శనివారం 04 ఏప్రిల్ 2020
Khammam - Mar 13, 2020 , 16:30:53

అభివృద్ధికి నిధులు..ఉమ్మడి ఖమ్మం జిల్లాకు మహర్దశ

అభివృద్ధికి నిధులు..ఉమ్మడి ఖమ్మం జిల్లాకు మహర్దశ

ఖమ్మం సిటీ  : ‘మన నీళ్లు మనకే.. మన ఉద్యోగాలు మనకే.. మన నిధులు మనకే’.. ఇవీ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం లోని ప్రధానాంశాలు.. ఎన్నో ఏండ్ల పోరాటం.. త్యాగాలు.. ఆత్మ బలిదానాల సాక్షిగా సాధించిన తెలంగాణ రాష్ట్రంలో సరిగ్గా ఐదేండ్ల క్రితం పాలనా పగ్గాలు చేపట్టిన సీఎం కేసీఆర్‌ ఒక్కో రంగంలో పూర్తిస్థాయి ఫలితాలు సాధిస్తున్నారు.. ఇప్పటికే సాగునీరు, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనలో పురోభివృద్ధి సాధించిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, రెండోవిడత అధికారంలోకి వచ్చాక అభివృద్ధిపై దృష్టిసారించింది.. పల్లె ప్రగతి, పట్టణ ప్రణాళిక వంటి మహత్తర కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్నది. ఈ క్రమంలోనే ప్రజల మౌలిక అవసరాలు తీర్చే నిమిత్తం గతేడాది ఎంపిక చేసిన పనులకు భారీగా నిధులు విడుదల చేసింది... ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది అసెంబ్లీ సెగ్మెంట్ల రూపు రేకలు మార్చేందుకు ఏకంగా రూ.7.70 కోట్లు మంజూరు చేస్తూనే, అర్థిక పరమైన పాలనా అనమతులు జారీచేయటం గమనార్హం... దీంతో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఎమ్మెల్యేలతో పాటు, అన్నివర్గాల ప్రజలు సీఎం కేసీఆర్‌కు నీరాజనాలు పలుకుతున్నారు..!

    భారతదేశాన్ని ఆర్ధికమాంధ్యం వెక్కిరిస్తున్నా, కేంద్రంలోని బీజేపీ సర్కారు నిధుల మంజూరులో మొండి వైఖరి అవలంభిస్తున్నా తెలంగాణ ప్రజల అవసరాలు తీర్చటంలో సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం ఏమాత్రం వెనకడుగు వేయటం లేదు. ఇటీవలే అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర వార్షిక బడ్జెట్‌లో అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేసి తమ ఉద్దేశ్యాన్ని చాటి చెప్పింది. దీనిలో భాగంగానే గతేడాది (2018-2019) పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఎంపిక చేసిన అనేక రకాల పనులకు ఒక్కసారిగా నిధుల వరద పారించింది. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు ప్రతిఫలించే విధంగా ఉమ్మడి జిల్లాకు రూ.7,70,32,638లు కేటాయించింది. వీటిల్లో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ కోటా కింద రూ.2,17,05,008 లు ఉండటం గమనార్హం. కాగా ఇరు జిల్లాలకు మంజూరైన మొత్తం నుంచి జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ప్రత్యేక నిధులు కేటాయించటం విశేషం. దీంతో ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, పాలేరు, మధిర, వైరా, సత్తుపల్లి సెగ్మెంట్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం, భద్రాచలం, పినపాక, అశ్వరావుపేట, ఇల్లెందు అసెంబ్లీ నియోజకవర్గాలు కొత్త రూపును సంతరించుకోనున్నాయి.

ఖమ్మానికి రూ. 2.71 కోట్లు..

బంగారు తెలంగాణ కోసం బాటలు వేస్తున్న సీఎం కేసీఆర్‌ సర్కారు యావత్‌ రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లకు సీడీపీ, ఎమ్మెల్సీ కోటా కింద భారీగా నిధులు మంజూరు చేసింది. దీనిలో భాగంగానే ఖమ్మం జిల్లా పరిధిలోని ఖమ్మం, పాలేరు, మధిర(ఎస్సీ), వైరా(ఎస్టీ), సత్తుపల్లి(ఎస్సీ) నియోజకవర్గాలకు కలిపి రూ. 2,71,22,720లు కేటాయించింది. వీటిల్లో జనరల్‌ కోటాకింద రూ. 2,35,94,490లు, ఎస్సీ ఎస్‌డీపీ కోటా కింద రూ. 25,92,516, ఎస్టీ ఎస్‌డీపీ కోటా కింద రూ. 9,35,714 నిధులు విడుదలయ్యాయి. కాగా జనరల్‌ నిధులు అన్ని ప్రాంతాలకు వినియోగించుకునే వీలుంది. కానీ ఎస్సీ, ఎస్టీ ఎస్‌డీపీ నిధులు మాత్రం ఆయా వాడల్లోని మౌలిక సదుపాయాలకు మాత్రమే ఖర్చుచేయాలని సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం నిబంధనలు విధిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.

ఎమ్మెల్సీ ‘బాలసాని’ నిధులు రూ. 2.17 కోట్లు..

