బుధవారం 08 ఏప్రిల్ 2020
Khammam - Mar 05, 2020 , 23:58:33

కరోనా అలర్ట్

కరోనా అలర్ట్

(ఖమ్మం ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ)ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో, నగరంలోని మమత వైద్యశాలలో కరోనా అనుమానితులకు ప్రత్యేక గదులను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ఖమ్మం జిల్లాలో కరోనా ఛాయలు లేవు. అయినప్పటికీ అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారు. ఏర్పాట్లు కూడా చేశారు. ముఖ్యంగా కరోనాపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించే దిశగా అడుగులు వేస్తున్నారు. విద్యార్థులకు అవగాహన కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఇప్పటికే జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులతో చర్చించి తగు ఆదేశాలు జారీ చేశారు. 


అప్రమత్తంగా ఉంటే దరిచేరదు..

కరోనా వైరస్‌ వ్యాప్తి నిర్మూలన కోసం కేంద్ర వైద్యారోగ్యశాఖ మూడు నెలలుగా అనేక చర్యలు చేపట్టింది. హైదరాబాద్‌లో ఒక కేసు నమోదు కావడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా వ్యాప్తి నిర్మూలనకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే ఖమ్మం జిల్లాలో వైద్యారోగ్యశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. అయితే సత్తుపల్లిలో కరోనా వైరస్‌ కేసు నమోదైందంటూ వార్తలు రావడంతో ప్రజలు ఆందోళన చెందారు. వైద్యారోగ్యశాఖ అప్రమత్తమై రోగిని పరీక్షించగా అలాంటి లక్షణాలు ఎక్కడా కనిపించలేదు. ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. 


8 పడకలతో ప్రత్యేక ఐసోలేషన్‌ వార్డు

కరోనా అనుమానాలున్నా ఎదుర్కోవడానికి మంత్రి పువ్వాడ ఆదేశాలతో జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో 8 పడకలతో ప్రత్యేక ఐసోలేషన్‌ వార్డును వైద్యాధికారులు ఏర్పాటుచేశారు. అనుమానిత కేసులు ఏమైనా వచ్చినా పరిశీలించేందుకు ముందస్తుగా ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌ను కూడా ఏర్పాటుచేశారు. ఈ ఐసోలేషన్‌ వార్డు వద్ద 24 గంటల పాటు 108 వాహనాన్ని కూడా అందుబాటులో ఉంచారు. అయితే కరోనా, స్వైన్‌ప్లూ, ఇతర ప్రాణాంతక వైరస్‌లు ప్రబలుతున్న ఈ సమయంలో ప్రజలు సమాచార మాధ్యమాల ద్వారా అప్రమత్తమై ముందస్తుగానే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. 


కరోనా వైరస్‌ లక్షణాలు..

గాలి ద్వారా ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాపించే కరోనా వైరస్‌ శ్వాసవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. చాలా రకాలున్నా కేవలం ఆరు వైరస్‌లు మాత్రమే ఇప్పటి వరకు మనుషులపై ప్రభావం చూపించాయి. అవి హ్యూమన్‌ కరోనావైరస్‌ 229 ఈ, హ్యూమన్‌ కరోనావైరస్‌ ఓసీ 43, సివియర్‌ అక్యూట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌ (సార్స్‌-సీవోవీ), హ్యూమన్‌ కరోనావైరస్‌ ఎన్‌ఎల్‌ 63, హ్యూమన్‌ కరోనావైరస్‌ హెచ్‌కేయూ 1, మిడిల్‌ఈస్ట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌ కరోనావైరస్‌ (మెర్స్‌-సీఓవీ). తాజాగా పుట్టుకొచ్చిన నావెల్‌ కరోనా వైరస్‌తో వీటి సంఖ్య ఏడుకు పెరిగినట్లయింది. గతంలో సార్స్‌, మెర్స్‌ వైరస్‌లు చైనా, తైవాన్‌లో విజృంభించడంతో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వైరస్‌ సోకిన వారికి ఫ్లూ తరహా లక్షణాలే కనిపిస్తాయి. తొలుత జలుబు, ఆ తరువాత జ్వరం, దగ్గు, ఛాతీలో నొప్పి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు వంటి సమస్యలు ఎదురవుతాయి. తరువాత తీవ్రమైన నిమోనియాకు దారితీసి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది. 


ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..

తుమ్ములు, గాలి ద్వారా వైరస్‌ వ్యాపించే ప్రమాదం ఉన్నందున మంచి క్యాలిటీ మాస్క్‌లు వాడాలి. చేతులు శుభ్రంగా కడుక్కోకుండా ముక్కు, నోరు దగ్గర తాకొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. ముఖ్యంగా ప్రజలు తరుచూ చేతులను సబ్బుతో కడుక్కోవడం మేలు. కరోనా వైరస్‌ జంతువుల నుంచే మనుషులకు వ్యాప్తి చెందినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 


రైలులో ప్రయాణికులకు అవగాహన 

మధిర, నమస్తే తెలంగాణ: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ తరఫున హెల్త్‌ సూపర్‌వైజర్‌ లంకా కొండయ్య ఆధ్వర్యంలో గురువారం మధిర రైల్వేస్టేషన్‌లో, రైలులో ప్రయాణికులకు టీబీ, కరోనా వ్యాధులపై అవగాహన కల్పించారు. ప్రయాణికులకు కరపత్రాలు, చిత్రపటాలు చూపుతూ టీబీ వ్యాధి, కరోనా వైరస్‌ వ్యాధి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నివారణ మార్గాలను వివరించారు. హెచ్‌ఏ ఎస్‌.నాగేశ్వరరావు, హెచ్‌ఎస్‌ మందా దానయ్య తదితరులు పాల్గొన్నారు.


తరగతి గదుల్లో పోస్టర్లు అతికించాలి

ఖమ్మం ఎడ్యుకేషన్‌: కరోనా వైరస్‌ను అవగాహన పొందేందుకు పాఠశాలల్లోని అన్ని తరగతి గదుల్లోనూ పోస్టరుల అతికించాలని విద్యాశాఖ గురువారం ఆదేశించింది. నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, వైద్య ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వ శాఖ జారీ చేసిన పోస్టర్లను ప్రదర్శించి విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించింది. పాఠశాల ప్రార్థనా సమయంలో కరోనా వైరస్‌ గురించి విద్యార్థులకు రెండు నిమిషాలు వివరించాలని సూచించింది. సైన్స్‌ ఉపాధ్యాయులు ఈ బాధ్యతను తీసుకోవాలని స్పష్టం చేసింది. తల్లిదండ్రులకు, ఎస్‌ఎంసీ సభ్యులకు మీటింగ్‌లు నిర్వహించి ఈ వైరస్‌ గురించి వివరించాలని సూచించింది. logo