాయంత్రం 5 గంటలకు ప్రజా ప్రతినిధులతో పాటు ప్రజలందరూ ఇంటి బయటకు వచ్చి చప్పట్లు కొట్టి సంఘీభావం తెలిపారు.

ఖమ్మం, నమస్తే తెలంగాణ: అద్భుతం.. మహాద్భుతం... చరిత్రలో ఎన్నడూ చూడని దృశ్యం ఆవిష్కృతమైనది. సమస్త ప్రజానీకం ఇంటికే పరిమితమైన మహోన్నతమైన ఘట్టం దాదాపు ఈ దశాబ్దంలో తొలిసారి కావచ్చు. ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీనో లేక ఏ ఉద్యమ సంస్థతో చేపట్టిన బంద్‌లే చూశాం. అవి కూడా నామమాత్రపు బంద్‌లు కావడం విశేషం. కొద్దీగొప్ప జనం బయటికి రాని సంఘటనలే ఆవిష్కృతమైనవి తప్ప యావత్‌ భారతదేశం సమస్త ప్రజానీకం గడపదాటనిరోజు మాత్రం ఈ ఆదివారం మాత్రమే. కరోనా (కొవిడ్‌-19) కారణంగా భారతగడ్డపై నూతన అధ్యాయనానికి శ్రీకారం చుట్టినైట్టెంది. అప్పుడే పుట్టిన పసిగుడ్డు నుంచి పండు ముసలి వరకు బయటికిరాని పరిస్థితి ఏర్పడింది. ప్రధాని నరేంద్రమోదీ 14 గంటల ‘జనతా కర్ఫ్యూ’కి పిలుపునిస్తే సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు 24 గంటలు కర్ఫ్యూకి పిలుపునిచ్చారు. ప్రధాని, ముఖ్యమంత్రుల పిలుపు మేరకు ఆదివారం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నిర్మానుష్యంగా మారింది. అత్యవసర సేవలు మినహా మిగిలిన అన్నిరంగాలు, అన్నివర్గాల ప్రజలు ఈ కర్ఫ్యూలో స్వచ్ఛందంగా భాగస్వాములై విజయవంతం చేశారు. జిల్లాకు చెందిన రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్‌లోని తన స్వగృహంలో స్వీయ నిర్భందమయ్యారు. ఖమ్మం పార్లమెంట్‌ సభ్యులు, టీఆర్‌ఎస్‌ లోక్‌సభ పక్షనేత నామా నాగేశ్వరరావు ఢిల్లీలోని తన ఇంటికి పరిమితం కాగా  జిల్లాలోని పాలేరు, వైరా, సత్తుపల్లి, మధిర శాసనసభ్యులు కందాల ఉపేందర్‌రెడ్డి, లావుడ్యా రాములునాయక్‌, సండ్ర వెంకటవీరయ్య, మల్లు భట్టి విక్రమార్కలు ఇంటికే పరిమితమయ్యారు. జిల్లా పరిషత్‌ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు, కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌, పోలీస్‌ కమిషనర్‌ తఫ్సీర్‌ ఇక్బాల్‌ తమ గృహాలకు, కార్యాలయాలకు పరిమితమయ్యారు. 

వెలవెలబోయిన రోడ్లు..

జనతా కర్ఫ్యూ సందర్భంగా ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు జిల్లాలోని ప్రధాన రహదారులతో పాటు చిన్న చిన్న రోడ్లు, వీధులు నిర్మానుష్యంగా మారాయి. ఖమ్మం నగరంలోని బైపాస్‌రోడ్‌, బస్‌ డిపోరోడ్‌, మయూరి సెంటర్‌ వైరారోడ్‌, కాల్వొడ్డు, ఇల్లెందు క్రాస్‌రోడ్‌, చర్చి కాంపౌండ్‌ రోడ్లతో పాటు, వైరా, సత్తుపల్లి, మధిర, పాలేరు, తల్లాడ, కల్లూరు లాంటి పట్టణాలలోని అన్ని రహదారులు నిర్మానుష్యంగా మారడంతో ఏదో అద్భుతం జరుగుతుందన్నట్లుగా ప్రజలు భావించారు. కనీసం రోడ్లపైకి పశువులు, మేకలు, గొర్రెలు లాంటివి కూడా వదలలేదు. అన్ని గ్రామాలలోని గ్రామీణ ప్రజలతో పాటు పట్టణాలలోని నగర వాసులు ఈ కర్ఫ్యూలో పాల్గొన్నారు. జిల్లా ప్రజలు సామాజిక బాధ్యతగా భావించి కర్ఫ్యూలో భాగస్వాములు కావడం మరో సువర్ణాధ్యాయనికి నాందిపలికినైట్లెంది. పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, వైద్యారోగ్యసిబ్బంది మాత్రమే తమ విధులను నిర్వహించారు. అత్యవసర సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయని, మిగిలినవి ఏ ఒక్కటి కూడా తెరిచి ఉండవని ప్రభుత్వం ముందుగానే ప్రకటించినందున్న ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ఈ కర్ఫ్యూలో పాల్గొని తమ దేశభక్తిని చాటుకున్నారు. కనీసం పిల్లలను కూడా ఇంటి ఎదుట ఉన్న రోడ్ల మీదకు పంపించలేదు. ఇంటిలో టీవీలకే పరిమితం అయ్యారు. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని ఏ ఒక్కరూ ఊహించలేదని, కుటుంబ సభ్యులంతా కలిసి రోజంతా ఇంటికే పరిమితం కావడం నిజంగా గొప్ప విషయమని పలువురు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా పెట్రోల్‌ బంక్‌లు, వాణిజ్య వ్యాపార కేంద్రాలు, ప్రైవేట్‌ వాహనాలు నిలిచిపోయాయి.  

