శనివారం 04 ఏప్రిల్ 2020
Khammam - Mar 20, 2020 , 01:18:26

జిగురు సేకరణకు గ్రీన్‌ సిగ్నల్‌

జిగురు సేకరణకు గ్రీన్‌ సిగ్నల్‌

  • నాలుగేళ్ల తర్వాత మళ్లీ జీసీసీ కొనుగోళ్లు
  • త్వరలో సేకరణ దారులకు ప్రత్యేక శిక్షణ 
  •  సబ్బులు, షాంపూలకు భలే గిరాకీ
  • పెట్రోల్‌ బంక్‌ల ద్వారా మరింత ఆదాయం 

భద్రాచలం, నమస్తే తెలంగాణ: గిరి బిడ్డలకు జిగురు సేకరణ అంటే మహా మక్కువ.. ఎండాకాలంలో వారికి ఒక జీవనోపాధిగా ఉండేది. జీసీసీ (గిరిజన సహకార సంస్థ) ద్వారా సేకరించిన జిగురును కొనుగోలు చేసేవారు. జిగురు సేకరణ వెన్నెముకగా ఉండేది.. గోల్డ్‌ కేక్‌గా దీనిని పిలుస్తారు.. నాలుగేళ్ల నుంచి జిగురు కొనుగోళ్లను నిలిపివేసింది.. మళ్లీ ఈ ఏడాది నుంచి జిగురు కొనుగోళ్లు చేయాలని డిపోలకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందాయి.. దీంతో ఈ ఏడాది  మళ్లీ జిగురు కొనుగోళ్లు చేపట్టనున్నారు.. జిగురుతో పాటు ఇతర అటవీ ఉత్పత్తులను సైతం కొనుగోళ్లు చేయనుంది..  

నాలుగేళ్ల తరువాత మళ్లీ కొనుగోళ్లు 

జీసీసీ ఎట్టకేలకు నాలుగేళ్ల తరువాత మళ్లీ జిగురు సేకరణకు పూనుకుంటోంది. ఈ మేరకు ఆ శాఖ ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు అందాయి. ఈ వేసవిలో జిగురును సేకరించనున్నారు. కేజీ జిగురుకు రూ.108లు వెచ్చించనున్నారు. నాలుగేళ్ల తరువాత మళ్లీ జిగురు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. వచ్చే ఏప్రిల్‌ నుంచి కొనుగోళ్లు చేయాలని జీసీసీ భావిస్తోంది. జిగురు సేకరణదారుల వివరాలు సేకరించి వారికి త్వరలోనే ట్రైనింగ్‌ ఇవ్వనున్నారు. జిగురుతో పాటు డిపో ద్వారా ఇతరత్రా అటవీ ఉత్పత్తుల కొనుగోళ్లు కూడా జరుగనుంది. ఈ ఏడాది మిర్చి కొనుగోళ్లకు సంబంధించి ఉత్వర్వులు వస్తే కొనుగోళ్లు కూడా చేపడుతామని భద్రాచలం జీసీసీ డీఎం కుంజా వాణి నమస్తే తెలంగాణకు తెలిపారు.  

జీసీసీ సబ్బులు, షాంపూలకు గిరాకీ 

భద్రాచలం గిరిజన సహకార సంస్థ (జీసీసీ) కార్యాలయం ప్రాంగణంలో ఈ ఏడాది సబ్బులు, షాంపూలు తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గిరిజనులను పారిశ్రామిక వేత్తలుగా మార్చాలనే సదుద్దేశంతో ఈ కేంద్రాలను నెలకొల్పింది. 15 మందిని ఎంపిక చేసి సబ్బుల తయారీపై వారికి శిక్షణ ఇచ్చారు. ప్రతిరోజు సబ్బుల తయారీ కేంద్రంలో వారు వివిధ రకాల సబ్బులు, షాంపూలు తయారు చేస్తున్నారు. వీటికి మార్కెట్‌లో మంచి గిరాకీ ఉంది. గిరిజన సంక్షేమ హాస్టల్స్‌కు ఈ సబ్బులు, షాంపూలు పంపిణీ చేస్తున్నారు. బయట మార్కెట్‌లో కూడా వీటిని విక్రయిస్తున్నారు. 

పెట్రోల్‌ బంకుల ద్వారా మరింత ఆదాయం 

జీసీసీ పెట్రోల్‌ బంకుల నిర్వహణ కూడా చేపట్టింది. వీటి ద్వారా మరింత ఆదాయం సమకూరుతోంది. అనేక చోట్ల పెట్రోల్‌ బంకులు ఇప్పటికే నడుస్తుండగా, మరికొన్ని త్వరలోనే ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రయత్నాల్లో ఉన్నారు. భద్రాచలంలో ఎన్‌హెచ్‌ క్లియరెన్స్‌ వస్తే త్వరలోనే బంకు ఏర్పాటు కానుంది. అన్నపురెడ్డిపల్లిలో ఎన్‌వోసీ వచ్చిందని, త్వరలోనే పెట్రోల్‌బంకు ఏర్పాటు చేస్తామని భద్రాచలం  డీఎం కుంజా వాణి తెలిపారు. దమ్మపేటలో ఎన్‌వోసీ రావాల్సి ఉందని, చిన్నబండిరేవులో ఎన్‌వోసీకి దరఖాస్తు చేశామని, పాల్వంచలో కూడా ఎన్‌వోసీ రావాల్సి ఉందని ఆమె వెల్లడించారు. ఇదిలా ఉండగా సూదిమళ్లలో పసుపు, కారం తయారు కేంద్రాన్ని నెలకొల్పారు. 

త్వరలోనే జిగురు సేకరిస్తాం...

 సంస్థ ద్వారా త్వరలో జిగురు సేకరిస్తాం. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందాయి. జిగురుతో పాటు ఇతరత్ర అటవీ ఉత్పత్తులను కూడా కొనుగోలు చేయనున్నాం. ఆదేశాలు వచ్చాక ఈ ఏడాది కూడా మిర్చి కొనుగోళ్లు ప్రారంభించే అవకాశం ఉన్నది. 

-కుంజా వాణి (భద్రాచలం జీసీసీ డీఎం)


logo