శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Khammam - Mar 17, 2020 , 01:57:27

భట్టి ఇదిగో అభివృద్ధి

భట్టి ఇదిగో అభివృద్ధి

మధిర నియోజకవర్గం ప్రగతి పథంలో దూసుకుపోతోంది. కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గెలిచినప్పటికీ టీఆర్‌ఎస్‌ సర్కార్‌ ప్రజా సంక్షేమం, అభివృద్ధే పరమావధిగా వివక్ష చూపకుండా భారీగా నిధులు కేటాయించింది. మిషన్‌ భగీరథ,డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు.. రోడ్లు, భవనాలు ఇలా అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అయినా స్థానిక ఎమ్మెల్యే భట్టి విక్రమార్కకు మాత్రం కనిపించడంలేదు.. ‘కాదు..కాదు అభివృద్ధి జరుగుతున్నా.. కళ్లులేని కబోదిలా వ్యవరిస్తున్నారు’ మధిర నియోజవర్గంలో ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చేయడం లేదని తన ఉనికి కాపాడుకునేందుకు సోమవారం అసెంబ్లీ సమావేశాల్లో ప్రయత్నించారు. దీంతో ప్రభుత్వం ఆధారాలతో సహ లెక్కలు చెప్పడంతో భట్టి మాటలు నీటి మాటాలుగా మిగిలాయి.

  • ప్రగతి పథంలో మధిర నియోజకవర్గం..
  • రూ.90.47 కోట్లతో అభివృద్ధి పనులు
  • నియోజక వర్గ వ్యాప్తంగా కొనసాగుతున్న1890 పనులు
  • పర్యవేక్షిస్తున్న పంచాయతీరాజ్‌ఇంజినీరింగ్‌ విభాగం
  • అభివృద్ధిని జీర్ణించుకో లేని ఎమ్మెల్యే భట్టి విక్రమార్క
  • ఉనికి కోసం అసెంబ్లీలో అబద్ధపు మాటలు
  • టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలోనేమధిరకు అధిక నిధులు
  • అసెంబ్లీలో భట్టి తీరుపై ప్రజల ఆగ్రహం..

మామిళ్లగూడెం: ఖమ్మం జిల్లాలో మధిర నియోజకవర్గం ప్రగతి పథంలో దూసుకుపోతున్నది. తెలంగాణ ఏర్పడిన తరువాత వరుసగా ఆ నియోజకవర్గంలో ప్రతి పక్ష కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గెలిచినప్పటికీ ప్రజల అభివృద్ధే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర సర్కారు భారీగా నిధులు కేటాయించి పనులు చేపడుతున్నది. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల కంటే ఒక దశలో మధిర నియోజకవర్గానికి నిధులు అందాయి. ప్రజలకు మౌలిక వసతుల కల్పన కోసం వెచ్చించిన ఆ నిధులతో అభివృద్ధి పనులు కూడా కొనసాగుతున్నాయి. ప్రజలు ఆశించిన స్థాయిలో రోడ్లు, భవనాలు, వంతెనలు ఇలా వివిధ పనులకు నిధులు మంజూరు చేసి రాష్ట్ర సర్కారు నియోజకవర్గ ప్రజలకు బహుమతిగా అందిస్తున్నది. ఇలా పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపడుతున్నప్పటికీ ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లు భట్ట్టి విక్రమార్క మాత్రం కళ్లున్నా చూడలేని వాడిలా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ ప్రభుత్వం మధిర నియోజవర్గంలో ఎలాంటి అభివృద్ధీ జరుగడం లేదని ఆరోపిస్తూ తన ఉనికి కాపాడుకునేందుకు ప్రయత్నించారు. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధారాలతో సహా లెక్కలు చెప్పడంతో భట్ట్టి మాటలు ఒట్టి మాటలుగానే మిగిలాయి. మధిర నియోజకవర్గంలోని ఐదు మండలాలైన ముదిగొండ, చింతకాని, బోనకల్లు, మధిర, ఎర్రుపాలెంలలో రూ.కోట్ల నిధులతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్ని నియోజవర్గాలకూ సమన్యాయంతో నిధులు కేటాయించారు. మధిరలో ప్రతి పక్ష ఎమ్మెల్యే ఉన్నప్పటికీ ప్రజల అభివృద్ధికి ఎలాంటి ఆటంకమూ లేకుండా నిధుల మంజూరుకు పెద్దపీట వేస్తున్నారు. కానీ స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న మల్లు భట్టి మాత్రం జరుగుతున్న అభివృద్ధిని పట్టించుకోకుండా అబద్ధాలతో ఆరోపణలు చేస్తున్నారు. పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ విభాగం ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనుల ప్రగతి వివిధ దశల్లో ఉంది.

భట్టి.. అబద్ధాల ప్రచారం మానుకో..

“మధిర నియోజకవర్గ అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు నిధులు కేటాయిస్తున్నప్పటికీ వివక్ష చూపుతున్నదంటూ మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క అబద్ధాల ప్రచారం చేస్తున్నారు. దీనిని ఆయన మానుకోవాలి. ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యేకూ ప్రభుత్వం ఎన్ని నిధులు కేటాయిస్తున్నదో మధిర ఎమ్మెల్యేకు కూడా అన్ని నిధులు కేటాయిస్తున్నది. మధిర నియోజకవర్గంలో తన అనుచరులతో పనులు చేయిస్తున్న భట్టికి ఆ పనులు గుర్తు లేవా? ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రారంభాలు, శంకుస్థాపనలు, పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా విమర్శించడం సరికాదు. మధిర ప్రజలు ఆశించిన స్థాయిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేస్తున్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న పనులను పట్టించుకోకుండా, ప్రజలకు ముఖం చూపించకుండా అర్థరహితంగా మాట్లాడితే భట్టీకి ప్రజలే తగిన బుద్ధి చెబుతారు. ఇప్పటికైనా ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యేగా భట్టీపై ఉంది.”

-లింగాల కమల్‌రాజు, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ logo