శనివారం 04 ఏప్రిల్ 2020
Khammam - Mar 19, 2020 , 03:56:20

మాస్క్‌ల తయారీ బాధ్యత మెప్మాకు..

మాస్క్‌ల తయారీ బాధ్యత మెప్మాకు..

  • మంత్రి పువ్వాడ ఆదేశాలతో  60వేల మాస్క్‌లను సిద్ధం చేస్తున్న మహిళలు
  • నగరంలో పది కేంద్రాల్లో తయారీ
  • పర్యవేక్షిస్తున్న ఖమ్మం కార్పొరేషన్‌ కమిషనర్‌ అనురాగ్‌ జయంతి
  • కరోనాపై అప్రమత్తతే మేలు
  • ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారిని గుర్తిస్తున్న ఆర్పీలు.. 

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన ముందస్తు చర్యలు చేపట్టింది.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వైరస్‌ వ్యాప్తి చెందకుండా ప్రజలను అప్రమత్తం చేసే దిశగా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పలు ఏర్పాట్లు చేపట్టారు.. కొవిడ్‌-19 పట్ల ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు.. అంతేకాకుండా అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి కరోనా మహమ్మారి నుంచి ప్రజలను రక్షించే దిశగా చర్యలు తీసుకున్నారు. దీనిలో భాగంగా మాస్క్‌లు ప్రతిఒక్కరూ ధరించే దిశగా ఆదేశాలు జారీచేశారు. మాస్క్‌ల తయారీని పట్టణ పేదల నిర్మూలన సంస్థ (మెప్మా)కు అప్పగించారు. దీంతో ఆ శాఖ సిబ్బంది మాస్క్‌లను తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు.

ఖమ్మం, నమస్తే తెలంగాణ: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ప్రజలను, అధికారులను అప్రమత్తం చేస్తూ అనేక చర్యలు తీసుకుంటున్నారు. ఈ వైరస్‌ పట్ల ఏ ఒక్కరూ నిర్లక్ష్యం వహించవద్దని, అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. 15 రోజులపాటు ఎవరికి వారు స్వీయ నిర్బంధంలో ఉండాలని, తాను కూడా అన్ని కార్యక్రమాలనూ రద్దు చేసుకొని స్వీయ నిర్బంధంలో ఉండేందుకు నిర్ణయించుకున్నానని చెప్పారు. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్షించి కరోనా వైరస్‌ నుంచి ప్రజలను రక్షించే దిశగా ముందడుగు వేస్తున్నారు. ముఖ్యంగా ప్రజలు ఈ వైరస్‌ భారిన పడకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అందుకోసం ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్‌లు ధరించే దిశగా ఆదేశాలు జారీచేశారు. అయితే మాస్క్‌ల వినియోగం పెరుగడంతో ప్రభుత్వం ఇప్పటికిప్పుడే అందించే పరిస్థితి లేదు. దీని నుంచి బయట పడేందుకు మంత్రి అజయ్‌కుమార్‌ మాస్క్‌ల తయారీ బాధ్యతను మెప్మాకు అప్పగించారు. 

కేఎంసీలో 60 వేల మాస్క్‌లు..

మంత్రి పువ్వాడ ఆదేశాల మేరకు 60 వేల మాస్క్‌లను తయారుచేయించే బాధ్యతలను కేఎంసీ కమిషనర్‌ అనురాగ్‌ జయంతి మెప్మా అధికారులకు అప్పగించారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల మెప్మా కో ఆర్డినేటర్‌ ఎస్‌.సుజాత ఆధ్వర్యంలో ఖమ్మం కార్పొరేషన్‌లో పది మాస్క్‌ల తయారీ కేంద్రాలను ప్రారంభించారు. ఒక్కొక్క కేంద్రంలో 10 నుంచి 15 మంది మహిళలు మాస్క్‌లను తయారు చేస్తున్నారు. దానవాయిగూడెం, నాయుడుపేటల్లో రెండు కేంద్రాల చొప్పున, బొమ్మనా సెంటర్‌, సీపీ ఆఫీస్‌ రోడ్డు, బల్లేపల్లి, రోటరీనగర్‌, గాంధీనగర్‌, మామిళ్లగూడెంలలో ఒక్కో కేంద్రం చొప్పున పది కేంద్రాలు ప్రారంభమయ్యాయి. మూడు రోజుల్లోగా 60 వేల మాస్క్‌లను తయారుచేసే దిశగా మహిళలు పనిచేస్తున్నారు. మాస్క్‌ల డిజైన్‌ను మంత్రి పువ్వాడ, కలెక్టర్‌ కర్ణన్‌, కమిషనర్‌ అనురాగ్‌ జయంతి పరిశీలించి ఎంపిక చేశారు. కార్పొరేషన్‌లోని అన్ని వర్గాల ప్రజలకూ ఈ మాస్క్‌లను అందించే దిశగా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. 

