బుధవారం 05 ఆగస్టు 2020
Khammam - Mar 21, 2020 , 01:17:13

అనుక్షణం అప్రమత్తం

అనుక్షణం అప్రమత్తం

 • విదేశాల నుంచి వచ్చిన వారిని క్వారంటైన్‌కు చేరుస్తున్న అధికారులు
 • ఇప్పటి వరకు జిల్లాకు 148 మంది రాక 
 • ఏకతాటిపైకి వచ్చిన సబ్బండ వర్గాలు 
 • కరోనా నియంత్రణకు పంచాయతీల్లో ప్రత్యేక ఏర్పాట్లు 
 • జిల్లాలో మాస్కులకు  కొరత లేదు 
 • మెప్మా ఆధ్వర్యంలో కొనసాగుతున్న తయారీ
 • రఘునాథపాలెంలో వెయ్యి పడకలతో ‘క్వారంటైన్‌'
 • ఏర్పాట్లు సిద్ధం చేస్తున్న  యంత్రాంగం 

కరోనా నివారణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది..  విదేశాల నుంచి వచ్చిన వారికి మాత్రమే కరోనా వస్తుందని తెలుసుకొని ముందుగా వారిని గుర్తించాలని అధికారులకు సూచించింది.. సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ నేతృత్వంలోని అధికార యంత్రాంగం వైరస్‌ నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టింది.. అధికారులు పట్టణాలు, పల్లెల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు.. అవసరమైతే తప్ప ఇంట్లో నుంచి బయటకు రావొద్దని సూచిస్తున్నారు..  ఎవరికి వారే రక్షణ చర్యలు చేపడితే కరోనాను అరికట్టవచ్చని ప్రజల్లో చైతన్యం తెస్తున్నారు.. విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించి క్వారంటైన్‌కు చేరుస్తున్నారు.. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 148 మందిని గుర్తించారు.. రఘునాథపాలెం మండలంలో వెయ్యి పడకలతో క్వారంటైన్‌ను ఏర్పాటు చేస్తున్నారు..  వైరస్‌ నియంత్రణలో భాగంగా మెప్మా ఆధ్వర్యంలో మాస్క్‌లను తయారు చేయిస్తున్నారు.. నగరంలోని ప్రభుత్వ వైద్యశాలలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ వార్డును శుక్రవారం ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి పరిశీలించి వైద్యులకు  సలహాలు సూచనలిచ్చారు.   

ఖమ్మం, నమస్తే తెలంగాణ: కరోనా నివారణ చర్యల్లో భాగంగా గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులను ఉన్నతాధికారులు అప్రమత్తం చేశారు. విదేశాలు, ఇతర ప్రాంతాల నుంచి ఆ గ్రామానికి ఎవరు వచ్చినా వారిని గుర్తించి ఉన్నతాధికారులకు సమాచారాన్ని అందించాలని ఆదేశాలిచ్చారు. పట్టణాల్లో ఈ పనిని మెప్మా సిబ్బంది చేపట్టారు. ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా ఇతర దేశాల నుంచి వచ్చిన 148 మందిని గుర్తించి వారిని క్వారంటైన్‌కు పంపారు. వీరిలో అనుమానితులను సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే మరికొంత మంది మాత్రం వారి సొంతిళ్లలోనే స్వీయ నిర్బంధంలో ఉంటున్నారు. కారేపల్లి మండలంలో విదేశం నుంచి వచ్చిన ఓ కుటుంబం కూడా స్వీయ నిర్బంధంలోనే ఉంది. 

జిల్లా వాసులంతా ఏకతాటిపైకి.. 

కరోనాపై అవగాహన పెంచుకుంటూ జిల్లా ప్రజలందరూ ఏకతాటిపైకి వచ్చారు. కుల, మత, రాజకీయ ప్రమేయాలు లేకుండా వ్యాధిని నివారించడమే ధ్యేయంగా అనేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. స్వచ్ఛంద సంస్థల బాధ్యులు, ప్రభుత్వ అధికారులు ప్రజలకు కావాల్సిన మాస్కులు, ఇతర శానిటైజర్లను అందించేందుకు ముందుకు వస్తున్నారు. మరికొంత మంది స్వచ్ఛందంగా గ్రామాల్లో, పట్టణాల్లో పర్యటిస్తూ ఈ వైరస్‌ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు. మరో వారం రోజులపాటు ఇదే పరిస్థితి ఉండనుంది. ముఖ్యంగా చాలామంది ప్రజలు శుభకార్యాలను వాయిదా వేసుకుంటున్నారు. 

ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి 

కరోనా వంటి ప్రాణాంతక వైరస్‌లు ప్రబలుతున్న ఈ సమయంలో ప్రజలు సమాచార మాధ్యమాల ద్వారా అప్రమత్తమై ముందస్తుగానే తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఈ వైరస్‌ నివారణకు అనేక జాగ్రత్తలను సూచిస్తున్నారు. వాటిని తప్పనిసరిగా పాటించాలని ఆదేశిస్తున్నారు. పెంపుడు జంతువులను దూరంగా తీసుకెళ్లాలని సూచిస్తున్నారు. తుమ్ములు, దగ్గు, గాలి ద్వారా ఈ వైరస్‌ వ్యాపించే ప్రమాదం ఉన్నందున మంచి క్యాలిటీ మాస్కులను మాత్రమే ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు. చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలంటున్నారు. 

పంచాయతీల్లో ప్రత్యేక చర్యలు

కరోనా నివారణ కోసం గ్రామ పంచాయతీల్లో కూడా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ప్రధాన వీధుల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. గ్రామాల్లో కూడా ఎక్కువగా ప్రజలు గుమికూడవద్దని సూచిస్తున్నారు. అలాగే వీధుల వెంట రోజూ ఫాగింగ్‌ చేయిస్తున్నారు. తరచూ చేతులను శుభ్రపరుచుకోవడం గురించి విస్తృత అవగాహన కల్పిస్తున్నారు. గ్రామ పంచాయతీల పరిధిలోని అన్ని మార్కెట్లను ఈ నెల 31వ తేదీ వరకూ మూసివేస్తున్నట్లు టమకా వేయిస్తున్నారు. 

31 వరకు చర్చిల్లో ప్రార్థనలు లేవు..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, దక్షిణ భారత సంఘం, డోర్నకల్‌ అధ్యక్ష మండలం ఉత్తర్వుల మేరకు కరోనా వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా ఈ నెల 31వ తేదీ వరకు జిల్లాలోని అన్ని చర్చిలనూ మూసివేస్తున్నట్లు సీఎస్‌ఐ ఖమ్మం పాస్ట్రేట్‌ చైర్మన్‌ రెవరెండ్‌ బీడీపీ రవీందర్‌ శుక్రవారం తెలిపారు. భక్తులందరూ తమ కుటుంబ సభ్యులతో కలిసి వారి వారి గృహాల్లోనే ప్రార్థనలు చేసుకోవాలని సూచించారు. ఈ నెల 23వ తేదీన సీఎస్‌ఐ ఆధ్వర్యంలో కరోనా నివారణ నిమిత్తం ఉపవాస దినంగా పాటించాలన్నారు. ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి ఉదయం 8:15 గంటల వరకు, రాత్రి 8 గంటల నుంచి 8:15 గంటల వరకు ప్రతి కుటుంబమూ కరోనా నివారణ కోసం ప్రత్యేక ప్రార్థనలు చేయాలని ఆయన కోరారు. 

‘పది’ కేంద్రాలు పరిశుభ్రంగా..

 • చేతులు శుభ్రం చేసుకున్నాకే కేంద్రాల్లోకి విద్యార్థులు
 • ఎగ్జామ్‌ సెంటర్లలో కరోనా నివారణకు జాగ్రత్తలు
 • రెండో రోజు టెన్త్‌ పరీక్షకు 59 మంది గైర్హాజరు

ఖమ్మం ఎడ్యుకేషన్‌: పదో తరగతి పరీక్షా కేంద్రాలను అధికారులు ఎప్పటికప్పుడు శుభ్ర పరుస్తున్నారు..గురువారం నుంచి టెన్త్‌ పరీక్షలు మొదలుకాగా పరీక్ష ముగిసిన తర్వాత వెంటనే డెటాల్‌ లిక్విడ్‌ను కేంద్రాల్లోని బెంచీలు, తలుపులు, ఇతర వస్తువుల మీద చల్లి వాటిని శుభ్ర పరిచారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు పాటిస్తున్నారు. పది పరీక్షల రాసే విద్యార్థులకు, విధులు నిర్వర్తించే ఉద్యోగులకు ఎలాంటి సమస్యలూ ఏర్పడకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి నుంచి క్షేత్ర స్థాయి సిబ్బంది వరకు అప్రమత్తంగా ఉంటూ పరీక్షల నిర్వహణలో భాగస్వాములు అవుతున్నారు.

చేతులు శుభ్రం చేసుకున్నాకే..

పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులను గంట ముందు నుంచే అనుమతిస్తున్నారు. గురువారం తెలుగు పేపర్‌-1, శుక్రవారం తెలుగు పేపర్‌-2 పరీక్షలను నిర్వహించారు. పరీక్ష కేంద్రాల్లోకి విద్యార్థులు వెళ్లడానికి ముందుగా వారికి సబ్బు, డెటాల్‌ లిక్విడ్‌ అందిస్తున్నారు. వాటితో వారు చేతులు శుభ్రం చేసుకున్నాకే కేంద్రాల్లోకి అనుమతిస్తున్నారు. ప్రతి కేంద్రంలోనూ విద్యార్థులు, విధులు నిర్వర్తించే ఉద్యోగులు మాస్కులు ధరించి హాజరవుతున్నారు. ఇతర జాగ్రత్తలు కూడా పాటిస్తున్నారు. విద్యార్థులు దగ్గినట్లు, తుమ్మినట్లుగా ఉంటే అందరితో కాకుండా ప్రత్యేక గదిలో కూర్చోబెట్టి పరీక్షలు రాయిస్తున్నారు. తరువాత ఆ గదిని ప్రత్యేకంగా శుభ్రం చేయిస్తున్నారు. 

