శనివారం 04 ఏప్రిల్ 2020
Khammam - Mar 17, 2020 , 02:08:56

‘ఫ్రెండ్లీ పోలీసింగ్‌'ను పటిష్టం చేయాలి

‘ఫ్రెండ్లీ పోలీసింగ్‌'ను పటిష్టం చేయాలి
  • ‘పల్లె, పట్టణ ప్రగతి’లో పోలీసుల భాగస్వామ్యం
  • స్టేషన్‌కు వచ్చిన వారితో మర్యాదగా నడుచుకోవాలి
  • అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి: డీజీపీ మహేందర్‌రెడ్డి
  • భద్రాద్రి, మహబూబాబాద్‌ పోలీస్‌ అధికారులతో సమావేశం

కొత్తగూడెం క్రైం, మార్చి 16: బంగారు తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల్లో భాగంగా పట్టణ ప్రగతి, పల్లె ప్రగతిలో పోలీస్‌ శాఖ భాగస్వామ్యం వహిస్తుందని రాష్ట్ర డీజీపీ డాక్టర్‌ ఎం మహేందర్‌ రెడ్డి అన్నారు. ఆయన సోమవారం ప్రత్యేక హెలిక్యాప్టర్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని సింగరేణి మైదానానికి చేరుకున్నారు. తొలుత జిల్లా ఎస్పీ సునీల్‌దత్‌ డీజీపీ మహేందర్‌ రెడ్డికి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి లక్ష్మీదేవిపల్లిలో గల సింగరేణి ఇల్లెందు గెస్ట్‌ హౌజ్‌కు చేరుకుని మహబూబాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పోలీస్‌ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్వహిస్తున్న పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి కార్యక్రమాల్లో పోలీస్‌ శాఖ బాధ్యతాయుతంగా పనిచేసి, మెరుగైన ఫలితాలను సాధించాలన్నారు. అదే విధంగా నేర నియంత్రణకు కృషి చేయాలన్నారు. పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి వారికి న్యాయం చేయడంలో ఎలాంటి జాప్యం చేయకూడదన్నారు. నేరగాళ్లకు శిక్ష పడడంలో చిత్తశుద్ధితో పనిచేసి ప్రజల్లో మరింత నమ్మకాన్ని పెంపొందించుకోవాలన్నారు. రాష్ట్ర సరిహద్దు జిల్లాలైన భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాలో పోలీస్‌ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించి మావోయిస్టు కార్యకలాపాలపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలని సూచించినట్లు తెలిసింది. ఇటీవల మావోయిస్టు పార్టీ యాక్షన్‌ టీమ్‌లు రాష్ట్ర సరిహద్దులోకి వచ్చినట్లు సమాచారం రావడంపై ప్రత్యేకంగా చర్చించినట్లు తెలుస్తున్నది. మావోయిస్టుల కదలికలపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసి, ఎప్పటికప్పుడు వారి సమాచారం సేకరించడంలో నిర్లక్ష్యం వహించకుండా కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు సమాచారం. ఛత్తీస్‌గఢ్‌ కేంద్రంగా మావోయిస్టులు ఉనికిని చాటుకుంటుండంతో ఆ రాష్ట్ర పోలీస్‌ అధికారులతో సమన్వయంతో పనిచేసిన వారి కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని సూచించినట్లు తెలిసింది.

అధికారులతో సమావేశం అనంతరం డీజీపీ మహేందర్‌ రెడ్డి విలేకరులతో మట్లాడుతూ.. పట్టణ, పల్లెప్రగతి కార్యక్రమంలో పోలీస్‌ శాఖ భాగస్వామ్యం వహించి కృషి చేయనున్నట్లు తెలిపారు. అదే విధంగా నేర నియంత్రణ, ట్రాఫిక్‌ సమస్యల పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులకు సూచన చేసినట్లు వివరించారు. అనంతరం ఆయన అతిథి గృహానికి చేరుకున్నారు. అతిథిగృహంలో ఉన్న డీజీపీని భద్రాద్రి జిల్లా కలెక్టర్‌ ఎంవీ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రేహౌండ్స్‌ అదనపు డీజీ కొత్తకోట శ్రీనివాస్‌ రెడ్డి, నార్త్‌ జోన్‌ ఐజీ నాగిరెడ్డి, ఎస్‌ఐబీ ఐజీ ప్రభాకర్‌రావు, భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ సునీల్‌దత్‌, మహబూబాబాద్‌ ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి, అదనపు ఎస్పీ (ఆపరేషన్స్‌) అట్ల రమణారెడ్డి, భద్రాచలం ఏఎస్పీ రాజేష్‌ చంద్ర, మణుగూరు ఏఎస్పీ శబరీశ్‌, ట్రైనీ ఐపీఎస్‌లు బిరుదరాజు రోహిత్‌ రాజు, యోగేశ్‌ కుమార్‌, మహబూబాబాద్‌ డీఎస్పీ ఆంగోతు నరేశ్‌ కుమార్‌, కొత్తగూడెం డీఎస్పీ ఎస్‌ఎం అలి, పాల్వంచ డీఎస్పీ కేఆర్‌కే ప్రసాద్‌, రవీందర్‌ రెడ్డి, ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు పాల్గొన్నారు.  


logo