ఆదివారం 29 మార్చి 2020
Khammam - Mar 06, 2020 , 23:49:34

కరోనాపై కంగారొద్దు..

కరోనాపై కంగారొద్దు..

మయూరి సెంటర్‌, మార్చి 6: రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ఇటీవల హైదరాబాద్‌లో కరోనా పాజిటీవ్‌ కేసు నమోదు కావడంతో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సూచనలతో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఆదేశాలతో జిల్లా వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. కరోనా అనుమానిత కేసులు ఖమ్మంలో ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి ఈనెల 5వ తేదీన రాగా ఆ దంపతులను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో పరీక్షలు నిర్వహించి అదేరోజు అర్ధరాత్రి ఇతర పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌లోని గాంధీ వైద్యశాలకు తరలించారు. ప్రపంచ దేశాలను హడలెత్తిస్తున్న కోవిడ్‌-19 (కరోనా) పాజిటీవ్‌ కేసులు ఖమ్మం జిల్లాలో లేవని, కరోనా వైరస్‌పై పుకార్లు నమ్మి భయాందోళనకు గురికావద్దని జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్‌ మాలతి శుక్రవారం నగరంలోని డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరించారు. కరోనా అనుమానిత కేసులకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిలో ప్రత్యేకంగా 8 పడకల ఐసోలేషన్‌ వార్డు, మమత వైద్యశాలలో 40 పడకలతో మరో వార్డు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈనెల 5వ తేదీ రాత్రి వైరా మండలం విప్పలమడక గ్రామానికి చెందిన దేవబత్తిని కృష్ణకుమారి (52), కృష్ణారావు (60) దంపతులకు కొవిడ్‌ లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో ప్రభుత్వాసుపత్రిలో చేర్పించి తగిన పరీక్షలు చేయించి వెంటనే 108 వాహనం ద్వారా అర్ధరాత్రి 1:15 గంటలకు హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి పంపినట్లు చెప్పారు. అక్కడ గాంధీ ఆసుపత్రి ప్రత్యేక వైద్యుల సమక్షంలో అన్ని రకాల పరీక్షలు చేసి కరోనా వైరస్‌ లేదని నిర్ధారించినట్లు ఆమె తెలిపారు. దంపతులు నవంబర్‌ నెలలో జర్మనీలో ఉన్న తమ కూతురు వద్దకు వెళ్లి 2020 ఫిబ్రవరి 20వ తేదీన ఇండియాకు వచ్చినట్లు తెలిపారు. వారికి విమానాశ్రయంలో ఎలాంటి పరీక్షలు జరపలేదన్నారు. ఆమెకు జలుబు, అతనికి పెరాలసిస్‌ ఇదివరకే ఉన్నందున ఈ నెల 3వ తేదీన ఖమ్మంలోని ఓ ప్రైవేట్‌ వైద్యశాలకు వెళ్లి తగిన చికిత్సలు తీసుకుని వారి నివాసానికి చేరుకున్నారన్నారు. వారు విదేశాలకు వెళ్లి వచ్చిన నేపథ్యంలో అనుమానించి గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. వారికి ఎటువంటి కరోనా వ్యాధి లక్షణాలు లేవని వైద్యులు నిర్ధారించినట్లు స్పష్టం చేశారు. ఇంత వరకు జిల్లాలో అలాంటి లక్షణాలున్నవారు ఎవరూ లేరని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ముఖ్యంగా సోషల్‌ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దన్నారు. అదే విధంగా ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని జనసాంద్రత కలిగిన ప్రాంతాల్లో ముఖానికి మాస్క్‌లు, చేతిరుమాళ్లు ధరించాలని ఆమె సూచించారు. జిల్లాల్లో ఆర్‌ఎంపీ, పీఎంపీలు వారికి తోచిన విధంగా చికిత్సలు చేయవద్దని, జలుబు, దగ్గు, జ్వరం లక్షణాలుంటే వెంటనే ప్రభుత్వాసుపత్రికి వెళ్లే విధంగా సూచనలు చేయాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో ఐడీఎస్‌పీ డాక్టర్‌ కోటిరత్నం, డిప్యూటీ డెమో సాంబశివారెడ్డి తదితరులున్నారు.    


logo