సోమవారం 30 మార్చి 2020
Khammam - Mar 21, 2020 , 01:13:46

ఈత.. కారాదు మృత్యువాత

ఈత.. కారాదు మృత్యువాత

  • జిల్లాలో నీట మునిగి చనిపోతున్న చిన్నారులు 
  • సరదా కోసం వెళ్లి ప్రమాదాలు కొని తెచ్చుకుని..
  • సెలవులతో గ్రామాలకు వెళ్తున్న విద్యార్థులు 
  • నిండుకుండల్లా చెరువులు.. కుంటలు
  • పొంగి ప్రవహిస్తున్న సాగర్‌ కాలువ 
  • తల్లిదండ్రుల పర్యవేక్షణతో ప్రమాదాల కట్టడి 

కరోనా వైరస్‌ బారిన పడకుండా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం విద్యాసంస్థలకు 31వ తేదీ వరకు సెలవులను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పరిస్థితుల్లో తల్లిదండ్రులకు ఆందోళన తప్పడం లేదు. ఆడుకోవడానికి మైదానాలు, వినోదం పంచే సినిమా థియేటర్లు సైతం మూసి ఉండడంతో పట్టణాల్లోని విద్యార్థులు గ్రామాలకు తరలివెళ్తున్నారు. గ్రామాల్లో ప్రస్తుతం చెరువులు, కుంటలు, వాగులు నిండుకుండను తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చిన్నారులు ఈత కోసం చెరువుల వద్దకు వెళ్లి ప్రమాదాలకు గురికాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంది. మూడేళ్లుగా జిల్లాలో 42 మంది పిల్లలు నీళ్లలో మునిగి చనిపోయిన ఘటనలు ముందు జాగ్రత్తగా చేపట్టాల్సిన చర్యలను సూచిస్తున్నాయి.  

-ఖమ్మం, నమస్తే తెలంగాణ

చెరువులోపడి తండ్రి, కొడుకుల మృతి.. 

బట్టలు ఉతికేందుకు చెరువు వద్దకు వెళ్లి అందులోపడి తండ్రీకొడుకులు మృతి చెందిన సంఘటన కారేపల్లి మండలంలోని గుంపెళ్లగూడెంలో ఫిబ్రవరి నెల 15వ తేదీన జరిగింది. పిపాల సత్యనారాయణ తన భార్యతో కలిసి బట్టలు ఉతుకుతుండగా కుమారుడు భరత్‌ (14) ఈత నేర్చుకునేందుకు చెరువులోకి దిగాడు. ఒక రాయిపై నిలబడగా జారి చెరువులో పడిపోయాడు. అది గమనించిన తండ్రి కొడుకును కాపాడేందుకు నీటిలోకి దిగాడు. చెరువు లోతుగా ఉండటంతో తండ్రీకొడుకులు ఇద్దరూ నీట మునిగి చనిపోయారు.  

ఈతకు వెళ్లి మృతిచెందిన డిగ్రీ కళాశాల విద్యార్థి.. 

పెనుబల్లి మండలం లంకాసాగర్‌కు చెందిన విద్యార్థి భానుప్రకాశ్‌ ఖమ్మంలోని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్‌ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. గత నెల 16వ తేదీన స్నేహితులతో కలిసి ఖమ్మంలోని ఎన్‌ఎస్‌పీ కాలువలో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తూ కాలువలో పడి చనిపోయాడు. స్నేహితులు, చుట్టుపక్కల వారు కాలువలో ఎంత వెతికినా దొరకలేదు. రెండు రోజుల తరువాత శవం దొరకడంతో తల్లిదండ్రులకు అప్పగించారు.  

సెల్ఫీ దిగుతుండగా..

ఖమ్మానికి చెందిన నలుగురు యువకులు, నలుగురు యువతులు ఫిబ్రవరి 25వ తేదీన పాలేరు కాలువ వద్దకు వెళ్లి సెల్ఫీ దిగుతుండగా ఒక యువకుడు కాలుజారి కాలువలో కొట్టుకుపోతుండగా దాదాపు 200 మీటర్లు మత్స్యకారులు వెంబడించి ఆ యువకుడిని కాపాడారు.  

చెరువులో మునిగి మృతిచెందిన విద్యార్థిని.. 

అప్పటి వరకు స్నేహితులతో కలిసి ఆనందంగా హోలీ వేడుకల్లో పాల్గొని స్నానం చేసేందుకు చెరువుకు వెళ్లిన 14 సంవత్సరాల విద్యార్థిని ఈత రాక చెరువులో మునిగి మృతిచెందిన సంఘటన ఈ నెల 9వ తేదీన తిరుమలాయపాలెం మండలంలోని గోపాలపురంలో జరిగింది. ఆ గ్రామానికి చెందిన పేరం సీతారాములు, నాగమణి దంపతులకు హిందు, సింధు కవలు. వీరిలో హిందు హోలీ రోజు నీటిలో మునిగిపోతున్నా పక్కనే ఉన్న స్నేహితురాలు కాపాడలేకపోయింది.

కిన్నెరసానిలో మునిగి..

పాల్వంచ మండలం పునుకుల గ్రామానికి చెందిన రాజబోయిన శివ 7వ తరగతి చదువుతున్నాడు. అప్పటి వరకు హోలీ వేడుకల్లో పాల్గొని స్నేహితులతో కలిసి కిన్నెరసాని వాగులోకి స్నానం చేయడానికి వెళ్లాడు. ఈతరాక పోవడంతో అందులో మునిగి పోయాడు. పక్కనే ఉన్నవారు రక్షించాలని ప్రయత్నం చేసినప్పటికీ వారికి కూడా ఈత రాకపోవడంతో ఏమీ చేయలేకపోయారు. 

కాలుజారి సాగర్‌ కాలువలో పడి..

ఏన్కూరు మండలం కేసుపల్లి గ్రామానికి చెందిన గంపశ్రీను (20) అనే యువకుడు ఈ నెల 1వ తేదీన ప్రమాదవశాత్తూ కాలుజారి సాగర్‌కాలువలో పడి మరణించాడు. ఈత వచ్చినైట్లెతే అతను బతికేవాడు. 


logo