బుధవారం 08 ఏప్రిల్ 2020
Khammam - Mar 07, 2020 , 23:50:46

కంగారు పడొద్దు

కంగారు పడొద్దు

మయూరి సెంటర్‌ : జిల్లాలో కరోనా వైరస్‌ పట్ల ప్రజలకు ఎటువంటి ఆందోళన అవసరం లేదని ఇప్పటి వరకు ఎలాంటి పాజిటివ్‌ కేసులు నమోదు కాలేదని కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ తెలిపారు. జిల్లా ప్రధాన ఆసుపత్రిలో 8 బెడ్లతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కరోనా ఐసోలేషన్‌ వార్డును శనివారం కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్యాధికారులకు పలు సూచనలు చేశారు. ఐసోలేషన్‌ వార్డులో 12 మందితో కూడిన వైద్యాధికారుల బృందాన్ని 24 గంటలు విధుల్లో ఉండే విధంగా కేటాయించినట్లు తెలిపారు. ఫస్ట్‌ ఎయిడ్‌ డ్రగ్స్‌, మైక్రోబయాలజికల్‌ ల్యాబ్‌ను అందుబాటులో ఉంచినట్లు అదనంగా మమత జనరల్‌ హాస్పిటల్‌లో మహిళలకు, పురుషులకు 40 బెడ్లతో కూడిన ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ తెలిపారు. ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీంను 10 మంది వైద్యాధికారులతో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు నివారణ మార్గాన్ని ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని వైద్యాధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. వదంతులను నమ్మకూడదని, ప్రజలు ఎటువంటి భయబ్రాంతులకు గురికావాల్సిన అవసరం లేదని కలెక్టర్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్‌ బీ మాలతి, ప్రభుత్వాసుప్రతి ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కృపాఉషశ్రీ, ఆర్‌ఎంవో డాక్టర్‌ బొలికొండ శ్రీనివాసరావు, జిల్లా మలేరియా అధికారి డాక్టర్‌ సైదులు తదితరులున్నారు. 


logo