శనివారం 04 ఏప్రిల్ 2020
Khammam - Mar 04, 2020 , 23:53:46

పల్లెల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

 పల్లెల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

వైరా, నమస్తే తెలంగాణ: తెలంగాణ ప్రభుత్వం పల్లెలను అన్నిరంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తుందని పల్లె ప్రగతి ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ ప్రత్యేక అధికారి, పోలీస్‌శాఖ ఐజీ నాగిరెడ్డి అన్నారు. వైరా మండలంలోని తాటిపూడి, రెబ్బవరం గ్రామాల్లో బుధవారం ఆయన పర్యటించి పల్లె ప్రగతి పనులను పరిశీలించారు. వన నర్సరీలు, శ్మశాన వాటిక నిర్మాణ పనులు, డంపింగ్‌యార్డ్‌లను ఆయన సందర్శించారు. తాటిపూడిలో పలు వీధుల్లో పర్యటించి అస్తవ్యస్తంగా ఉన్న డ్రైన్‌లపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించి పాఠశాల ఆవరణంలో పలురకాల చెత్త కుప్పలు ఉండటంతో హెచ్‌ఎం పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. విద్యార్థులకు చదువుతో పాటు పరిశుభ్రతపై అవగాహన కల్పించి పాటించే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. అనంతరం తాటిపూడిలో ఏర్పాటు చేసిన గ్రామసభలో ఆయన మాట్లాడారు. ఆరు నెలల కింద గ్రామంలో అభివృద్ధి ఏ విధంగా ఉంది? ప్రస్తుతం ఏ విధంగా ఉంది? అని ప్రశ్నించారు. ఇంకుడు గుంతలు ఎన్ని మంజూరయ్యాయని, ఎన్ని నిర్మాణ దశలో ఉన్నాయని స్థానిక సర్పంచ్‌ బట్టా పెద్ద భద్రయ్యను అడిగారు. హరతహారం మొక్కలు ఎన్ని నాటారు? వాటిలో ఎన్ని బతికాయి అని కార్యదర్శి సతీష్‌ను ప్రశ్నించారు. 


వన నర్సరీలకు పెద్ద పీట వేయడంతో పాటు హరితహారంలో భాగంగా నాటిన మొక్కలపై ఎప్పటికప్పుడు సర్వే నిర్వహించి వాటి సంరక్షణకు నిత్యం కృషి చేయాలని ఆదేశించారు. ఖాళీ ప్రదేశాలు, రహదారుల వెంబడి చెత్తను వేయకుండా డంపింగ్‌యార్డ్‌ను మాత్రమే వినియోగించి పల్లె అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. విద్యుత్‌ స్తం భాల కొరత ఏమైనా ఉంటే లిఖితపూర్వకంగా రాసి సం బంధిత అధికారులకు ఇవ్వాలని సూచించారు. పంచాయతీల నుంచి ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి గండికొట్టకుండా ఎప్పటికప్పుడు ఇంటి పన్నులు వసూలు చేయడంతో పాటుగా పలురకాల బకాయిలు చెల్లించాలన్నారు. ప్రతి నెల పంచాయతీకి ఎన్ని నిధులు వస్తున్నాయని ప్రశ్నించారు. 14వ ఆర్థిక సంవత్సరం నుంచి రూ.2.60లక్షలు, స్టేట్‌ గవర్నమెంట్‌ నుంచి రూ.1.40లక్షలు వస్తున్నాయని తెలపడంతో హర్షం వ్యక్తం చేసి గ్రామాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు నెలకు రూ.4లక్షలు ఖర్చు పెట్టే అవకాశం ఉందని, గామస్తులు ప్రతిఒక్కరు గుర్తుపెట్టుకోవాలన్నారు. ఎమ్మెల్యే, ఎంపీల నుంచి మంజూరయ్యే నిధుల ద్వారా పల్లెలను అభివృద్ధి చేసి రానున్న రోజుల్లో గ్రామ రూపురేఖలు మార్చాలన్నారు. పరిశుభ్రత, పచ్చదనం బాధ్యతను ప్రతిఒక్కరు బాధ్యతగా తీసుకొని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలన్నారు. పల్లె ప్రగతితోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైరా ఏసీపీ కె.సత్యనారాయణ, సీఐ జట్టి వసంతకుమార్‌, కొణిజర్ల ఎస్సై మొగిలి, వైరా ఎంపీడీవో రామ్మోహన్‌, ఈజీఎస్‌ ఏపీవో అనురాధ, ఈసీ క్రిష్ణ, సర్పంచ్‌లు బట్టా పెద్ద భద్రయ్య, సాదం రామారావు తదితరులు పాల్గొన్నారు. 


logo