ఎక్కడివి అక్కడే....

దేశవ్యాప్తంగా ఆదివారం కొనసాగిన కర్ఫ్యూలో జిల్లా ప్రజలందరూ భాగస్వామ్యులయ్యారు. ప్రధాన రవాణా రంగాలైన రైల్వేశాఖ ట్రైన్లను నిలిపివేసింది. దీంతో ప్రతిరోజు ఖమ్మం జిల్లా నుంచి రాకపోకలు కొనసాగించే సుమారు 70 వేల మంది ప్రజలు బయటికి వెళ్లని పరిస్థితి. అదేవిధంగా ప్రభుత్వం ఆర్టీసీ బస్సులను 24 గంటలు బంద్‌ చేయడంతో ఏ ఒక్కరూ అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఖమ్మం రైల్వేస్టేషన్‌, బస్టాండ్లు నిర్మానుష్యంగా మారాయి. వీటితో పాటు మధిర, బోనకల్‌, చింతకాని, ఎర్రుపాలెం, రైల్వేస్టేషన్లు వెలవెల పోయాయి. సత్తుపల్లి, వైరా, మధిర, తల్లాడ, కల్లూరు తదితర బస్టాండ్లు బస్సులు రాక, ప్రయాణికులు లేక వెలవెలబోయాయి. కేవలం సిబ్బంది నామ మాత్రంగానే హాజరయ్యారు. వీటితోపాటు జిల్లావ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఉన్న ఆటోలు ఇంటి నుంచి బయటికి రాలేదు. కూరగాయాల మార్కెట్లు తెరుచుకోలేదు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు కూరగాయాలు తీసుకొచ్చే రైతులు, చిన్న వ్యాపారులు ఏ ఒక్కరూ నగరానికి రాలేదు. దీంతో పట్టణాలలోని మార్కెట్‌లు నిర్మానుష్యంగా మారాయి. కేవలం పాల వాహనాలు మాత్రమే నడిచాయి. గ్రామాల నుంచి పట్టణాలకు పాలు పోసేవారు రాకపోవడంతో ఆదివారం పట్టణ వాసులు పాలప్యాకెట్లపైనే ఆధారపడాల్సిన పరిస్థితి.

నాన్‌ వెజ్‌ ప్రియులకు అవస్థలు...

అసలే ఆదివారం.. ముక్కలేనిదే ముద్దదిగని పరిస్థితి... అందులోనూ జనతా కర్ఫ్యూ.. ఎలాగో బయటికి వెళ్లేది లేదు. కనీసం మాంసమైన దొరికితే హాయిగా తెచ్చుకుని ఇంట్లో కూర్చుని భార్య, పిల్లలతో కలిసి తినవచ్చు అనుకున్నారేమో పాపం. ఖమ్మం నగరంలోని తెల్లవారు జామునుంచే మాంసం ప్రియులు చికెన్‌, మటన్‌, చేపల కోసం వెతకడం కనిపించింది. ఖమ్మం నగరంలో చికెన్‌ దుకాణాలు, మటన్‌ షాపులు ఏ ఒక్కటి తెరవలేదు. రోడ్లపై చేపలు అమ్మెవారు కూడా కనిపించలేదు. కొద్ది మంది శనివారం రోజునే చికెన్‌, మటన్‌, ఫిష్‌ తీసుకెళ్లి ఇండ్లల్లో భద్రపరుచుకున్నారు. నగరంలోని అనేక ప్రాంతాలలో శనివారం అర్ధరాత్రి వరకు చికెన్‌, మటన్‌ దుకాణాలు తెర్చి ఉండటం విశేషం.  

పోలీసులు మాత్రం రోడ్లపైనే..

దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ జరిగి యావత్‌ ప్రజానీకం ఇంటికే పరిమితమైనప్పటికీ పోలీసులు మాత్రం రోడ్లపైనే విధులు నిర్వహించడం గొప్ప విషయం. కుటుంబ సభ్యులకు దూరంగా ఉండి శాంతి భద్రతల పరీరక్షణలో ఖాకీ అన్నలు విధులు నిర్వహించడంతో ప్రతిఒక్కరూ వారికి సెల్యూట్‌ చేస్తున్నారు. తల్లాడ, కారేపల్లి మండల పోలీసులు రోడ్లపైకి వచ్చిన ప్రజల వద్దకు వెళ్లి దండపెడుతూ ఇంటికి వెళ్లిపోవాలని సూచించారు. కరోనా వైరస్‌ను నివారించే ఉద్యమంలో భాగస్వాములు కావాలని కోరారు. ఖమ్మం నగరంలో అనేక చోట్ల బారికెడ్లు ఏర్పాటు చేసి పోలీసులు బందోబస్తు నిర్వహించారు. రోడ్లపైకి వచ్చిన వారిని నిలిపి అత్యవసర పనుల నిమిత్తమైతేనే అనుమతులిచ్చారు. ఖమ్మం నగరంలోని జూబ్లీక్లబ్‌ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌పై ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ అమర్యాదగా ప్రవర్తించాడు దీంతో రెవెన్యూ ఉద్యోగులు మనస్తాపానికి గురై అర్బన్‌ తహసీల్దార్‌ కార్యాలయానికి చేరుకుని ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. వైరా పోలీసులు జనతా కర్ఫ్యూ నేపథ్యంలో మానవత్వం చాటారు. తిరువూరుకు చెందిన ఓ ప్రయాణీకురాలు బస్సులు లేక బస్టాండ్‌లో ఆకలితో అలమటిస్తుంటే నాగేశ్వరరావు అనే కానిస్టేబుల్‌ భోజనం పెట్టి మానవత్వం చాటుకున్నారు. అన్ని ప్రభుత్వశాఖల ఉద్యోగులు జనతా కర్ఫ్యూలో భాగస్వాములై ఇంటికి పరిమితమయ్యారు. వైద్యారోగ్య సిబ్బంది విధులు నిర్వహించగా రెవెన్యూ అధికారులు కర్ఫ్యూను పర్యవేక్షించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండల తహసీల్దార్‌ కార్యాలయంలో రెవెన్యూ సిబ్బంది అందుబాటులో ఉన్నారు. గ్రామాలలో వీఆర్‌వోలు, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు. ఏ ఒక్కరిని రోడ్లపైకి రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.    

చప్పట్లతో దద్దరిల్లిన నగరం..

జాతీ సమైఖ్యతను పెంపొందించే లక్ష్యంతో ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపును విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపునిచ్చిన సంగతి తెల్సిందే. కేసీఆర్‌ పిలుపు మేరకు అనేక ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం అనేక మంది చప్పట్లు కొట్టి దేశభక్తిని చాటుకున్నారు. జనతా కర్ఫ్యూను విజయవంతం చేసి కరోనా వైరస్‌పై పోరాడటానికి మాకు సహాయం చేస్తున్న వైద్యులు, శాస్త్రవేత్తలకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని పలువురు పేర్కొన్నారు. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ తన సతీమణి వసంతలక్ష్మితో కలిసి తన ఇంటి వద్ద బయటకు వచ్చి చప్పట్లు కొట్టారు. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ఢిల్లీలోని తన ఇంటి బయటకు వచ్చి తన భార్యతో కలిసి చప్పట్లు కొట్టారు. కరోనాను కట్టడి చేయడానికి నిరంతరం సేవలందించిన వైద్యులు, పోలీస్‌ సిబ్బందికి సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో తన కరచాల ధ్వనులతో సంఘీభావం తెలిపారు. ఆయనతో పాటు ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం విజయ్‌భాస్కర్‌, తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు ఎల్‌ రమణ, జహీరాబాద్‌ ఎమ్మెల్యే సంజీవరావు తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు కుటుంబ సభ్యులతో కలిసి చప్పట్లు కొట్టారు. కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌, పోలీస్‌ కమిషనర్‌ తఫ్సీర్‌ ఇక్బాల్‌, అడిషనల్‌ డీసీపీ మురళీధర్‌, డీఎంహెచ్‌వో డాక్టర్‌ బీ మాలతి, ఏసీపీలు గణేశ్‌, రామోజీరమేష్‌, ప్రసన్నకుమార్‌,  ఖమ్మం మున్సిపల్‌ కమిషనర్‌ అనురాగ్‌ జయంతి, జిల్లా పౌరసంబంధాల అధికారి ఎండీ యాకుబ్‌ పాషాలు వైద్యారోగ్య సిబ్బందితో కలిసి జిల్లా ప్రధాన వైద్యశాల ఎదుట వైరారోడ్‌పై చప్పట్లు కొట్టారు. వైద్యారోగ్యసిబ్బందికి శాస్త్రవేత్తలకు కృతజ్ఞతలు తెలిపారు. 


logo