బుధవారం 08 ఏప్రిల్ 2020
Khammam - Mar 04, 2020 , 01:43:17

పట్టణ ప్రగతి నిరంతరం కొనసాగాలి..

పట్టణ ప్రగతి నిరంతరం కొనసాగాలి..
  • పట్టణాల అభివృద్ధికే సీఎం కేసీఆర్‌ ప్రగతికి శ్రీకారం..
  • వైరా మున్సిపాలిటీని సుందరంగా తీర్చిదిద్దాలి
  • పారిశుధ్యం నిర్వహణకు 20ఆటోలు కొనుగోలు చేయాలి
  • పట్టణ వాసులకు 18వేల చెత్త బుట్టలు పంపిణీ చేయాలి
  • మున్సిపాలిటీల అభివృద్ధికి నెలకు రూ.60లక్షల కేటాయింపు
  • మే చివరికల్లా రూ.20కోట్ల పనులు పూర్తిచేయాలి
  • అభివృద్ధిలో వైరాను నెంబర్‌వన్‌ స్థానంలో నిలపాలి
  • రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌

మున్సిపాలిటీలను సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన పట్టణ ప్రగతిని నిరంతరం కొనసాగించాలి, పనుల్లో ప్రతిఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. మంగళవారం పట్టణ ప్రగతిలో భాగంగా వైరా మున్సిపాలిటీలో పనులను ఆయన పరిశీలించి అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచనలు చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడారు.. పట్టణ వాసులు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అపరిశుభ్రత వల్లే ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని అన్నారు.. మున్సిపాలిటీ సిబ్బంది ప్రతిరోజూ చెత్త సేకరించాలన్నారు.. పట్టణానికి వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజల అవసరాల నిమిత్తం మరుగుదొడ్లు నిర్మించాలని పేర్కొన్నారు. రిజర్వాయర్‌ను మినీ ట్యాంక్‌బండ్‌గా తీర్చిదిద్దుతామని చెప్పారు. అభివృద్ధి పనులకు రూ.20కోట్ల నిధులు మంజూరు చేశానని, ఇప్పటి వరకూ ఆ పనులు ప్రారంభించకపోవడం బాధాకరమని, ఆ కాంట్రాక్టర్‌కు నోటీసులు ఇవ్వాలని కమిషనర్‌ను ఆదేశించారు. పట్టణ అభివృద్ధికి పన్నులు వసూళ్లు చేయాలని చైర్మన్‌, కమిషనర్‌ను ఆదేశించారు. ఎటువంటి సమస్యలు ఉన్నా ఎమ్మెల్యే రాములునాయక్‌ దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలన్నారు.. 

- వైరా, నమస్తే తెలంగాణ


వైరా, నమస్తే తెలంగాణ : రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పట్ణణ ప్రగతి కార్యక్రమాన్ని ఉద్యమంలా నిరంతరం చేపట్టాలని రాష్ట్ర రవాణా శాఖామంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. వైరా మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణంలో మంగళవారం పట్టణ ప్రగతిపై నిర్వహించిన ప్రత్యేక సమావేశానికి మంత్రి అజయ్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా పట్టణ ప్రగతి పనితీరు గురించి కౌన్సిలర్లు, వార్డు కమిటీ సభ్యులు, మున్సిపాలిటీ కమిషనర్‌తో మంత్రి అజయ్‌కుమార్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ చైర్మన్‌ సూతకాని జైపాల్‌ అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి పువ్వాడ ప్రసంగించారు. పారిశుధ్య పనులను నిరంతరం నిర్వహించి అపరిశుభ్రమైన వాతావరణాన్ని పరిశుభ్రం చేయాలని సూచించారు. ప్రతిరోజు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో చెత్త సేకరించి డంపింగ్‌యార్డ్‌కు తరలించాలన్నారు. ఈ కార్యక్రమం కోసం 20 వార్డులకు గాను 20 స్వచ్ఛఆటోలను కొనుగోలు చేయాలన్నారు. అలాగే మున్సిపాలిటీలో నివసించే వారికి చెత్త వేసేందుకు 9వేల కుటుంబాలకు గాను 18వేల చెత్త బుట్టలను పంపిణీ చేయాలని కమిషనర్‌ను ఆదేశించారు. పట్టణంలో డంపింగ్‌యార్డ్‌కు స్థలం లేకుంటే పరిసర గ్రామాల్లో అధికారులు ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి  సుమారు 10 ఎకరాలు కేటాయించాలన్నారు. సేకరించిన తడి చెత్తను వర్మీ కంపోస్ట్‌ ఎరువుగా అభివృద్ధి చేసి మొక్కలకు వాడుకోవాలన్నారు. 


