సోమవారం 30 మార్చి 2020
Khammam - Mar 19, 2020 , 13:26:39

నేటి నుంచి పది పరీక్షలు ఆరంభం..

నేటి నుంచి పది పరీక్షలు ఆరంభం..

  • నేటి నుంచి పది పరీక్షలు
  • ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు
  • రెగ్యులర్‌ 89, ప్రైవేట్‌ 5 సెంటర్లు..
  • హాజరుకానున్న 18,657 మంది విద్యార్థులు

ఖమ్మం ఎడ్యుకేషన్‌, మార్చి18: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు నేటినుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్ష జరగనుంది. ఈ పరీక్షలకు రెగ్యులర్‌గా 17,854, ప్రైవేట్‌గా 803 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. మొత్తంగా 18,657 మంది పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. జిల్లావ్యాప్తంగా రెగ్యులర్‌ పరీక్షలకు 48 జోన్లు, ప్రైవేట్‌కు 3 జోన్లు, మొత్తం 51 జోన్లుగా విభజించి పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షల కోసం 89 రెగ్యులర్‌ కేంద్రాలు, 5 ప్రైవేట్‌ కేంద్రాలు, మొత్తంగా 94 కేంద్రాల్లో పరీక్షలు జరగనున్నాయి. సిట్టింగ్‌ స్క్వాడ్స్‌ 94  మంది బృందాలు, ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌ ఆరుగురి బృందాలతో పరీక్షలను పర్యవేక్షించనున్నారు. ఈ పరీక్షల కోసం 1907 మందికి పైగా ఉపాధ్యాయులు ఇన్విజిలేటర్లుగా విధులు నిర్వర్తించనున్నారు.

వెబ్‌సైట్‌లో హాల్‌ టికెట్లు...

విద్యార్థులు నేరుగా విద్యాశాఖ వెబ్‌సైట్‌ నుంచి హాల్‌ టికెట్లు పొందేలా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. డౌన్‌లోడ్‌ చేసుకున్న హాల్‌ టికెట్‌పై ఫొటో అతికిస్తే సరిపోతుందని, గెజిటెడ్‌ అధికారితో అటెస్టెడ్‌ చేయించాలనే నిబంధన ఏమీ లేదని సూచించారు. పరీక్ష కేంద్రాల్లో మెడికల్‌ సౌకర్యం అందుబాటులో ఉంచేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పరీక్ష కేంద్రంలో ఇన్విజిలేటరుతో పాటు చీఫ్‌ సూపరింటెండెంట్‌, డిపార్ట్‌మెంటల్‌ అధికారులతో సహా మొబైల్‌ ఫోన్లు వాడకూడదని స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకోనున్నట్లు సీఎస్‌, డీఓలతో పాటు ఫ్లయింగ్‌ స్కాడ్‌ అధికారుల సమావేశంలో సూచించారు. కేంద్రాల్లో ఇబ్బందులు ఉంటే హెల్ప్‌లైన్‌ నెంబర్‌ 8331851510లో ఫిర్యాదు చేసేలా కంట్రోల్‌ రూంని ఏర్పాటు చేశారు.

అబ్జర్వర్‌గా సామినేని సత్యనారాయణ..

ఖమ్మం డైట్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ సామినేని సత్యనారాయణ పదో తరగతి పరీక్షలకు జిల్లా అబ్జర్వర్‌గా విధులు నిర్వర్తించనున్నారు. పరీక్షల నిర్వాహణ, కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సిబ్బందికి సూచనలు చేస్తూ పరీక్షలను విజయవంతం చేయనున్నారు. బుధవారం పరీక్షల నిర్వాహణాధికారులతో జిల్లా అబ్జర్వర్‌ సత్యనారాయణ సమావేశం నిర్వహించారు. ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌, సీఎస్‌, డీఓలు ఇతర సిబ్బందితో సమావేశం నిర్వహించి సూచనలు అందించారు. 

పరీక్ష కేంద్రాల తనిఖీ...

