సోమవారం 30 మార్చి 2020
Khammam - Mar 09, 2020 , 23:54:10

డీసీఎంఎస్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల బాధ్యతల స్వీకరణ

డీసీఎంఎస్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల బాధ్యతల స్వీకరణ

ఖమ్మం వ్యవసాయం: డీసీఎంఎస్‌ పురోభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తామని జిల్లా కేంద్ర సహకార మార్కెటింగ్‌ సొసైటీ(డీసీఎంఎస్‌) చైర్మన్‌గా ఎన్నికైన రాయల వెంకటశేషగిరిరావు, వైస్‌చైర్మన్‌గా ఎన్నికైన కొత్వాల శ్రీనివాసరావులు అన్నారు. సోమవారం ఉదయం నగరంలోని డీసీఎంఎస్‌ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఇరువురు సారథులు తొలుత బాధ్యతలు చేపట్టారు. అనంతరం పాలకవర్గ సభ్యులు సైతం తమ బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, అతిథులుగా ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్రా వెంకటవీరయ్య, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ కొండబాల కోటేశ్వరరావులు హాజరయ్యారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన సారథులకు వారు పుష్పగుచ్ఛాలు అందించి శాలువాలతో ఘనంగా సత్కరించారు. సొసైటీ చైర్మన్లు అనేక పర్యాయాలు పనిచేసిన నాయకులు డీసీఎంఎస్‌ సారథులుగా నియామకం కావడం సంతోషదాయకమని మంత్రి పువ్వాడ పేర్కొన్నారు. రానున్నరోజుల్లో పంట ఉత్పత్తుల క్రయవిక్రయాలతో పాటు, ఇతర వ్యాపారాలు చేసి డీసీఎంఎస్‌ను లాభాల బాటలో పయనించే విధంగా పనిచేయాలని సూచించారు. అదేవిధంగా రైతులు పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం బాధ్యతలు స్వీకరించిన చైర్మను, వైస్‌చైర్మను మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌, ఉమ్మడి జిల్లా ఆశాకిరణం మంత్రి పువ్వాడకు తాము ఎంతో రుణపడి ఉంటామన్నారు. వారి ఆశయసాధనకు అనుగుణంగా పని చేస్తామన్నారు. ఈ అవకాశం రావడానికి కృషి చేసిన ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీకి, జడ్పీ చైర్మన్లకు, సొసైటీ చైర్మన్లకు, పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. అన్నదాతల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్‌ పాలకవర్గ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.


logo