పట్టణంలో జూన్‌2వ తేదీలోపు ప్రజల అవసరాల కోసం 10 టాయిలెట్లను నిర్మించి వాటి నిర్వాహణ బాధ్యతలను సులభ్‌ కాంప్లెక్స్‌ వారికి అప్పగించాలన్నారు. వైరా రిజర్వాయర్‌ వద్ద ఉన్న ప్రభుత్వ భూమిలో వైకుంఠధామం నిర్మాణానికి 5 ఎకరాలను కేటాయించాలన్నారు. మున్సిపాలిటీల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి నెల నిధులు కేటాయిస్తున్నాయని చెప్పారు. వైరాకు నెలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.30లక్షలు, కేంద్ర ప్రభుత్వం రూ.30లక్షల నిధులను కేటాయిస్తున్నాయని వివరించారు. మున్సిపాలిటీలో సిబ్బంది జీతాలు, విద్యుత్‌ బిల్లులకు నిధులు వినియోగించిన తర్వాత మిగిలిన నిధులను అభివృద్ధికి వాడుకోవాలన్నారు. వైరా మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.20కోట్ల నిధులు మంజూరు చేసి ఆ పనులకు తానే స్వయంగా శంకుస్థాపన చేశానన్నారు. అయితే నేటి వరకు అభివృద్ధి పనులను ప్రారంభించకపోవడం బాధాకరమన్నారు. ఈ పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్‌ నిద్రపోతున్నాడా అంటూ మంత్రి పువ్వాడ కమిషనర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్‌ పనులు ప్రారంభించకుంటే టెండర్‌ రద్దు చేసి రీటెండర్‌ పెట్టించాలని కమిషనర్‌కు సూచించారు. వెంటనే కాంట్రాక్టర్‌కు నోటీసులు ఇవ్వాలని మంత్రి కమిషనర్‌ను ఆదేశించారు. మే నెల చివరికల్లా పనులను పూర్తి చేయాలన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.


విద్యుత్‌ సమస్యలను విద్యుత్‌ అధికారులు వెంటనే పరిష్కరించాలన్నారు. ఖాళీ స్థలాలు ఉన్న యజమానులకు నోటీసులు వెంటనే జారీ చేయాలని మంత్రి చెప్పారు. యజమానులు ఖాళీ స్థలాలను శుభ్రపరచకుంటే మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఆ స్థలాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించి అయిన ఖర్చు బిల్లును ఆ స్థల యజమానులకు పంపాలన్నారు. ఆ బిల్లును యజమాని కట్టకుంటే ఆ స్థలం వైరా మున్సిపాలిటీ స్థలంగా బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. ఈ నెల చివరికల్లా మున్సిపాలిటీ బడ్జెట్‌ సమావేశాన్ని నిర్వహించాలని ఎమ్మెల్యే రాములునాయక్‌కు సూచించారు. ఆ సమావేశానికి తాను కూడా హాజరవుతానని స్పష్టం చేశారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో జిల్లాలోనే వైరాను నెంబర్‌వన్‌ స్థానంలో నిలపాలన్నారు. కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్‌, అదనపు కలెక్టర్‌ స్నేహలత మొగిలి, వైరా మున్సిపాలిటీ చైర్మన్‌ సూతకాని జైపాల్‌, వైరా సొసైటీ చైర్మన్‌ బొర్రా రాజశేఖర్‌, మున్సిపాలిటీ వైస్‌ చైర్మన్‌ ముళ్లపాటి సీతారాములు, వైరా ఎంపీపీ వేల్పుల పావని, వైరా జెడ్పీటీసీ నంబూరి కనకదుర్గ, జిల్లా ఉద్యానవనశాఖ అధికారి అనసూర్య, డీఆర్‌వో శిరీష, వైరా తహసీల్దార్‌ హలావత్‌ రంగా, వైరా మున్సిపాలిటీ కమిషనర్‌ విజయానంద్‌ తదతరులు పాల్గొన్నారు.  


logo