మంగళవారం 31 మార్చి 2020
Khammam - Mar 20, 2020 , 01:16:19

రోడ్లన్నీ ఖాళీ..

రోడ్లన్నీ ఖాళీ..

  • కరోనా ఎఫెక్ట్‌తో బోసిపోయిన రహదారులు.. 
  • నగరమంతా కర్ఫ్యూ వాతావరణం
  • కరోనా వైరస్‌ వ్యాప్తితో అప్రమత్తమైన జిల్లా ప్రజలు 
  • అత్యవసరమైతే తప్ప బయటికి రాని వైనం
  • బస్టాండ్‌, రైల్వే స్టేషన్లలో తగ్గిన ప్రయాణికులు 
  • సన్నగిల్లిన వ్యాపారాలు
  • మూతపడిన సినిమా థియేటర్లు, స్టేడియాలు, బార్లు..
  • స్వీయ నిర్బంధంతో రక్షణ చర్యలు 

కరోనా వైరస్‌ వ్యాప్తితో ఖమ్మం జిల్లా అప్రమత్తమైంది..  సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో జిల్లా అధికారులు వైరస్‌ పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.. కరోనా నిర్మూలనకు ఒక్క వైద్య ఆరోగ్య శాఖ మాత్రమే కాకుండా అన్ని శాఖలు సంయుక్తంగా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాయి.. రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య తక్కువగానే ఉన్నా మరో 15రోజుల పాటు ప్రజలందరూ స్వీయ నిర్బంధంలో ఉండాలని ఆదేశాలు జారీచేయడంతో జిల్లాలోని ప్రధాన రహదారులు కర్ఫ్యూ వాతావరణాన్ని తలపిస్తున్నాయి.. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గింది.. మరో వైపు ప్రభుత్వ ఆదేశాలతో థియేటర్లు, స్టేడియాలు, పార్కులు, ఫంక్షన్‌ హాళ్లు మూసివేయడంతో వెలవెలబోతున్నాయి.. అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ బయటకు రావడం లేదు.. శుభకార్యాలు కూడా వాయిదా వేసుకుంటున్నారు.. పల్లెల్లో సైతం కరోనాపై అవగాహన కల్పించడంతో ప్రతిఒక్కరూ మాస్కులు ధరించి తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. ప్రభుత్వ కార్యాలయాల బయట చేతులు శుభ్రం చేసుకొని లోపలికి రావాలని సూచిక బోర్డులను ఏర్పాటు చేస్తున్నారు..   

ఖమ్మం, నమస్తే తెలంగాణ: మరో 15 రోజుల పాటు ప్రజలందరూ స్వీయ నిర్బంధంలో ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనిలో భాగంగానే సీఎం కేసీఆర్‌ గురువారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో రాష్ట్ర మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలతో అత్యున్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసి కరోనా వ్యాప్తిచెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. థియేటర్లు, స్టేడియాలు, విద్యాసంస్థలు మూతపడడం, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో ప్రయాణికుల సంఖ్య తగ్గడంతో నగరంలో అనధికార కర్ఫ్యూ విధించినట్లయింది. మంత్రి అజయ్‌కుమార్‌ నాలుగు రోజుల ముందుగానే జిల్లా ప్రజలను అప్రమత్తం చేశారు. అధికారులు కూడా మొత్తం ప్రజలను చైతనం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో జిల్లాలోని పలు ప్రాంతాలు, కూడళ్లు కూడా బోసిపోయి కన్పిస్తున్నాయి. ప్రజలు కొన్ని శుభకార్యాలను వాయిదా వేసుకుంటున్నారు. ఖమ్మం నగరంతో పాటు వైరా, సత్తుపల్లి, మధిర, కల్లూరు, తల్లాడ, పాలేరు, కూసుమంచి తదితర ప్రాంతాల్లో ప్రజలు సరిగా బయటికి రావడంలేదు. గ్రామీణ ప్రాంతాల ప్రజల్లో కూడా అవగాహన పెరిగింది. ప్రతి ఒక్కరూ మాస్కులను ధరిస్తున్నారు. విద్యార్థులను వారి తల్లిదండ్రులు బయట తిరగనివ్వడం లేదు. మరికొందరైతే ఇంట్లోకి నెలకు సరిపడా సరుకులను ముందుగానే సిద్ధం చేసుకుంటున్నారు. రానున్న పది రోజులు క్లిష్టమైనవి కాబట్టి ప్రజలందరూ తమను తాము స్వీయ నిర్బంధంలో ఉంచుకుంటూనే రక్షణ చర్యలు తీసుకుంటున్నారు. 

