మంగళవారం 07 జూలై 2020
Khammam - Mar 09, 2020 , 23:46:28

సంప్రదాయబద్ధంగా డూండ్‌

సంప్రదాయబద్ధంగా డూండ్‌

(కారేపల్లి రూరల్‌/ కూసుమంచి రూరల్‌):డూండ్‌ వేడుకలను గిరిజనులు మూడు రోజులు సంబురంగా జరుపుకుంటారు. ఈ ఉత్సవంలో బంజారా కులపెద్దలను గేరియా, గేర్ని అని పిలుస్తారు. హోలీకి ముందే గేరియాలు అడవికి వెళ్ళి పది అడుగుల పొడవైన పచారి కర్రను తెస్తారు. ఈ ఉత్సవానికి ధ్వజస్తంభంలా భావించే ఈ కర్రను అడవి నుంచి పవిత్రంగానే తీసుకొస్తారు. కింద పెట్టకుండా భుజాలు మార్చుకుంటూ ఇంటికి చేరుస్తారు. గేరియా, గేర్నిలు నవధాన్యాలతో పూజలు నిర్వహించి ఆ ధ్వజ స్తంభాన్ని డూండ్‌ ఉత్సవం జరిపే వారి ఇంటి ఆవరణలో పాతుతారు. ఇదంతా మొదటి రోజు కార్యక్రమం రెండో రోజు నిర్వహించే కీలకమైన ఘట్టమే డూండ్‌. ఆ ఉత్సవాన్ని హోలీ రోజు జరుపడం ఆనవాయితీ. ఈ సామ్యాతండాలో హోలీని సోమవారం నిర్వహించారు. కాబట్టి డూండ్‌ ఉత్సవాన్ని కూడా ఇదే రోజు చేపట్టారు. ధ్వజస్తంభం పక్కనే రెండు చిన్న కర్రలను పాతి వాటికి పాయసంతోపాటు ఐదు రకాల పిండివంటలతో కూడిన రెండు గంగాళాలను ఆ కర్రలకు కడతారు. డూండ్‌ ఆటలో ఈ గంగాళాన్ని తెచ్చిన వారిని ధైర్యవంతుడిగా ప్రకటిస్తారు.

ఆనందంగా దెబ్బలు తినాలి.. 

ధ్వజ స్తంభానికి కట్టిన గంగాళాన్ని ఎత్తుకు పోకుండా దాని చుట్టూ మహిళలు కర్రలు పట్టుకొని రెండంచెలుగా కాపలా కాస్తారు. గంగాళం కోసం ప్రయత్నం చేసే మగవారిని లోపలకు వెళ్ళనీయకుండా అడ్డుకుంటారు. అయినా చొచ్చుకొని వచ్చే మగవారిని మహిళలు కర్రలతో సరదాగా కొట్టడం ఈ ఆచారంలో భాగం. దెబ్బలు తగిలినా మహిళలను ఎవరూ ఏమీ అనకూడదనేది నిబంధన. మగవారి దగ్గర కూడా కర్రలు ఉంటాయి కానీ వాటితో మహిళలను కొట్టకూడదు. మహిళలు కొట్టే కర్రదెబ్బల నుంచి కాపాడుకోవడానికి మాత్రమే వాటిని ఉపయోగిస్తారు. ఈ కార్యక్రమం గేరియాలుగా పిలవబడే కులపెద్దల పర్యవేక్షణలోనే జరిగింది. వీరిలో మగ కులపెద్దలను గేరియాలని, ఆడ కులపెద్దలను గేర్నిలని పిలుస్తారు. సోమవారం జరిగిన ఈ డూండ్‌ ఉత్సవాన్ని తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ప్రజలు సామ్యాతండాకు వచ్చారు. ఉత్సవం అనంతరం బంజారాలంతా వారి సంప్రదాయ నృత్యాలతో సందడి చేశారు. 

లోక్యాతండాలో..

కూసుమంచి మండల పరిధిలోని లోక్యాతండాలో జరుగుతున్న హోలీ ఉత్సవాల్లో భాగంగా సోమవారం రెండో రోజు డూండ్‌ కార్యక్రమంగా సంప్రదాయబద్ధంగా జరిగింది. తెల్లవారుజామున కామదహనం అనంతరం ఈ తంతు జరుగుతుంది. మూడోరోజుల వేడుకల్లో ప్రధానమైన డూండ్‌ సందర్భంగా బంధువులు, స్నేహితులు భారీ సంఖ్యలో తరలిరావడంతో తండాలో సందడి నెలకొంది. గత హోలీ పండుగ నుంచి ఇప్పటివరకు తండాలో జన్మించిన మగ పిల్లలకు బారసాల, నామకరణం, అన్నప్రాసన వేడుకలు జరపడమే డూండ్‌. సంప్రదాయంతో నిర్వహించే ఈ కార్యక్రమం గ్రామస్తులకు ఐక్యత పట్ల, వారసత్వ ఆచారాల పట్ల ఉన్న గౌరవాలకు ప్రతీక. ఈ వేడుకలో భాగంగా మగబిడ్డకు నామకరణం చేయాల్సిన గృహస్తులు గేరియాగా పిలువబడే గ్రామపెద్దను, బంధుమిత్రులను ఆహ్వానించారు. వీరంతా కోలాటాలు, మేళతాళాలతో వారి ఇళ్లకు వెళ్లారు. అనంతరం సంప్రదాయ గేయాలను ఏడుసార్లు ఆలపించి, తల్లీబిడ్డలను దీవించారు. వేడుకల్లో భాగంగా తయారుచేసిన పాయసం బిందెలను తాళ్లతో కట్టి బయటకు తెచ్చి గేరియా సూచనతో పంచిపెట్టారు. బిడ్డకు నామకరణం అనంతరం ఇదే పాయసంతో అన్నప్రాసన చేస్తారు. గ్రామంలో మగబిడ్డలు ఉన్న అన్ని ఇళ్లలో వరుస క్రమంలో ఇదే తంతు నిర్వహించారు. అనంతరం బంధువులు, స్నేహితులకు విందు ఏర్పాటు చేశారు. గత ఏడాది గ్రామంలో 21 మంది మగబిడ్డలకు డూండ్‌ వేడుకలు జరగగా.. ఈ ఏడాది జన్మించిన 12 మందికి జరిగాయని గ్రామస్తులు తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు డూండ్‌ ఉత్సవాలు కోలాహలంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో గేరియాలు వడ్త్యా సామా, రవి, ఎంపీటీసీ సభ్యుడు జర్పుల బాలాజీ, తండా పెద్దలు సేట్రామ్‌నాయక్‌, వడ్త్యా రామచంద్రునాయక్‌, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 


logo