సోమవారం 06 ఏప్రిల్ 2020
Khammam - Mar 21, 2020 , 01:42:00

భద్రాద్రి రామాలయం మూసివేత

భద్రాద్రి రామాలయం మూసివేత

  • జమలాపురం వేంకటేశ్వరస్వామి, పర్ణశాలలోని రామాలయం సైతం..
  • కరోనా నివారణ నేపథ్యంలో..అప్రమత్తమైన దేవాదాయ, ధర్మాదాయశాఖ
  • భక్తులు  సహకరించాలని విజ్ఞప్తి

భద్రాచలం, నమస్తే తెలంగాణ  : భద్రాచలం రామాలయంలో శుక్రవారం మధ్యాహ్నం నుంచి భక్తులకు దర్శనాలు నిలిపివేశారు. కరోనా వైరస్‌ నియంత్రణకు దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్‌ ఆదేశాల మేరకు శ్రీస్వామివారి ఆలయం, ఉప ఆలయాల్లో భక్తుల దర్శనాలు నిలిపివేశారు. వసతి గదుల కేటాయింపులు సైతం రద్దు చేశారు. అర్చకుల ద్వారా ఆలయ సంప్రదాయం ప్రకారం శ్రీస్వామివారి సేవలు ఏకాంతంగా మాత్రమే నిర్వహించనున్నట్లు భద్రాచలం రామాలయం ఈవో జీ. నరసింహులు తెలిపారు. వాహన పూజలకూ అనుమతించడం లేదని పేర్కొన్నారు. 

నేడు ప్రత్యేక సుదర్శన హోమం

కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో చిత్రకూట మండపంలో శనివారం అర్చకులు ప్రత్యేక సుదర్శన హోమం నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో  తెలిపారు. ఉదయం 8.30 నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని వారు వెల్లడించారు.

పర్ణశాల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన పర్ణశాల దేవాలయంలో శుక్రవారం మధ్యాహ్నం 1 గంట నుంచి భక్తులకు ప్రవేశం నిలిపివేసినట్లు ఆలయ ఇన్‌చార్జి వాసు శుక్రవారం తెలిపారు. కరోనా వైరస్‌ నిర్మూలించడంలో భాగంగా రాష్ట్రంలో అన్ని దేవాలయాల్లో భక్తుల ప్రవేశాలు రద్దు చేశారని, భద్రాచలం ఆలయానికి అంతర్భాగమైన పర్ణశాల ఆలయాన్ని మూసివేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందినట్లు చెప్పారు. మళ్లీ ఆదేశాలు వచ్చేంతవరకు భక్తులకు ఆలయ ప్రవేశం ఉండదన్నారు. ప్రతిరోజూ ఆలయంలో మూలవిరాట్‌లకు అర్చకులు పూజలు చేస్తారని తెలిపారు. భక్తులందరూ దీనికి సహకరించాలని కోరారు.

పాల్వంచ రూరల్‌ : కరోనా వ్యాప్తిని నివారించేందుకు పెద్దమ్మతల్లి ఆలయాన్ని శుక్రవారం మూసివేశారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం.. శుక్రవారం ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆలయంలోని మూల విరాఠ్‌కు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. పూజా కార్యక్రమాల్లో భాగంగా హారతి, నివేదన కార్యక్రమాలు చేట్టారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఆలయంలో నిత్యకార్యక్రమాలు అర్చకుల ద్వారానే నిర్వహించి, భక్తులను దేవాలయంలో అనుమతించకుండా చర్యలు చేపట్టాలని రాష్ట్ర మంత్రులు సూచించిన నేపథ్యంలో శుక్రవారం ఆలయ తలుపులను మూసివేశారు. ఈ నెల 31వ తేదీ వరకు ప్రభుత్వ నిబంధనలు అమల్లో ఉంటాయని ఆలయ అధికారులు పేర్కొన్నారు. 

తదుపురి ఆదేశాల వరకు మూసివేతే..

ఎర్రుపాలెం : కరోనా వైరస్‌ ప్రభావం మూలంగా తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాన్ని మూసివేశారు. శుక్రవారం ఆలయ అర్చకులు ఆధ్వర్యంలో మృత్యుంజయహోమం, సుదర్శన హోమం జరిపారు.  ప్రభుత్వం నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు భక్తులెవ్వరూ ఆలయానికి రావొద్దని ఆలయ కార్యనిర్వాహణ అధికారి పి.ఉదయ్‌భాస్కర్‌ కోరారు.

కోటమైసమ్మ దేవాలయంలో ఆర్జిత సేవలు నిలిపివేత

కారేపల్లి రూరల్‌ : సిరికాయలపల్లి కోటమైసమ్మ దేవాలయంలో ఆర్జిత సేవలు శుక్రవారం నుంచి నిలిపివేస్తున్నట్లు ఆలయ ధర్మకర్త డాక్టర్‌ పర్సా పట్టాభిరామారావు, దేవాదాయ శాఖ కార్యనిర్వాహణాధికారి అద్దంకి నాగేశ్వరరావు  ఓ ప్రకటనలో తెలిపారు.  కరోనా వైరస్‌ ప్రభావంగా భక్తులు సమూహంగా ఉండకుండా నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఆలయంలో జరుగు నిత్యపూజా కార్యక్రమాలు అర్చకుల ఆధ్వర్యంలో ఏకాంతంగా నిర్వహించబడతాయని తెలిపారు.  


logo