గురువారం 02 ఏప్రిల్ 2020
Khammam - Mar 04, 2020 , 01:40:40

అక్షరాస్యత దిశగా ప్రభుత్వం అడుగులు..

అక్షరాస్యత దిశగా ప్రభుత్వం అడుగులు..
  • పట్టణాల్లో నిరక్షరాస్యుల సర్వే
  • పట్టణ ప్రణాళికలో భాగంగా కొనసాగుతున్న కార్యక్రమం
  • త్వరలో పల్లెల్లోనూ అమలు
  • ఇంటింటి సర్వేలో మెప్మా సిబ్బంది
  • ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 323మంది ఆర్పీలు..

(ఖమ్మం, నమస్తే తెలంగాణ)  పూర్తి అక్షరాస్యత సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. ఇందుకోసం మొదట పట్టణాల్లో నిరక్ష్యరాస్యులను గుర్తిసున్నది. మెప్మా రిసోర్స్‌ పర్సన్ల (ఆర్‌పీ) ద్వారా ఇంటింటి సర్వే చేయిస్తున్నది. పట్టణ ప్రగతిలో భాగంగా గత నెల 24న ఈ సర్వేను ప్రారంభించి కొనసాగిస్తున్నది. ఖమ్మం కార్పొరేషన్‌లోని 50 డివిజన్లలోని 187 మంది ఆర్పీలు సర్వేలో నిమగ్నమయ్యారు. ఇల్లెందు మున్సిపాలిటీలోని 24 వార్డుల్లో 27 మంది ఆర్పీలు, కొత్తగూడెంలోని 36 వార్డుల్లో 41 మంది ఆర్పీలు, వైరాలోని 20 వార్డుల్లో 22 మంది ఆర్పీలు, మధిరలోని 22 వార్డుల్లో 24 మంది ఆర్పీలు, సత్తుపల్లిలోని 23 వార్డుల్లో 24 మంది ఆర్పీలు ఈ సర్వే నిర్వహిస్తున్నారు. 


నేటితో సర్వే పూర్తి..

దేశంలో అక్షరాస్యులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం కేరళ. అక్షరాస్యత శాతం అధికంగా ఉంటే అభివృద్ధి అత్యంత వేగంగా జరిగే అవకాశం ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 20 ఏళ్ల క్రితం అక్షరాస్యత ఉద్యమం పెద్ద ఎత్తున జరిగింది. అప్పట్లో నిరక్షరాస్యత నిర్మూలన కార్యక్రమం యుద్ధ ప్రతిపాదికన చేపట్టారు. చాలా ఏళ్ల తర్వాత తెలంగాణ ప్రభుత్వం మరోమారు నిరక్షరాస్యత సర్వేను పట్టణాల్లో ప్రారంభించింది. ఇది కూడా పట్టణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగానే నిర్వహిస్తున్నది. ప్రతి నిరక్షరాస్యుడినీ అక్షరాస్యుడిగా తయారుచేసేందుకు ప్రభుత్వం ముందుకెళ్తున్నది. ఉమ్మడి జిల్లాలో ఖమ్మం నగరపాలక సంస్థతోపాటు సత్తుపల్లి, వైరా, మధిర, ఇల్లెందు, కొత్తగూడెం పురపాలక సంస్థలున్నాయి. వీటిలో నిరక్షరాస్యులను లెక్కించేందుకు 323 మంది ఆర్‌పీలను ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. ఈ సర్వే బుధవారంతో ముగియనుంది. అయితే కొన్ని చోట్ల సర్వే నిర్వహించడంలో ఆర్పీలు వైఫల్యం చెందుతున్నట్లు తెలుస్తున్నది. 


తేలనున్న లెక్క..

మున్సిపాలిటీల్లో నిరక్షరాస్యులను గుర్తించేందుకు ఆర్పీలు వారికి కేటాయించిన వార్డుల్లో రోజుకూ 50 ఇండ్లకు వెళ్లి వివరాలను సేకరిస్తున్నారు. 18 ఏళ్లు పైబడిన వారిలో ఎంతమంది నిరక్షరాస్యులున్నారో అనే లెక్కను తేల్చనున్నారు. సేకరించిన వివరాలను ఏరోజుకారోజు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తూ ప్రభుత్వానికి నివేదిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 323 మంది ఆర్పీలు సర్వే ప్రక్రియ నిర్వహిస్తున్నారు. వారికి సహాయకులుగా కొన్ని మున్సిపాలిటీల్లో అంగన్‌వాడీ కార్యకర్తలు, సిబ్బంది వ్యవహరిస్తున్నారు.. 


కొన్ని చోట్ల ఇంటింటికీ వెళ్లని ఆర్పీలు

ఇంటింటికీ వెళ్లి నిరక్షరాస్యులను గుర్తించాల్సిన మెప్మా ఆర్పీలు కొన్ని చోట్ల ఈ సర్వేను మమ అనిపిస్తున్నారు. ఇంటింటికీ  వెళ్లకుండా వారి ఇంటి వద్దే కూర్చొని సర్వే పూర్తి చేస్తున్నారు. ఆయా డివిజన్లు, వార్డుల్లో తమకు తెలిసిన వ్యక్తులకు ఫోన్లు చేసి ‘మీ బజారులో చదువురాని వారి పేర్లు చెప్పండి?’ అంటూ వివరాలు తీసుకొని ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. మరికొన్ని చోట్ల ‘ఇంటింటికీ మేము వెళ్లలేం. మేం వేరే వ్యక్తులను నియమించుకుంటాం. వారికి ఇంటికి రూ.5 చొప్పున ఇప్పించండి.’ అంటూ అడుగుతున్నట్లు కొంతమంది కార్పొరేటర్లు, కౌన్సిలర్లు చెబుతున్నారు. ఇంకొన్ని చోట్ల అంగన్‌వాడీ కార్యకర్తలు గతంలో చేసిన వివిధ సర్వేల రిపోర్టులను తీసుకొని వాటి ఆధారంగా తమ ఇళ్ల వద్దనే కూర్చొని సర్వేను పూర్తిచేస్తున్నట్లు తెలుస్తున్నది. అయితే కార్యాలయాలకు పంపే ఫొటోలు మాత్రం ఇంటి ముందు దిగి వాట్సప్‌లలో అప్‌లోడ్‌ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి కొద్దిమంది ఆర్పీలు మాత్రమే ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహిస్తూ మున్సిపల్‌ కార్యాలయానికి వచ్చి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయిస్తున్నారు. 


మున్సిపాలిటీ వార్డుల ఆర్పీల 

పేరు            సంఖ్య సంఖ్య

ఖమ్మం             50          187

కొత్తగూడెం     36            41

సత్తుపల్లి             23            24

వైరా             20            20

మధిర             22            24

ఇల్లెందు             24            27

మొత్తం             175            323


logo