బుధవారం 01 ఏప్రిల్ 2020
Khammam - Mar 19, 2020 , 03:48:27

రుణమాఫీ.. రైతు హ్యాపీ..

రుణమాఫీ.. రైతు హ్యాపీ..

 • రుణమాఫీ మార్గదర్శకాలు విడుదల చేసిన తెలంగాణ సర్కార్‌..
 • సంతోషం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు..
 • చెక్కుల ద్వారా   మాఫీ నిధులు
 • రూ.లక్ష లోపు తీసుకున్న కర్షకులు అర్హులు..
 • ఇంటిలో ఒక్కరికి మాత్రమే వర్తింపు
 • గ్రామీణ బ్యాంక్‌లో బంగారు రుణాలకు చెల్లుబాటు..
 • రైతుల జాబితా సిద్ధం చేస్తున్న బ్యాంకర్లు

అన్నదాతను ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటున్నది.. ప్రస్తుతం పంటల పెట్టుబడికి ప్రభుత్వమే సాయం చేస్తుండగా.. రైతులు గతంలో బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాలను మాఫీ చేసేందుకు సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు.. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి రుణమాఫీ నిధులను రైతులకు నేరుగా చెక్కుల రూపంలో అందించనున్నారు.. దీనికి సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది.. రూ.లక్ష లోపు రుణాలు, ఇంల్లో ఒక్కరికి అవకాశం కల్పించింది.. ముందుగా రూ.25వేలు రుణాలు తీసుకున్న రైతులకు  ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల చేతుల మీదుగా చెక్కులను అందించనున్నది.. బంగారు ఆభరణాలపై గ్రామీణ బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న వారికి సైతం రుణమాఫీ వర్తించనున్నట్లు మార్గదర్శకాలు రావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 2.20 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరనున్నది. అర్హత గల రైతుల వివరాలను బ్యాంక్‌ అధికారులు సిద్ధం చేస్తున్నారు..

ఖమ్మం వ్యవసాయం: గతంలో మాదిరిగా కాకుండా ఈ దఫా రుణమాఫీ నిధులకు సంబంధించి సదరు రైతులకు చెక్కుల ద్వారా నిధుల పంపిణీ జరగనుంది. రూ.లక్ష లోపు పంట రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ వర్తింపజేస్తూ కుటుంబంలో ఒక్కరికి మాత్రమే అవకాశం కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. గతంలో రుణమాఫీని నేరుగా రైతుల అకౌంట్లో జమ చేశారు. ఈసారి మాత్రం ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల చేతుల మీదుగా చెక్కుల రూపంలో పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. 

2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్‌ రైతులకు ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ నిర్ణయం తీసుకున్నారు. దీంతో అప్పుల ఊబిలో కూరకుపోయిన లక్షలాది మంది రైతులకు ప్రయోజనం చేకూరింది. ఇచ్చిన మాటకు కట్టుబడి టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక రూ.లక్ష లోపు పంట రుణాలు పొందిన ప్రతి రైతుకు నాలుగు విడతల్లో రుణమాఫీ నిధులను విడుదల చేశారు. దీంతో అప్పట్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 3.59 లక్షల మంది రైతులకు గానూ రూ.1,711 కోట్ల నిధులను ఆయా రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఆ తర్వాత 2018లో జరిగిన ఎన్నికల్లో కూడా పంట రణాల మాఫీపై సీఎం కేసీఆర్‌ మరోసారి అన్నదాతలకు మాట ఇచ్చారు. అందుకు అనుగుణంగానే అసెంబ్లీలో రుణమాఫీ నిమిత్తం రూ.6వేల కోట్లను కేటాయించారు. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 2.20 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. ఖమ్మం జిల్లాలో రూ.లక్ష లోపు పంట రుణాలు తీసుకున్న వారు దాదాపు 1.40 లక్షల మంది రైతులు ఉండగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మరో 80వేల మంది రైతులు ఉండే అవకాశం ఉంది. అర్హత కలిగిన రైతుల వివరాలు మరికొద్ది రోజుల్లోనే తేల్చేందుకు గాను జిల్లా లీడ్‌ బ్యాంక్‌ అధికారి వివరాలు సేకరిస్తున్నారు. ఇదిలా ఈ దఫా రుణమాఫీకి సంబంధించి రూ.25 వేల లోపు పంట రుణాలు తీసుకున్న రైతులకు వన్‌టైం సెటిల్‌మెంట్‌ కింద రద్దుకానున్నాయి. రూ1లక్ష లోపు రుణాలు తీసుకున్న రైతులకు నాలుగు ధపాలుగా నిధుల పంపిణీ జరుగనున్నది. 

