సోమవారం 30 మార్చి 2020
Khammam - Mar 20, 2020 , 01:07:02

నేటి నుంచి భద్రాద్రిలో ఆర్జిత సేవలు రద్దు..

నేటి నుంచి భద్రాద్రిలో ఆర్జిత సేవలు రద్దు..

  • కరోనా నేపథ్యంలో నిర్ణయం
  • అన్నదానం, కల్యాణకట్ట మూసివేత
  • ఉత్తర్వులు విడుదల చేసిన 
  • దేవాదాయ శాఖ కమిషనర్‌
  • నవమి వేడుకలు రామాలయ ప్రాంగణంలోనే..

కరోనా అదుపునకు భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం ముందస్తు చర్యలకు ఉపక్రమించింది. శుక్రవారం నుంచి ఆర్జిత సేవలు, అర్చన లు, అభిషేకాలు, నిత్యకల్యాణం నిలిపివేశారు. కేవలం భక్తులకు ఉచిత, ప్రత్యేక దర్శనాలు మాత్రమే అనుమతించనున్నారు. 

భద్రాచలం, నమస్తే తెలంగాణ: కరోనా అదుపునకు భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం ముందస్తు చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటికే శ్రీరామనవమి వేడుకలు మిథిలా ప్రాంగణంలో కాకుండా ఈసారి రామాలయ ప్రాంగణంలోని బేడా మండపంలో నిర్వహించేందుకు సన్నద్ధమైన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఆర్జిత సేవలను కూడా శుక్రవారం నుంచి నిలుపుదల చేయనున్నారు. అర్చనలు, వివిధ రకాల అభిషేకాలు, నిత్యకల్యాణాలు నిలిపివేశారు. భక్తులకు ప్రతిరోజూ నిర్వహించే అన్నదానం కూడా ఆపివేశారు. భక్తులు తలనీలాలు సమర్పించే కల్యాణ కట్టను కూడా మూసివేస్తున్నారు. కేవలం భక్తులకు ఉచిత, ప్రత్యేక దర్శనాలకు మాత్రమే అనుమతించనున్నారు. ఈ మేరకు దేవాదాయశాఖ కమిషనర్‌ నుంచి భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానానికి ఉత్తర్వులు అందాయి. ఈ ఉత్తర్వులను యథావిధిగా అమలు చేస్తున్నట్లు దేవస్థానం ఈవో నరసింహులు ప్రకటించారు. భక్తులు సామూహికంగా కాకుండా విడివిడిగా స్వామివారి దర్శనాలను సాఫీగా చేసుకోవాల్సిందిగా ఆయన కోరారు. ఆర్జిత సేవలు, అన్నదానం, కల్యాణకట్ట పునరుద్ధరణ తేదీలను కమిషనర్‌ ఆదేశాల మేరకు తర్వాత ప్రకటిస్తామని, భక్తులు గమనించి సహకరించాలని కోరారు. ఇప్పటికే దేవస్థానం అధికారులు కరోనాపై అవగాహన కల్పించేందుకు ఫ్లెక్సీలను, కరపత్రాలను ముద్రించి ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఆలయం, ఆలయ పరిసరాలు, ఉపాలయాలు, దేవస్థానం కాటేజీలు, సత్రాలు తదితర వాటిల్లో పారిశుధ్య చర్యలు చేపడుతున్నారు. సిబ్బంది గ్లౌజ్‌లు, మాస్క్‌లు ధరించి పనులు చేస్తున్నారు. స్వామివారి ప్రసాదాల తయారీ విభాగం, సేల్స్‌ ప్రాంతం పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. 

రామయ్యకు నిత్యకల్యాణం

భద్రాచలం, నమస్తే తెలంగాణ: భద్రాచలం రామాలయంలో స్వామివారికి వైభవంగా నిత్యకల్యాణం నిర్వహించారు. ఉదయం అర్చకులు రామయ్యకు ప్రత్యేక పూజలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి భద్రాచలం వచ్చిన భక్తులు రామాలయానికి చేరుకొని రామున్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో ఉన్న శ్రీలక్ష్మీతాయారు అమ్మవారిని, అభయాంజనేయ స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. తదుపరి అర్చకులు ఆలయంలోని బేడా మండపంలో నిర్వహించిన నిత్యకల్యాణంలో భక్తులు పాల్గొని తిలకించి పునీతులయ్యారు.  


logo