గురువారం 02 ఏప్రిల్ 2020
Khammam - Mar 13, 2020 , 16:25:29

ఖమ్మంలో అన్నపూర్ణ తో కడుపునిండా..

ఖమ్మంలో అన్నపూర్ణ తో కడుపునిండా..

‘అన్నం పరఃబ్రహ్మ స్వరూపం. అన్ని దానాలకన్నా అన్నదానం మిన్న..’ అనేది మన సంస్కృతి. ఇంటికి అతిథులు ఏ సమయంలో వచ్చినా ‘భోజనం చేయండి’ అని అడిగి కడుపు నిండా భోజనం పెట్టడం మన సంప్రదాయం. భోజనం పెట్టిన వారిని అతిథులు నిండు మనసుతో దీవించి ఎల్లకాలమూ గుర్తుంచుకుంటారు. ఇలా సంప్రదాయాలూ, ఆకలి బాధలూ తెలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌లు కూడా ఇదే ఆలోచన చేస్తున్నారు. వివిధ పనుల నిమిత్తం పట్టణాలకు, నగరాలకు వచ్చే పేదల ఆకలి తీర్చేందుకు, అక్కడే పనులు చేసుకునే చిరు వ్యాపారులకు రూ.5కే సంతృప్తికరమైన భోజనం అందించేందుకు రెండేళ్ల క్రితమే శ్రీకారం చుట్టారు. దాని పేరే అన్నపూర్ణ భోజన పథకం. అయితే దేశవ్యాప్తంగా కూడా అనేక నగరాల్లో ఈ పథకం అమలవుతున్నది. ముఖ్యంగా ఖమ్మం నగరంలో ఈ పథకాన్ని అందుబాటులోకి తేవడంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ కృషి ఎంతో ఉంది. ఆయన చొరవ కారణంగానే ఖమ్మం నగరానికి ఐదు అన్నపూర్ణ కేంద్రాలు మంజూరయ్యారు. అందులో ఇప్పటికే మూడు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. మరో రెండో కేంద్రాలు త్వరలో ప్రారంభం కానున్నాయి.  

ఖమ్మంలో తొలుత గత ఏడాది ఫిబ్రవరి 21న పెవిలియన్‌ గ్రౌండ్‌ వద్ద ఈ పథకానికి సంబంధించిన మొదటి కేంద్రాన్ని అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న అజయ్‌కుమార్‌ ప్రారంభించారు. తరువాత గాంధీచౌక్‌లో రెండో కేంద్రాన్ని కూడా ప్రారంభించారు. తాజాగా రెండు రోజుల క్రితం బైపాస్‌రోడ్‌లోని ఎన్‌టీఆర్‌ సర్కిల్‌ వద్ద మూడో కేంద్రాన్ని మంత్రి అజయ్‌ ప్రారంభించారు. కాగా మరో రెండు చోట్ల ఈ కేంద్రాలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. 

పట్టణాల్లోనే అన్నపూర్ణ భోజనం.. 

గ్రామీణ ప్రాంతాల నుంచి వివిధ పనుల నిమిత్తం నగరానికి వచ్చే ప్రజలకు, నగరంలో నివాసం ఉంటూ వివిధ రకాల కూలి పనులు చేసుకునే నిరుపేదలకు మధ్యాహ్న సమయంలో భోజనాన్ని అందించడమే ఈ పథకం ఉద్దేశం. తొలుత హైదరాబాద్‌లో ప్రారంభమైన ఈ పథకం విజయవంతంగా కొనసాగుతున్నది. దీంతో రాష్ట్రంలోని మిగిలిన మున్సిపాలిటీల్లో కూడా దీన్ని అమలు చేస్తున్నారు. ఈ రోజుల్లో ఏ పట్టణంలోనైనా హోటల్‌కు వెళ్లి భోజనం చేయాంటే కనీసం రూ.100 ఖర్చు అవుతున్నది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూలి పనులు చేసుకునే పేదలు అంతమొత్తం వెచ్చించలేని కారణంగా వారి ఆకలిని తీర్చేందుకు సీఎం కేసీఆర్‌ ఈ పథకాన్ని ప్రారంభించారు. రూ.5కే భోజనం అందించడం భారం అయినప్పటికీ ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఖమ్మం నగరానికి సంబంధించిన ఐదు కేంద్రాలు కాక. సత్తుపల్లి, వైరా, మధిర పట్టణాల్లో కూడా త్వరలో ఈ కేంద్రాలు ప్రారంభం కానున్నాయి. 

