బుధవారం 08 ఏప్రిల్ 2020
Khammam - Mar 20, 2020 , 01:21:00

పది పరీక్షలు ప్రారంభం

పది పరీక్షలు ప్రారంభం

  • 17,909 మంది విద్యార్థుల హాజరు 
  • 58 మంది గైర్హాజరు
  • పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన డీఈఓ, ఫ్లయింగ్‌ స్కాడ్‌ 
  • పలు కేంద్రాల్లో మాస్క్‌లతో పరీక్షలు రాసిన విద్యార్థులు

పదో తరగతి పరీక్షలు జిల్లా వ్యాప్తంగా గురువారం ప్రశాంతంగా ప్రారంభ మయ్యాయి. జిల్లాలోని 94 పరీక్షా కేంద్రాల్లో 17,909మంది విద్యార్థులకుగాను 58మంది గైర్హాజరయ్యారు. పరీక్షా కేంద్రాలను డీఈఓ, ఫ్లయింగ్‌ స్కాడ్‌లు తనిఖీ చేశారు. విద్యార్థులకు ముందు నుంచే కరోనా వైరస్‌పై అవగాహన కల్పించడంతో పలు చోట్ల మాస్క్‌లు ధరించి కేంద్రాలకు హాజరయ్యారు.. పరీక్షా కేంద్రాల వద్ద మెడికల్‌ కిట్లు, తాగునీటి వసతి కల్పించారు..

ఖమ్మం ఎడ్యుకేషన్‌: జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. పరీక్ష రాస్తున్న విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నారు.  ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు మొదలయ్యాయి. అన్ని పరీక్ష కేంద్రాల్లో బల్లలు ఏర్పాటు చేశారు. ప్రతి పరీక్ష కేంద్రంలో మెడికల్‌ కిట్‌లు, తాగునీటి వసతిని కల్పించారు. జిల్లావ్యాప్తంగా 94 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు నిర్వహించగా, అధికారుల సూచనల మేరకు విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు గంట ముందుగానే చేరుకున్నారు. తొలి వార్షిక పరీక్ష కావడంతో విద్యార్థులు తమకు ఇష్టమైన దైవానికి పూజలు చేయడంతో పాటు, హాల్‌టికెట్లకు సైతం ప్రత్యేక పూజలు చేయించి పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. తొలిరోజు జరిగిన తెలుగు పరీక్షకు మొత్తం 17,909 మంది విద్యార్థులకు  గాను 17,851 మంది విద్యార్థులు హాజరయ్యారు. 58మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు, 99.68 హాజరుశాతం నమోదైనట్లు జిల్లా విద్యాశాఖాధికారి మదన్‌మోహన్‌ తెలిపారు. 

భద్రత నడుమ కేంద్రాలకు ప్రశ్నాపత్రాలు..

పది పరీక్షల ప్రశ్నా పత్రాలను పరీక్ష కేంద్రాలకు తరలించే క్రమంలో ఉన్నతాధికారుల ఆదేశాలకనుగుణంగా భద్రత మధ్య తీసుకెళ్లారు.  ప్రశ్నాపత్రాల తరలించే సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పరీక్ష కేంద్రాల చీఫ్‌ సూపరింటెండెంట్‌లు, డిపార్టుమెంటల్‌ ఆఫీసర్లు సంబంధిత పోలీస్‌స్టేషన్ల నుంచి పోలీస్‌ భద్రతతో పరీక్ష కేంద్రాలకు తీసుకువెళ్లారు. మండలకేంద్రాల్లో ఎంపీడీవోలు వాహనాల ద్వారా కేంద్రాలకు తీసుకెళ్లారు. సీ సెంటర్లకు మాత్రం విద్యాశాఖ ఏర్పాటు చేసిన వాహనాల్లో తీసుకెళ్లారు.

కరోనా నేపథ్యంలో ప్రత్యేక చర్యలు...

కరోనా వైరస్‌ నేపథ్యంలో పరీక్ష కేంద్రాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. విద్యార్థులు గుంపులుగా ఉండకుండా సుమారు గంటముందు నుంచే కేంద్రాల్లోకి అనుమతించారు. శానిటైజర్లు అందుబాటులో ఉంచారు. వైరస్‌పై కేంద్రాల్లో ప్రచారం చేశారు. విద్యార్థులను సైతం అవకాశం ఉన్న కేంద్రాల్లో బెంచీకి ఒక్కొక్కరిగానే కూర్చోబెట్టి పరీక్షలు రాయించారు. గురుకుల పాఠశాలల విద్యార్థులకు మాస్క్‌లు పంపిణీ చేయగా, మిగిలిన వారు సైతం మాస్క్‌లతో పరీక్షలకు హాజరయ్యారు.  జిల్లా విద్యాశాఖాధికారి మదన్‌మోహన్‌ జిల్లాలో ఐదు కేంద్రాలను తనిఖీ చేశారు. డీఈవో నగరంలోని రిక్కాబజార్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఇందిరానగర్‌, రోటరీనగర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలతో పాటు, తనికెళ్ల, కొణిజర్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో జరుగుతున్న కేంద్రాలను పర్యవేక్షించారు. విద్యార్థులందరూ సివిల్‌డ్రెస్‌లో పరీక్షలకు హాజరయ్యారు. 

కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు..

జిల్లావ్యాప్తంగా పది పరీక్షలు జరుగుతున్న 94 పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు అధికారులు 144 సెక్షన్‌ను అమలు చేశారు. పరీక్ష కేంద్రాల సమీపంలో ఉన్న జిరాక్స్‌ సెంటర్లను మూసివేయించారు. పరీక్ష ముగిసిన అనంతరం విద్యార్థులను తీసుకువెళ్లేందుకు తల్లిదండ్రులు కేంద్రాల సమీపంలోనే ఉన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు. డీఈవో-05 కేంద్రాలను, ఫ్లయింగ్‌ స్కాడ్స్‌ -34 కేంద్రాలను తనిఖీ చేశారు. ఎలాంటి మాల్‌ ప్రాక్టీస్‌ కేసులు నమోదు కాలేదు.


logo