మంగళవారం 31 మార్చి 2020
Khammam - Mar 17, 2020 , 02:12:32

సుర్రుమంటున్న ఎండలు

సుర్రుమంటున్న ఎండలు
  • జిల్లాలో రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
  • ఇప్పటికే సగటున 37 డిగ్రీలు నమోదు
  • శీతల పానీయాలు, కూలర్లకు పెరుగుతున్న గిరాకీ

మయూరి సెంటర్‌: అప్పుడే ఎండలు దంచి కొడుతున్నాయి. ఏప్రిల్‌, మే నెలల్లో ఉండాల్సిన ఉష్ణోగ్రతల తరహాలోనే టెంపరేచర్‌ రోజురోజుకూ పెరుగుతున్నది. పొద్దుపొద్దున్నే భానుడు భగభగా మండుతున్నాడు. ఉదయం 9 గంటల నుంచే తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో రోజురోజుకూ ఖమ్మం జిల్లా పరిధిలో ఎండ ప్రభావం పెరుగుతున్నది. ఖమ్మం జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు సగటున 37 డిగ్రీలుగా నమోదవుతున్నాయి. వారం రోజులుగా ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు ప్రత్యామ్నాయ పద్ధతులపై దృష్టి సారించారు. పండ్లరసాలు, ఇతర శీతల పానీయాలు తాగుతూ సేద తీరుతున్నారు. రానున్న ఏప్రిల్‌, మే నెలల గురించి తలుచుకుని హడలిపోతున్నారు. ఖమ్మంలో కనిష్టం 23 డిగ్రీలుండగా, గరిష్టం 37 డిగ్రీలకు చేరుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు పగలు బయటకు రావాలంటే ఇబ్బందులు పడుతున్నారు. ఎండ తీవ్రతకు మనుషులతోపాటు మూగజీవాలు సైతం ఇబ్బందులకు గురవుతున్నాయి.  

పట్టణాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు..

గ్రామాల్లో ఇంటికో చెట్టు, పచ్చని పొలాలు ఉండటంతో ఎండ తీవ్రత కొంచెం తక్కువగా ఉంటుంది. కానీ పట్టణాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో మధ్యాహ్నం సమయంలో ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి.. 

ఊపందుకున్న ‘శీతల’ విక్రయాలు..

వేసవి సీజన్‌ రావడంతో పట్టణాల్లో శీతల పానీయాలు, పండ్ల రసాలు, కొబ్బరి బొండాల వ్యాపారం ఊపందుకున్నది. మధ్యాహ్నం సమయంలో వివిధ పనుల నిమిత్తం బయటకు వస్తున్న ప్రజలు నిమ్మరసం, చెరుకు రసం, రకరకాల పండ్ల రసాలతోపాటు ఇతర శీతల పానీయాలను సేవించి ఊరట చెందుతున్నారు. పుచ్చకాయల వ్యాపారం కూడా బాగా సాగుతున్నది. 

ఉపశమనం కలిగిస్తున్న నిరంతర విద్యుత్‌..

విద్యుత్‌ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని దుస్థితి ఒకనాడు ఉండేది.. తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక సీఎం కేసీఆర్‌ నిరంతర విద్యుత్‌ అందిస్తున్నారు. దీంతో 2014 నుంచి నేటి వరకు గడిచిన వేసవికాలాల్లో తెలంగాణ ప్రజలు కరెంటు కోతలతో ఇబ్బందులు పడిన దాఖలాలు లేవు. కోతలు లేకపోవడంతో వేసవిలో కూడా అన్నివర్గాల ప్రజలు ఇబ్బందులు లేకుండా ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు వేసుకుని సేదతీరుతున్నారు. 


logo
>>>>>>