పరీక్షా కేంద్రాల్లో చేసిన ఏర్పాట్లపై బుధవారం డీఈఓ మదన్‌మోహన్‌, జిల్లా అబ్జర్వర్‌ సత్యనారాయణ కేంద్రాలను తనిఖీ చేశారు. నగరంలోని మామిళ్లగూడెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలను, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలను తనిఖీ చేశారు. కేంద్రాల్లో ఉన్న మౌలిక సదుపాయాలు, ఇతర వసతులను పరిశీలించి సంతృపి వ్యక్తం చేశారు.

ఫ్లయింగ్‌ స్కాడ్‌ బృందాలు...

పరీక్షలకు 6 ఫ్లయింగ్‌ స్కాడ్‌ బృందాలు ఏర్పాటు చేశారు. ప్రతి బృందంలో ఒక విద్యాశాఖాధికారి, ఒకరు ఏఎస్‌ఐ ర్యాంక్‌, మరొకరు ఎంపీడీఓ కార్యాలయాల్లోని సూపరింటెండెంట్లను కేటాయించారు. సత్తుపల్లి ఎంఈఓ రాములు, ఖమ్మం అర్బన్‌ ఎంఈఓ శ్రీనివాస్‌, సింగరేణి ఎంఈఓ ఏసుదాస్‌, తల్లాడ ఎంఈఓ దామోదర ప్రసాధ్‌, ఏన్కూరు ఎంఈఓ జేసుదాస్‌, డీసీఈబీ సెక్రటరీ కనపర్తి వెంకటేశ్వర్లను ఫ్లయింగ్‌ స్కాడ్‌ బృంద నాయకులుగా వ్యవహరించనున్నారు.

నిత్యం పర్యవేక్షిస్తున్న డీఈఓ...

పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు డీఈఓ మదన్‌మోహన్‌ నిత్యం పర్యవేక్షిస్తున్నారు. కేంద్రంలో కీలకంగా వ్యవహరించే చీఫ్‌ సూపరింటెండెంట్‌, డిపార్టుమెంటల్‌ అధికారులకు సూచనలు చేశారు. విద్యార్థులు ఇబ్బందులు పడకుండా సదుపాయాలు కల్పించారు. 

కరోనా నేపథ్యంలో చర్యలు...

కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా పది పరీక్ష కేంద్రాల్లో ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. కేంద్రాల్లో చేతులు కడుక్కునేందుకు సబ్బులు అందుబాటులో ఉంచనున్నారు. విద్యార్థులు మాస్క్‌లతో వచ్చినా కేంద్రాల్లోకి అనుమతించనున్నారు. దగ్గినా, తుమ్మినా ప్రత్యేక గదిలో పరీక్షలు రాయించేలా ఏర్పాట్లు చేశారు. 

పరీక్షలు రాసే విధానం... 

విద్యార్థులు సమాధాన పత్రాలు అర్థమయ్యే విధంగా రాయాలి. అక్షరాలు గుండ్రంగా రాయాలి. అక్షర దోషాలు ఉండకూడదు. ఎక్కడా కొట్టి వేతలు, దిద్దుబాట్లు ఉండకూడదు. క్రమ పద్ధతిలో సమాధానాలు రాయాలి. పెన్నులతో పాటు, స్కెచ్‌ పెన్నులు ఉపయోగించడం ద్వారా సమాధాన పత్రాలు ఆకర్షణీయంగా కనబడుతాయి. అరగంట ముందు కేంద్రానికి చేరుకోవాలి. పరీక్ష హాల్‌లో ఎవరితోనూ మాట్లాడొద్దు. ఏ ప్రశ్నలు బాగా రాయగలరో వాటినే ముందుగా రాయడానికి ప్రయత్నించాలి. టైం పూర్తయ్యే వరకు పరీక్ష హాల్‌ నుంచి బయటకి రావొద్దు. ఒకటికి రెండుసార్లు హాల్‌టికెట్‌ నెంబర్‌ సరిచూసుకోవాలి. logo