బోసిపోయిన రోడ్లు.. 

కరోనాను తరిమికొట్టేందుకు ప్రజలు కూడా నడుం బిగించారు. నగరంలోని ప్రధాన రోడ్లన్నీ బోసిపోయాయి. రోడ్లపైకి జనాలు పెద్దగా రావడంలేదు. అత్యవసర పనుల కోసం మాత్రమే అడుగు బయట పెడుతున్నారు. స్కూళ్లు, కాలేజీలు, సినిమాహాళ్లు, పార్కులు, గ్రౌండ్‌లు మూతపడ్డాయి. ఎక్కడా జన సమూహాలు కనబడటం లేదు. పెళ్లిళ్లకు, దైవదర్శనాలకు వెళ్లేందుకు కూడా ప్రజలు జంకుతున్నారు. ‘చేతులు శుభ్రం చేసుకొని లోపలికి రాగలరు’ అంటూ కొన్ని దుకాణాలు, కార్యాలయాల వద్ద బోర్డులు దర్శనమిస్తున్నాయి. నీళ్ల బకెట్‌, సబ్బు, మగ్గులను అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. మెడికల్‌ షాపుల్లో మాస్కులు దొరకడం లేదు.  

తగ్గిన ప్రయాణికులు

ముందస్తు చర్యల్లో భాగంగా చాలామంది ప్రజలు తమ ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు. ముఖ్యమైన పనులైతేనే ప్రయాణాలు చేస్తున్నారు. వ్యాపారాలు తగ్గుముఖం పట్టాయి. ఖమ్మం ఆర్టీసీ బస్టాండ్‌, రైల్వేస్టేషన్లలో పెద్దగా ప్రయాణికులు ఉండడం లేదు. అయినా వైరస్‌ నివారణకు రైల్వే, ఆర్టీసీ అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులు ఖాళీ సీట్లతో దర్శనమిస్తున్నాయి. రైల్వేస్టేషన్లలో ప్లాట్‌ఫాంల మీద ఉండే వారి సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. ఢిల్లీ, ఇతర రాష్ర్టాల నుంచి వచ్చే రైళ్లలో ప్రయాణం చేసేవారి పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

స్టేడియాలు, పార్కుల మూసివేత..

నగర ప్రజలు ప్రతి రోజూ వేలాదిమంది ఖమ్మంలోని పటేల్‌ స్టేడియం, ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్‌ కళాశాల మైదానం, లకారం ట్యాంక్‌బండ్‌, పెవిలియన్‌ గ్రౌండ్‌, నయాబజార్‌ కళాశాల గ్రౌండ్‌లలో ఉదయం, సాయంత్రం వేళల్లో వాకింగ్‌, జాగింగ్‌ చేయడానికి వచ్చేవారు. సెలవు రోజుల్లో క్రీడాకారులు, విద్యార్థులు కూడా వందల సంఖ్యలో వచ్చేవారు. వీటిని మూసివేయడంతో అవన్నీ ఇప్పుడు బోసిపోయి కన్పిస్తున్నాయి. 

సన్నగిల్లిన వ్యాపారాలు..

ఏటా వేసవిలో పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల సీజన్‌ ఉంటుంది. దీనిపై అనేక వ్యాపారాలు ఆధారపడి ఉంటాయి. పెళ్లిళ్లకు జనం రావడం తగ్గడంతో ఆ వ్యాపారాలన్నీ దెబ్బతింటున్నాయి. అసలు సాధారణ జనాలు కూడా బయటకు రాకపోవడంతో ఇతరత్రా వ్యాపారాలు కూడా సన్నగిల్లాయి. నగరంలోని కమాన్‌బజార్‌, కస్బాబజార్‌, వైరారోడ్‌, గాంధీచౌక్‌ వంటి ప్రధాన వాణిజ్య ప్రాంతాల్లో ఉన్న దుకాణాలన్నీ వెలవెలబోతున్నాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి ఖమ్మానికి వచ్చే వారి సంఖ్య కూడా తగ్గిపోయింది. ఆటో కార్మికులు కూడా ప్రయాణికుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీధి వ్యాపారాలు పరిస్థితి కూడా అలాగే ఉంది. టీ షాపుల్లో  కూడా రద్దీ తగ్గింది.


logo
>>>>>>