సోమవారం 30 మార్చి 2020
Khammam - Mar 23, 2020 , 02:34:12

31 వరకు లాక్‌డౌన్‌

31 వరకు లాక్‌డౌన్‌

  • సరుకుల కోసం కుటుంబంలో ఒకరు బయటకు రావొచ్చు..
  • అత్యవసర సేవలకు మినహాయింపు
  • తెల్ల రేషన్‌కార్డు ఉన్నవారికి ఉచితంగా రేషన్‌
  • నిత్యావసరాల కొనుగోలుకు రూ.1500
  • ఖమ్మం, నమస్తే తెలంగాణ/ఖమ్మం సిటి, మార్చి 22: తరుణం ఏదైనా.. కారణాలు ఏవైనా.. బడుగు, బలహీన 

వర్గాల సంక్షేమం.. వారి అభ్యున్నతిని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏనాడూ మరువలేదు.. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు కొంత ఇబ్బందికరంగా మారినా పేద ప్రజల యోగక్షేమాల గురించే పరితపిస్తుంటారన్నది యావత్‌ తెలంగాణ ప్రజల ప్రగాఢ విశ్వాసం. తాజాగా యావత్‌ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారికి రాష్ట్రంలో వందశాతం అడ్డుకట్ట వేయాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాటిని ఆదివారం ప్రగతిభవన్‌ వేదికగా జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. కరోనా వైరస్‌కు స్వీయ నియంత్రణే చక్కని మందు అని, ఈనెల 31 వరకు యావత్‌ తెలంగాణ వ్యాప్తంగా ‘లాక్‌డౌన్‌' విధిస్తున్నామని ఆయన చెప్పారు. అత్యవసరమైతే తప్ప ఏ ఒక్కరూ బయట తిరగటానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఈక్రమంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగులకు యథావిథిగా వేతనాలు ఇవ్వాలని ఆదేశించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌, రాష్ట్రంలోని నిరుపేద వర్గాలకు ఆకలి బాధ ఆటంకంగా మారకూడదని భావించారు. 

తెలంగాణ రాష్ట్రంలోని తెల్లరేషన్‌ కార్డు కలిగిన ప్రతీ కుటుంబంలోని ఒక్కో వ్యక్తికి 12 కేజీల బియ్యాన్ని ఉచితంగా అందిస్తామన్నారు. కూరగాయలు, ఇతర నిత్యావసర సరుకుల కొనుగోలు నిమిత్తం ఒక్కో రేషన్‌ కార్డుదారుడి కుంటుంబానికి రూ.1500లు సైతం ఆర్థిక సహాయం చేస్తామని ప్రకటించారు. కాగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటన మేరకు జిల్లాలోని వేలాది నిరుపేద కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారుల నివేదిక ప్రకారం జిల్లాలో ఎఫ్‌ఎస్‌సీ, ఏఎఫ్‌ఎస్‌సీ, అన్నపూర్ణ కార్డులన్నీ కలిపి 4.05లక్షలు ఉన్నాయి. ఒక్కో కార్డుదారుడికి రూ.1500 చొప్పున నగదు అందిస్తే జిల్లాకు రూ. 60.75 కోట్లు మంజూరు చేయనున్నారు. వీటి పంపిణీకి సంబందించిన విధివిధానాలు అతి త్వరలో మీద జిల్లాలకు చేరుకోనున్నాయి. 


logo