పంచాయతీ సిబ్బంది సహకారంతో..

పరీక్ష రాసే విద్యార్థులు తలుపులు, డ్యూయల్‌ డెస్క్‌లు, గోడలు, కిటికీలను తాకుతారు. వాటికి ఏమైనా వైరస్‌ లాంటివి ఉంటే వాటిని నిర్మూలించేందుకు, ఇతరులకు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పరీక్షా కేంద్రాల పరిధిలోని పంచాయతీ సిబ్బంది సహకారంతో బెంచీలు తుడిపిస్తున్నారు. తలుపులను శుభ్రం చేయిస్తున్నారు. తరగతి గదుల గోడలు, కేంద్రాల ప్రహరీలకు ఫాగింగ్‌ చేయిస్తున్నారు. 

రెండో రోజు 59 మంది గైర్హాజరు

టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షల్లో భాగంగా రెండో రోజు శుక్రవారం తెలుగు పేపర్‌-2 పరీక్షను నిర్వహించారు. సెట్‌ నెంబర్‌-1 ప్రశ్నాపత్రాన్ని అందించారు. ఈ పరీక్షకు జిల్లాలో 17,909 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉంది. కానీ 17,850 మంది విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు. 59 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఈవో మదన్‌మోహన్‌ తెలిపారు. ఈ పరీక్షలో 99.68 శాతం హాజరు నమోదైంది. డీఈవో మూడు కేంద్రాలను, ఫ్లయింగ్‌ స్కాడ్‌ 32 కేంద్రాలను తనిఖీ చేశారు.

వెయ్యి పడకలతో ‘క్వారంటైన్‌'

 •  రఘునాథపాలెంలో ఏర్పాట్లు సిద్ధం చేస్తున్న అధికారులు

రఘునాథపాలెం, మార్చి 20: కరోనా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం మండల కేంద్రంలో క్వారంటైన్‌ (నిర్బంధ కేంద్రం) ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారితోపాటు కరోనా వైరస్‌ అనుమానితులను ఈ క్వారంటైన్‌లో ఉంచనున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. ఇల్లెందు ప్రధాన రహదారిపై రఘునాథపాలెం వద్ద గల శారద ఇంజినీరింగ్‌ కళాశాల, వీవీసీ స్కూల్‌, ఎస్‌ఎన్‌మూర్తి పాలిటెక్నిక్‌ కళాశాలల్లో క్వారంటైన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. శారద ఇంజినీరింగ్‌, ఎస్‌ఎన్‌మూర్తి కళాశాలలను ఏడాది కాలంగా గురుకుల సంక్షేమ పాఠశాలలుగా వినియోగించుకుంటున్నారు. అయితే ప్రస్తుతం కరోనా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మార్చి 31 వరకు విద్యాసంస్థలకు సెలవులను ప్రకటించడంతో ఖాళీగా ఉన్న ఈ పాఠశాలలను అధికారులు క్వారంటైన్లుగా వినియోగించుకోనున్నారు. గురుకుల పాఠశాలలో గల బెడ్లను ఈ కేంద్రంలో పడకలుగా సిద్ధం చేస్తున్నట్లు ఆర్‌అండ్‌బీ ఈఈ శ్యాంప్రసాద్‌ శుక్రవారం తెలిపారు. మూడు ప్రాంతాల్లో మొత్తం వెయ్యి పడకలను సిద్ధం చేసి ఉంచుతున్నట్లు చెప్పారు. అంతేగాక క్వారంటైన్‌ ఏర్పాటులో భాగంగా అవసరమైన మౌలిక వసతులను సమకూర్చే బాధ్యతలను ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులకు అప్పగించారు. కాగా క్వారంటైన్‌లో వెయ్యి పడకల ఏర్పాట్లను ఆర్‌అండ్‌బీ, ఐబీ, ఆర్‌డబ్ల్యూస్‌ ఉన్నతాధికారులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఐబీ ఈఈ నర్సింహారావు, ఐడీసీ ఈఈ విద్యాసాగర్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈ శైలజ, ఏఈ శ్రీనివాసరావు, చెరువు మాధారం జ్యోతీబాపూలే గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ విద్యాధరి, సిబ్బంది పాల్గొన్నారు.


logo