ఉమ్మడి రాష్ట్రంలో నిధుల కేటాయింపు పూర్తి పక్షపాతమని అందరికీ తెలిసిందే. ప్రభుత్వానికి చెందిన మంత్రులు, అనుచర ఎమ్మెల్యేలకు మాత్రమే అధిక మొత్తంలో నిధులు విడుదల చేస్తూ ప్రతిపక్షంలోని సభ్యులకు తీవ్ర అన్యాయాన్ని మిగిల్చిన సందర్భాలు కోకొల్లలు. కానీ సబ్బండ వర్ణాల సమిష్టి పోరాటంతో సాధించుకున్న తెలంగాణలోని అన్ని ప్రాంతాలకు సమానంగా నిధులు కేటాయిస్తున్న టీఆర్‌ఎస్‌ సర్కారు ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలకు పెద్దపీట వేసింది. దీనిలో భాగంగా స్థానిక సంస్థల కోటాలో గెలుపొంది జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ కోటా కింద రూ. 2,17,05,008లను విడుదల చేసింది. వీటిల్లో జనరల్‌ కోటా కింద 1,80,00,086లు, ఎస్సీ ఎస్‌డీపీ కింద రూ. 22,81,936లు, ఎస్టీ ఎస్‌డీపీ కింద 14,22,986లు మంజూరయ్యాయి. కాగా ఎమ్మెల్సీ నిధుల్లో సైతం జనరల్‌ మినహాయిస్తే ఎస్సీ, ఎస్టీ ఎస్‌డీపీ నిధులు ఆయా వాడలకే వినియోగించుకోవాల్సి ఉంది..

భద్రాద్రి జిల్లాకు రూ.2.82 కోట్లు..

ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో పూర్తి ఏజెన్సీ ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు మరికొద్ది రోజుల్లో మహర్ధశ పట్టనుంది. పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా ఖమ్మం నుంచి విడిపోయి భద్రాద్రి కొత్తగూడెంగా విరాజిల్లుతున్న జిల్లాకు నిధుల కేటాయింపులో సీఎం కేసీఆర్‌ పెద్దపీట వేశారు. మొత్తం జనాభాలో అత్యధికమంది గిరిజన తెగలకు చెందిన వారే కావటం, అనాదిగా వారు అభివృద్ధికి ఆమడదూరంలో జీవిస్తున్న పరిణామాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని ఒకేసారి రూ.2,82,04,910లు మంజూరు చేశారు. జిల్లాలోని కొత్తగూడెం, భద్రాచలం(ఎస్టీ), అశ్వరావుపేట(ఎస్టీ), ఇల్లెందు (ఎస్టీ), పినపాక (ఎస్టీ) నియోజకవర్గాలకు గతంలో ఎన్నడూలేనంతగా నిధుల కేటాయింపు జరిపారు. జనరల్‌ ఎస్‌డీపీ కోటా కింద రూ. 2,18,10,160లు, ఎస్సీ ఎస్‌డీపీ కింద రూ. 26,22,380, ఎస్టీ ఎస్‌డీపీ కోటా కింద 37,72,370లు విడుదలయ్యాయి. ఈ జిల్లా పరిధిలో సైతం జనరల్‌ నిధులు అన్ని ప్రాంతాల్లకు, ఎస్సీ, ఎస్టీ ఎస్‌డీపీ నిధులు మాత్రం ఆయా వర్గాలకు చెందిన వాడల్లో మాత్రమే ఖర్చుచేయాల్సి ఉంది. 


జిల్లాలకు చేరిన నిధులు..

ఇచ్చిన ప్రతీ హామీని ప్రాధాన్యతాంశాల పరంగా నెరవేర్చుతూ వస్తున్న ప్రభుత్వం, అసెంబ్లీ సెగ్మెంట్లను దృష్టిలో పెట్టుకుని నిధుల కేటాయింపులు జరిపింది.  గతేడాది (2018-2019)తో పాటు 2019-2020 సంవత్సరానికి సైతం ఎంపిక చేసిన అభివృద్ధి పనుల పూర్తికి పుష్కలమైన నిధులు వచ్చాయి. కాగా తెలంగాణ సర్కారు అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా మంజూరు చేసిన నిధులు గురువారం జిల్లాల ట్రెజరీ ఖాతాల్లో జమ అయ్యాయి. ఆయా నిధులను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ద్వారా ఖర్చు చేయాల్సి ఉన్నప్పటికీ పర్యవేక్షణ బాధ్యత జిల్లా కలెక్టర్లకు అప్పగించారు. దీంతో ఇరు జిల్లాల పరిధిలోని పది అసెంబ్లీ సెగ్మెంట్లలో సీసీ రహదారులు, సైడు కాలువలు, కమ్యూనిటీ హాల్స్‌ నిర్మాణం వంటి కీలక పనులు పూర్తిచేయనున్నారు. 

మంత్రి పువ్వాడ అజయ్‌ హర్షం..

అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో గతేడాది ఎంపిక చేసిన అభివృద్ధి పనులకు గాను ఇటీవలే ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో నిధుల కేటాయింపులు జరపటంతో పాటు వెంటనే పరిపాలనా ఉత్తర్వులు జారీచేయటం హర్షణీయమని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ వ్యాక్యానించారు. ఇది ముమ్మాటికీ సీఎం కేసీఆర్‌ పాలనాదక్షతకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఒకే ఏడాది ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు కలిపి దాదాపు రూ.7.64 కోట్లు విడుదల చేయటం చారిత్రకమని అన్నారు. ఆయా నిధులతో గ్రామీణ ప్రాంతాల్లోని సీసీ రహదారులు, సైడు కాలువలు, కమ్యూనిటీ హాల్స్‌ వంటి అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. మంత్రి పువ్వాడతోపాటు పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి, వైరా ఎమ్మెల్యే రాములు నాయక్‌, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, ఇల్లెందు ఎమ్మెల్యే బాణోత్‌ హరిప్రియ, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావుతోపాటు ప్రతిపక్ష సభ్యులు, ఇరు జిల్లాల ప్రజానీకం సంతోషం వ్యక్తంచేశారు.  


logo