గురువారం 02 ఏప్రిల్ 2020
Khammam - Mar 21, 2020 , 01:42:19

బీటీపీఎస్‌ యూనిట్‌-1లో విద్యుత్‌ ఉత్పత్తి

బీటీపీఎస్‌ యూనిట్‌-1లో విద్యుత్‌ ఉత్పత్తి

  • 270 మెగావాట్ల కరెంట్‌ గ్రిడ్‌కు అనుసంధానం
  • త్వరలో కమర్షియల్‌ ఆపరేషన్‌ డిక్లరేషన్‌ (సీవోడీ)
  • రాష్ర్టానికి వెలుగులు అందించే దిశగా అడుగులు
  • శరవేగంగా పూర్తవుతున్న పనులు

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న భద్రాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం (బీటీపీఎస్‌) కీలక దశను దాటుకున్నది. 1080 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో 270 మెగావాట్ల సామర్థ్యం కలిగిన నాలుగు ఉత్పాదక యూనిట్లు ఉన్నాయి. ట్రయల్‌ రన్‌లో భాగంగా ఉత్పాదక యూనిట్‌-1 నుంచి 279 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తిని చేశారు. ఈ విద్యుత్‌ను ప్రయోగాత్మకంగా శుక్రవారం గ్రిడ్‌కు అనుసంధానం చేసినట్లు జెన్‌కో అధికారులు తెలిపారు. త్వరలోనే యూనిట్‌-1ను కమర్షియల్‌ ఆపరేషన్‌ డిక్లరేషన్‌ (సీఓడీ)కు సిద్ధం చేయనున్నారు. అయితే యూనిట్‌-1లో విద్యుత్‌ ఉత్పత్తి చేసేందుకు జెన్‌కో అధికారులు పక్కా ప్రణాళికతో పనులు నిర్వహించారు. ఈ నెల 10 నుంచే యూనిట్‌-1 నుంచి విద్యుత్‌ ఉత్పత్తిని ప్రారంభించారు.

మణుగూరు, నమస్తే తెలంగాణ: ఈ నెల 10న మిలియన్‌ యూనిట్స్‌, 11న 0.895మిలియన్‌ యూనిట్స్‌, 12న 1.532 మిలియన్‌ యూనిట్స్‌, 13న 2.584 మిలియన్‌ యూనిట్స్‌, 14న 2.934 మిలియన్‌ యూనిట్స్‌, 15న 2.926 మిలియన్‌ యూనిట్స్‌, 16న 2.527మిలియన్‌ యూనిట్స్‌, 17న 2.4మిలియన్‌ యూనిట్స్‌, 18న 2.6మిలియన్‌ యూనిట్స్‌, 19న 3.545 మిలియన్‌ యూనిట్స్‌ విద్యుత్‌ ఉత్పత్తి వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు యూనిట్‌-1లో 279 మోగవాట్ల విద్యుత్‌ ఉత్పత్తి అయ్యేలా ట్రయల్న్‌ నిర్వహించారు. 270 మోగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి నిలకడ  కాగానే అధికారికంగా సీఓడీ చేయనున్నారు. ఇప్పటికే యూనిట్‌-1, 2, 3లో లైటప్‌ చేసిన అధికారులు యూనిట్‌-1లో సింక్రనైజేషన్‌ విజయవంతంగా నిర్వహించారు. రాష్ట్ర అవసరాలకు బీటీపీఎస్‌ యూనిట్‌-1 నుంచి త్వరలోనే విద్యుత్‌ను వినియోగించనున్నారు. పినపాక, మణుగూరు మండలాల్లో సుమారు 1179 ఎకరాల్లో 1080 మెగావాట్ల సామర్ధ్యం గల విద్యుత్‌ ప్లాంట్‌ను రూ.10వేల కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్నారు. ఈ ప్లాంట్‌ నిర్మాణ పనులను సుమారు 20 ఏజెన్సీల ఆధ్వర్యంలో సుమారు 3500 మంది కార్మికులు అహర్నిశలు శ్రమిస్తున్నారు. భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌(భెల్‌) తరఫున సుమారు 200 మంది ఇంజినీర్లు పనిచేస్తున్నారు. తెలంగాణ స్టేట్‌ పవర్‌ జనరేషన్‌ కార్పొరేషన్‌ (టీఎస్‌జెన్‌కో) అధికారులు, భెల్‌ అధికారులు 24 గంటలు పనుల్లో పూర్తిగా నిమగ్నమై ఉంటున్నారు. అనుకున్న సమయానికి పవర్‌ ప్లాంట్‌లోని 4 యూనిట్ల పూర్తే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నారు. జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు ప్లాంట్‌ నిర్మాణ పనులను ఎప్పటికప్పుడూ సమీక్షిస్తున్నారు. జెన్‌కో డైరెక్టర్‌(సివిల్‌) ఎ.అంజయ్‌, డైరెక్టర్‌( ఆపరేషన్‌) ఎం. సచ్చితానందం పర్యవేక్షణలో బీటీపీఎస్‌ చీఫ్‌ ఇంజినీర్‌ పిల్లి బాలరాజు ఆధ్వర్యంలో పనులు వేగవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది పూర్తిస్థాయిలో మొత్తం నాలుగు ఉత్పాదక యూనిట్ల నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేసి రాష్ట్ర అవసరాలకు వినియోగించుకున్నారు.

యూనిట్‌ను సీఓడీకి రెడీ చేస్తున్నాం .

బీటీపీఎస్‌లో యూనిట్‌-1ను సీఓడీకి సిద్ధం చేస్తున్నాం. యూనిట్‌-1లో ట్రయల్‌ రన్‌ ప్రక్రియలో విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నాం. ఇప్పటికే 270 మెగావాట్ల సామర్థ్యం గల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నాం. ప్రయోగాత్మకంగా 279 మెగావాట్ల వరకు విద్యుత్‌ను ఉత్పత్తి చేసి గ్రిడ్‌కు అనుసంధానం చేశాం. పని ప్రదేశంలో రక్షణ చర్యలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ నిరంతరం పనులను పర్యవేక్షిస్తున్నాం. అనుకున్న సమయానికి పవర్‌ ప్లాంట్‌లోని 4 యూనిట్లు పూర్తే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నాం.

-బీటీపీఎస్‌ సీఈ పిల్లి బాలరాజు..


logo
>>>>>>