అర్హుల జాబితా సిద్ధం చేస్తున్న బ్యాంకర్లు

రుణమాఫీ కోసం ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేయడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న బ్యాంకులు అర్హత గల రైతుల వివరాలను సిద్ధం చేసే పనిలో నిమగ్నమైంది. గతంలో పంట రుణాలు ఇచ్చిన ఆయా బ్యాంకులకు సంబంధించిన ప్రధాన కార్యాలయాలు ఇప్పటికే ప్రభుత్వ మార్గదర్శకాలను బ్రాంచీలకు చేరవేశాయి. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన నమూనాను అందజేశారు. రైతుపేరు, తండ్రిపేరు, ఆధార్‌కార్డు, గ్రామం, మండలంతో పాటు, తదితర అంశాలకు సంబంధించి 27 రకాలుగా వివరాలు సేకరించేందుకు గాను అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు.  కొద్ది రోజుల క్రితమే సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటన చేయడం, బడ్జెట్‌లో నిధులు కేటాయించడంతో అప్రమత్తమైన ఆయా బ్యాంక్‌ అధికారులు రెండు మూడ్రోజుల నుంచే వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. అర్హత గల రైతుల ఎంపికకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు గాను నోడల్‌ ఆఫీసర్స్‌ ఎప్పటికప్పుడు తగిన సలహాలు, సూచనలు ఇస్తున్నారు. 

లబ్ధిదారుల కోసం ప్రత్యేక పోర్టల్‌..

రుణమాఫీకి సంబంధించిన అర్హత కలిగిన రైతులను గుర్తించేందుకు గాను వ్యవసాయశాఖ, ఐటీ సంయుక్తంగా ప్రత్యేకంగా పోర్టల్‌ను రూపొందిస్తారు. ప్రతి బ్యాంక్‌ కటాఫ్‌ తేదీకి అనుగుణంగా ఇచ్చిన పంట రుణాలను నిర్దేశించిన పద్ధతిలో గ్రామాల వారీగా జాబితాను పొందుపరుస్తారు. అనంతరం మండల స్థాయిలో బ్యాంకులు, అధికారుల సమావేశం నిర్వహిస్తారు. ఈ కమిటీ తయారు చేసిన జాబితాను గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ప్రదర్శిస్తారు. అనంతరం సామాజికంగా ఆడిట్‌ నిర్వహించి అభ్యంతరాలు వ్యక్తమైతే పరిష్కరిస్తారు. అనంతరం ఆయా బ్యాంకులు బ్రాంచీల వారీగా అర్హుల జాబితాను లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌, జిల్లా కలెక్టర్‌కు పంపిస్తారు. దీంతో రాష్ట స్థాయిలో బ్యాంకర్ల సమావేశం ఏర్పాటు చేసి రైతుల వారీగా చెల్లించాల్సిన మొత్తాన్ని నిర్ణయం తీసుకుంటారు. 

మార్గదర్శకాలు ఇలా..

 •   1 వ తేదీ నుంచి 2018 డిసెంబర్‌ 11లోపు పంట రుణాలు తీసుకొని రెన్యూవల్‌ చేసుకున్న రైతులకు మాత్రమే రుణమాఫీకి వర్తిస్తుంది. 
 •   2018 డిసెంబర్‌ 11లోపు నాటికి బకాయిల్లో రూ.1లక్ష లోపు మాత్రమే మాఫీ అవుతుంది. 
 •   స్వయం పూచీకత్తు, సంఘం(జేఎల్‌జీ గ్రూపులు) , రైతు మిత్ర గ్రూపు లేదా రుణ అర్హత కార్డుపై రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ వర్తించదు.
 •  గామీణ ప్రాంతంలోని బ్యాంకుల్లో బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ వర్తించే విధంగా మార్గదర్శకాల్లో పొందుపరిచారు. 
 •   ఎన్ని బ్యాంకుల్లో  అప్పు ఉన్నా రూ. 1లక్ష మాత్రమే రుణమాఫీ జరుగుతుంది.
 •   ఒకరికంటే ఎక్కువ పంటరుణానికి అర్హులైతే రూ. లక్ష మొత్తంలో ఉన్నవారందరికి సమానంగా ఇస్తారు.
 •   నెలల్లోగా చెల్లించే గడువు(స్వల్పకాలిక రుణాలు) చెల్లింపు కాల వ్యవధి ఉన్న వారికి వర్తింపజేస్తారు. ఉద్యాన పంటల కోసం పొందిన స్వల్ప కాలిక రుణాలు ఈ పథకంలోకి వర్తింపజేస్తారు.
 •   కుటుంబాలను గుర్తించేందుకు గాను ఏఈఓ, వీఆర్‌ఓ, పంచాయతీ కార్యదర్శి సహాయం తీసుకుంటారు. మండల స్థాయిలో తహసీల్దార్‌, ఎంపీడీవో పర్యవేక్షిస్తారు.
 •   ఆప్‌ రుణాలు, ఖాతా తీసివేసిన, రాతపూర్వక రుణాలు, జేఎల్‌జీ, ఆర్‌ఎంజీ, గ్రూపుల రుణాలకు రుణమాఫీ వర్తించదు.


logo
>>>>>>