సమాఖ్యల నుంచి రుణం

మాస్క్‌ల తయారీకి అవసరమైన క్లాత్‌, దారం, కత్తెరలను కొనుగోలు చేయాలంటే మహిళల దగ్గర ఇప్పటికప్పుడు నగదు లేనందున వారికి సమాఖ్యల నుంచి రుణం ఇప్పిస్తున్నారు. కమిషనర్‌ ఆదేశాల మేరకు ఎవరైతే మహిళలు మాస్క్‌లను తయారుచేస్తున్నారో వారికి వారు సభ్యులుగా ఉన్న సమాఖ్యల నుంచి రుణాన్ని అందిస్తున్నారు. ఆ రుణంతో క్లాత్‌ను కొనుగోలు చేసి మాస్క్‌లను తయారు చేస్తున్నారు. పది కేంద్రాల్లో 150 మంది మహిళలు రుణాలను తీసుకొని మాస్క్‌లను సిద్ధం చేస్తున్నారు. ముందుగా మంగళవారం మూడు కేంద్రాలను, బుధవారం ఏడు కేంద్రాలను ప్రారంభించారు. 

కేంద్రాలను పరిశీలించిన కమిషనర్‌

మాస్క్‌ల తయారీ కేంద్రాలను కార్పొరేషన్‌ కమిషనర్‌ అనురాగ్‌ జయంతి పరిశీలించారు. నగరంలోని బొమ్మనాసెంటర్‌లో ఏర్పాటుచేసిన కేంద్రాన్ని ఆయన సందర్శించి మహిళలకు పలు సూచనలు చేశారు. నిర్దేశించిన సమయంలోగా వాటిని పూర్తి చేసి అందించాలని ఆదేశించారు. అవసరమైతే ఎక్కువ సంఖ్యలో మహిళలను నియమించుకొని తయారీని వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. మహిళలు తయారుచేసే మాస్క్‌లను మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో కొనుగోలు చేసి వాటిని ప్రజలకు అందించనున్నట్లు కమిషనర్‌ తెలిపారు. లాభసాటి కాకుండా శ్రమకు తగిన ఫలితాన్ని తీసుకొని అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా జరిగే ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అనురాగ్‌ జయంతి పిలుపునిచ్చారు. ఎవరికి వారు స్వీయ నిర్బంధం, స్వీయ రక్షణ పాటించాలని కోరారు. 

విదేశాల నుంచి వచ్చే వారి గుర్తింపు

కరోనా వైరస్‌ మనదేశంలో పుట్టింది కాదు. ఇతర దేశాల్లోనిది. కాబట్టి అక్కడి నుంచి వచ్చే వారి నుంచే ఈ వైరస్‌ ఇక్కడ వ్యాప్తి చెందే ప్రమాదముంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఇతర దేశాల నుంచి వచ్చే వారిపై ప్రత్యేక దృష్టి సారించింది. హైదరాబాద్‌ లాంటి చోట్ల నిర్బంధ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారిని అటునుంచి అటే నిర్బంధ కేంద్రాలకు తరలించి అన్ని రకాల పరీక్షలూ చేయిస్తున్నది ఇదే విధంగా ఖమ్మం జిల్లా కేంద్రంలో కూడా ఇతర దేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించి అధికారులకు సమాచారం అందించాలని ఖమ్మం కార్పొరేషన్‌ కమిషనర్‌ అనురాగ్‌ జయంతి మెప్మా రిసోర్స్‌ పర్సన్ల (ఆర్‌పీ)ను ఆదేశించారు. దీంతో వారు ఆయా డివిజన్లలో పర్యటించి ఇతర దేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించే ప్రక్రియను మొదలుపెట్టారు. 

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి 

“కరోనా వైరస్‌ పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. అలా ఉంటేనే దీని నివారణ సాధ్యమవుతుంది. ఆ దిశగా ఖమ్మం కార్పొరేషన్‌ ప్రజలు తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. ఈనెల 31 తర్వాత నగరంలో ఏ ఫంక్షన్‌ హాల్లో కూడా శుభకార్యాలు జరుగడానికి అనుమతులు లేవు. బహిరంగ ప్రదేశాల్లో సభలు, సమావేశాలు జరుపవద్దు. అవసరమైతే తప్ప జనసమూహాలు ఉన్న చోటుకు వెళ్లవద్దు. ప్రజలకు అవసరమైన మాస్క్‌లను అందించేందుకు కృషి చేస్తున్నాం. రెండు రోజుల్లో నగర ప్రజలకు అవసరమైన మాస్క్‌లను సిద్ధంగా ఉంచుతాం. ఎవరూ ఎలాంటి ఆందోళనకూ గురికావద్దు.”

-అనురాగ్‌ జయంతి, కమిషనర్‌, ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌ 


logo