మంగళవారం 31 మార్చి 2020
Khammam - Mar 06, 2020 , 23:48:37

ఊపిరిపీల్చుకున్న విప్పలమడక

ఊపిరిపీల్చుకున్న విప్పలమడక

వైరా, నమస్తే తెలంగాణ: ప్రపంచంలోని పలు దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్‌ లక్షణాలు తమ గ్రామంలో కూడా ఉన్నాయని వదంతులతో వైరా మండలం లోని విప్పలమడక గ్రామం ఉలిక్కిపడింది. కరోనా వైరస్‌ లక్షణాలు విప్పలమడకలో లేవని స్వయానా డీఎంఅండ్‌హెచ్‌వో  మాలతి ప్రకటించడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. విప్పలమడకకు చెందిన దేవబత్తిని కృష్ణారావు, కృష్ణకుమారి దంపతులు డెర్లింగ్‌లో ఉంటున్న తమ కుమార్తె, అల్లుడు వద్దకు ఈ ఏడాది నవంబర్‌18వ తేదీన వెళ్లారు. ఆ దంపతులు తిరిగి ఫిబ్రవరి 20వ తేదీన విప్పలమడక  వచ్చారు. అయితే ఇతర దేశంలో సుమారు 4 నెలలు ఉండి తిరిగి విప్పలమడకకు వచ్చిన ఆ దంపతులకు ఇక్కడి వాతావరణం సమతుల్యం కాకపోవడంతో స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.  గురువారం వైద్య పరీక్షలు చేయించుకునేందుకు ఖమ్మంలోని ప్రైవేటు వైద్యశాలకు వెళ్లింది. అక్కడి వైద్యలు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న సమయంలో తాము ఇటీవల జర్మని నుంచి వచ్చామని వివరించింది. దీంతో జర్మని నుంచి వచ్చిన ఆమెకు కరోనా లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో ఆ ప్రైవేటు వైద్యశాల వారు ప్రభుత్వ వైద్యశాలకు సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ గురువారం రాత్రి 10గంటల సమయంలో అధికారులు 108 వాహనంతో విప్పలమడక వచ్చి దేవబత్తిని కృష్ణారావు, కృష్ణకుమారి దంపతులతో పాటు కుమారుడు నగేష్‌ను ఆ వాహనంలో ఖమ్మానికి తరలించారు. అనంతరం భార్యభర్తలు ఇద్దరికి ఖమ్మంలో వైద్య పరీక్షలు చేశారు. మెరుగైన వైద్య పరీక్షల కోసం వారిని హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. గాంధీ ఆసుపత్రిలో ఆ దంపతులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఆ దంపతులకు కరోనా వైరస్‌ సోకలేదని నెగిటివ్‌ రిపోర్ట్‌ వచ్చింది. వెంటనే ఆ దంపతులను వైద్య  అధికారులు ఖమ్మం తీసుకొచ్చారు. చివరకు డీఎంహెచ్‌వో మాలతి విప్పలమడక గ్రామానికి చెందిన దంపతులకు కరోనా వైరస్‌ లేదని ప్రకటించారు.

కరోనా వైరస్‌పై అవగాహన సదస్సు

వైరా, నమస్తే తెలంగాణ, మార్చి 6 : వైరా మండలంలోని విప్పలమడక గ్రామంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కరోనా వైరస్‌పై శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ గ్రామానికి చెందిన భార్యాభర్తలకు కరోనా లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గురువారం రాత్రి వైద్య పరీక్షల కోసం హైదరాబాద్‌ తరలించారు. దీంతో అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖ మండల అధికారులు అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. అయితే వారికి కరోనా వ్యాధి లక్షణాలు లేవని వైద్య పరీక్షల్లో నెగిటివ్‌ ఫలితం వచ్చింది. ఈ విషయాన్ని అధికారులు గ్రామస్తులకు వివరించారు. కరోనా వైరస్‌ లక్షణాలు, దాని నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను జిల్లా సర్వే లైన్‌ టీమ్‌ అధికారిణి డాక్టర్‌ కోటిరత్నం వివరించారు. ఈ కార్యక్రమంలో టీమ్‌ లీడర్‌ డాక్టర్‌ మాధవరావు, సూపర్‌వైజర్‌ తాళ్లూరి శ్రీకాంత్‌, సత్యనారాయణ, వైరా పీహెచ్‌సీ సీఈవోలు ధనలక్ష్మి, వెంకటనారాయణ, ఏఎన్‌ఎంలు నాగమణి,  సర్పంచ్‌ తుమ్మల జాన్‌పాపయ్య,  కార్యదర్శి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 


logo
>>>>>>