ఖమ్మంలో ఐదు కేంద్రాలు.. 

ఖమ్మం నగరపాలక సంస్థలో రూ.5కే భోజనం పథకం కేంద్రాలు ఐదు మంజూరయ్యాయి. తొలుత కోర్టు ఎదురుగా   ఈ కేంద్రాన్ని అప్పటి కమిషనర్‌ ప్రారంభించారు. సరైన ప్రణాళిక, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం వంటివి లేకపోవడంతో అది మధ్యలోనే మూతబడింది. దీంతో మంత్రి అజయ్‌కుమార్‌ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఖమ్మానికి మంజూరైన ఐదు కేంద్రాలను త్వరితగతిన ప్రారంభించేలా మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులను ఆదేశించారు. వెంటనే స్పందించిన మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు ఒకదాని తరువాత మరొకటి చొప్పున ఇప్పటికి మొత్తం మూడు కేంద్రాలను ప్రారంభించారు. మరో రెండు కేంద్రాలను ప్రారంభించనున్నారు. 

అక్షయపాత్ర ఫౌండేషన్‌కు బాధ్యతలు.. 

అన్నపూర్ణ భోజన పథకం ద్వారా పేదలకు రూ.5కే భోజనం అందించే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం అక్షయపాత్ర ఫౌండేషన్‌కు అప్పగించింది. రాష్ట్రంలోని అన్ని కేంద్రాల్లోనూ ఈ పథకం నిర్వహణను ఆ సంస్థే పర్యవేక్షిస్తున్నది. ఏ మున్సిపాలిటిలోనైతే ఈ పథకాన్ని ప్రారంభించారో ఆ మున్సిపాలిటీ ఒక్కొక్క భోజనానికి అక్షయపాత్ర ఫౌండేషన్‌కు రూ.24 చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన రూ.5ను భోజనం చేసిన వ్యక్తి నుంచి ఆ సంస్థ తీసుకుంటుంది. సేవా దృక్పథంతోనే అక్షయపాత్ర ఫౌండేషన్‌ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లోనూ ఈ భోజనాన్ని సమకూరుస్తున్నది. అయితే ఒక్కొక్క భోజనానికి రూ.24 చెల్లించడం వల్ల ఖమ్మం కార్పొరేషన్‌పై ఏడాదికి దాదాపు రూ.1.70 కోట్లకుపైనే భారం పడుతున్నది. ఖమ్మంలో ఒక్కొక్క కేంద్రం వద్ద రోజుకు సుమారు 350 మందికి భోజనం అందిస్తున్నారు. 

రూ.5కే కడుపునిండా భోజనం.. 

తెలంగాణ ప్రభుత్వం రూ.5కే కడుపునిండా భోజన పెడుతుండడం పట్ల పేదలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఫౌండేషన్‌ బాధ్యులు రోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు భోజనం వడ్డిస్తారు. ముందు వచ్చిన వారికి టోకెన్‌లను అందజేస్తారు. ఆ తరువాత అందరికీ భోజనం పెడతారు. సరిపడినంత అన్నం, పప్పు, ఒక కూర, అప్పడం, ఒక వాటర్‌ ప్యాకిట్‌, ఉచిత పేపర్‌ ప్లేట్‌ను అందిస్తారు. ఖమ్మం కంటే ముందు ఈ పథకం కొత్తగూడెంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభమైంది. 

ఏడాదికి రూ.1.70 కోట్లపైనే భారం.. 

ఖమ్మంలో ఐదు కేంద్రాలూ కొనసాగితే రోజుకు సుమారు 2000 భోజనాలు పెట్టాల్సి ఉంటుంది. ఒక్కో భోజనానికి మున్సిపల్‌ కార్పొరేషన్‌ రూ.24ను భరిస్తుంది. అంటే రోజుకు రెండు వేలమందికి భోజనం అందిస్తే రోజుకు రూ.48 వేలు ఖర్చు అవుతుంది. అంటే నెలకు 14,40,000, ఏడాదికి రూ.1,72,80,000 ఖర్చు అవుతుంది.  

logo