శనివారం 04 ఏప్రిల్ 2020
Khammam - Mar 13, 2020 , 16:39:16

సింగరేణి ప్రభావిత ప్రాంత ప్రగతికి శ్రీకారం

సింగరేణి ప్రభావిత ప్రాంత  ప్రగతికి శ్రీకారం

 సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లో వ్యక్తులు ప్రయోజనం పొందేలా, వారి జీవన ప్రమాణాలు మెరుగు పరచడానికి సంస్థ నిర్మాణాత్మకమైన పద్ధతిలో డీఎంఎఫ్‌ను ప్రారంభించింది. దీని ముఖ్య ఉద్దేశం (మినిస్ట్రీ ఆఫ్‌మైన్స్‌ కంట్రీబ్యూషన్‌ డిస్ట్రిక్‌ మినరల్‌ ఫౌండేషన్‌) నిబంధనలు సెప్టెంబరు 17, 2015 నుంచి అమలులోకి వచ్చింది డీఎంఎఫ్‌ సూచించిన ప్రకారం 2015 జనవరి 12 నుంచి మైనింగ్‌ నిర్వహించే సంస్థ ఏదైనా వచ్చిన లాభాల్లో 10 శాతం రాయల్టీ, 2015 జనవరి 12 ముందు నిర్వహించిన వారు 30 శాతం రాయల్టీని ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. దీనిని ప్రధాన్‌మంత్రి ఖనిజ క్షేత్ర కల్యాణ యోజన (పీఎంకేకేకేవై) కింద ప్రారంభించింది. దీనిని డీఎంఎఫ్‌ నిధులుగా చేర్చి ఆయా ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించుకోవాల్సి ఉంటుంది. 

నిధుల వినియోగం ఇలా..

మైనింగ్‌ ప్రభావిత ప్రాంతాల్లో కనీసం 60 శాతం పీఎంకేకేకేవై ఫండ్‌ను ఈ నిధులను వినియోగించుకోవాల్సి ఉంటుంది. తాగునీటి సరఫరా, పర్యావరణ పరిరక్షణ, పొల్యూషన్‌ కంట్రోల్‌, ఆరోగ్యం, విద్య, మహిళలు, పిల్లల సంక్షేమం కోసం వినయోగించుకోవచ్చు. దివ్యాంగుల సంక్షేమం, స్కిల్‌ డవలప్‌మెంట్‌, పారిశుధ్య పనుల కోసం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది.

డీఎంఎఫ్‌ నిధులతో అభివృద్ధి

డిస్ట్రిక్ట్‌ మినరల్‌ ఫౌండేషన్‌ ఫండ్‌లో భాగంగా సింగరేణి కొత్తగూడెం ఏరియాలో కాలరీస్‌, గనల నుంచి 10 కిలోమీటర్ల పరిధిలో పరిసర ప్రాంత ప్రజలు నివసిస్తున్న కాలనీలలో డ్రైనేజీల నిర్మాణాలు, రహదారులు, పాత రోడ్ల మరమ్మతుల కోసం ఈ నిధులు వినియోగించుకోవచ్చు. ఏ నెలకు ఆ నెలగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నెలవారీగా నిధులు జమ చేస్తున్నారు.

చేపట్టిన పనులు..

లక్ష్మీదేవిపల్లి మండంలం హేమచంద్రాపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రూ.17లక్షలతో డైనింగ్‌ హాల్‌, చుంచుపల్లి మండలం రుద్రంపూర్‌ పంచాయతీ జడ్పీహెచ్‌ఎస్‌లో ప్రహరీ రూ.14 లక్షలు, టాయిలెట్‌ బ్లాక్స్‌కు రూ.15 లక్షలు, భోజన భవనానికి రూ.15 లక్షలు, పెనగడప ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్స్‌ రూ.10 లక్షలు, డైనింగ్‌ హాల్‌కు రూ.15 లక్షలు, పెనుబల్లి ప్రభుత్వ పాఠశాలకు టాయిలెట్స్‌కు రూ.10 లక్షలు, గరీబ్‌పేట ఉన్నత పాఠశాలలో భోజనశాల, మరుగుదొడ్లు, సర్వారం, హరిలాల్‌తండా, కోయగూడెం, ఉప్పరిగూడెం గ్రామాల్లో అంగన్‌వాడీ భవనాలతో పాటు ఇతర నిర్మాణాలు పూర్తికావొస్తున్నాయి. చుంచుపల్లి మండలంలో సింగరేణి ప్రభావిత ప్రాంతాలైన పెనగడప, రాంపురం, అంబేద్కర్‌నగర్‌, శ్రీనగర్‌, వడ్డెరకాలనీ, ములుగుగూడెంలలో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. దీంతో సింగరేణి పరిసర ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలల్లో డైనింగ్‌ హాల్‌ నిర్మించడంతో మధ్యాహ్నం భోజన పథకంలో చెట్ల కింద కూర్చొని తినే దుస్థితి పోయి కార్పొరేట్‌ స్థాయి పాఠశాలల మాదిరిగా డైనింగ్‌ హాల్‌ల్లో పిల్లలకు మరుగుదొడ్లు నిర్మించడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 


logo