బుధవారం 01 ఏప్రిల్ 2020
Khammam - Mar 20, 2020 , 01:23:51

కనుమరుగవుతున్న పిచుకలు...

కనుమరుగవుతున్న పిచుకలు...

  • నేడు అంతర్జాతీయ పిచుకల దినోత్సవం

లక్ష్మీదేవిపల్లి: రోజురోజుకు అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలో కీటక నాశిని... మన నేస్తం... కీచు కీచు.. పిచుక.. ప్రస్తుతం కనుమరుగవుతున్నది. మనకు హాని కలిగించే చిన్నచిన్న కీటకాలను తింటూ మనకు సహాయపడే జీవి పిచుక అన్న విషయం చాలామందికి తెలియదనే చెప్పాలి. గ్రామీణ ప్రాంతాల్లో పల్లె జీవనంలో మనకు తెలియకుండానే రైతన్న నేస్తాల్లో పిచుకలు ఒకటి. ఒకప్పుడు అపార్ట్‌మెంట్లు, డాబాలు, పట్టణాల్లో మాత్రమే ఉండేవి. పల్లెటూర్లలో ప్రతీ వంద ఇండ్లల్లోనూ సంపన్నులు, ధనవంతులకు మినహా 80శాతం చొప్పున పూరిల్లు ఉండేవి. అప్పట్లో ఎంచక్కగా పిచుకలు ప్రతీ పూరిళ్లలోనూ పదుల సంఖ్యలో గూళ్లు కట్టుకొని పంట చేలలో పురుగులను తింటూ తమ సంతానాన్ని పెంచుకుంటూ హాయిగా జీవించేవి. ఆ రోజుల్లో ఏ రైతు తనపంట చేలలో క్రిమిసంహారక మందులు చల్లేవారు కాదు. మన నేస్తాలైన పిచుకలు రైతన్నలకు వాటి అవసరాన్ని కల్పించేవి కావు. కాలం మారింది... రైతన్నలకు తెలియకుండానే తన నేస్తాన్ని తానే దూరం చేసుకున్నారు. పల్లెటూర్లలోని పూరిల్లు కనుమరుగయ్యాయి. దీంతో పిచుకల ఆవాసాలు దూరమైపోయాయి. పిచుకల సంతానాభివృద్ధి క్రమేపీ తగ్గుకుంటూ వస్తున్నది. అంతలా టెక్నాలజీ పెరిగిపోయింది. రోటి మీద రోకలి పోటుగా సెల్‌ఫోన్లు వచ్చేశాయి. పట్టణాల నుంచి మారుమూల పల్లెల వరకు సెల్‌ టవర్లు కుప్పలుతెప్పలుగా వెలిశాయి. సెల్‌ఫోన్‌లో సెల్యూలార్స్‌ రేడియేషన్‌ పిచుకలపై ప్రభావం చూపాయి. రైతన్నల నేస్తాలు పల్లెటూర్లలోనే అంతిమ దశకు చేరుకున్నాయి. మా రోజుల్లో పంట పొలాల్లో పురుగుమందులు చల్లే వారు కాదు అంటూ మౌనంలో మూలన కూర్చున్న ఓ తాత తనమనవడికి చెప్తున్నాడే తప్ప.. మేము ఆ రోజుల్లో ఉండటానికి పూరిల్లు, పశువులు, మేకల కోసం చిన్న చిన్న కొట్టాలు ఉండేవని చెప్పలేకపోయాడు. అందులో మన నేస్తాలైన పిచుకలు గుంపులుగా పెరిగేవి. మన పంట చేలల్లో పురుగుమందు కొట్టాల్సిన అవసరం లేకుండా, అవి పురుగులను తినేవని తాత తన మనువడికి చెప్పలేకపోయాడు. దీని ఫలితంగా ఒకప్పుడు పల్లెల్లో వందల సంఖ్యలో ఉన్న పిచుకలు ఇప్పుడు పదుల సంఖ్యలో కూడా కనిపించడం లేదు. మన నేస్తాలు ఎలా తరిగిపోయాయో నేడు పంట చేలలో కీటకాలు కుప్పలుగా అభివృద్ధి చెందాయి. పంట ఏదైనా, రైతన్న ఎంతటి వాడైనా భూమిలో విత్తనం వేశాడంటే పంట చేతికందే వరకు కీటకాలను చంపడానికి దశల వారీగా పురుగుల మందును పిచికారీ చేస్తున్నాడు. అన్ని పంటలపై మితిమీరి పురుగుల మందులను స్ప్రే చేసి ఆహార పదార్థాలను కూడా విషమం చేస్తున్నాడు. మనం వాటిని కాపాడుకునేందుకు ప్రతీ ఒక్కరూ తోడ్పాటును అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేడు అంతర్జాతీయ పిచుకల దినోత్సవం.. logo
>>>>>>