బుధవారం 01 ఏప్రిల్ 2020
Khammam - Mar 03, 2020 , 23:59:38

రైతు బీమాతో ధీమా..

రైతు బీమాతో ధీమా..
  • అన్నదాత కుటుంబాలకు ఆపద్బంధువు సీఎం కేసీఆర్‌
  • నేటి వరకు 1,146 కుటుంబాలకు అందిన పరిహారం
  • పైసా ఖర్చులేకుండా నేరుగా ఖాతాల్లోకి..

దురదృష్టవశాత్తు ఏదైనా ప్రమాదం సంభవించి లేదా సాధారణ మరణం పొంది ఒక రైతు మృతిచెందితే అతనిపై ఆధారపడ్డ కుటుంబం రోడ్డున పడుతుంది. అతని పిల్లల భవిష్యత్తు ఆగమావుతుంది. అతను చేసే వ్యవసాయం కుంటుపడుతుంది.. ఇలాంటి పరిస్థితిని గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నదాతల కుటుంబాల్లో వెలుగునింపుతున్నారు. చనిపోయిన రైతును తిరిగి తేలేకపోవచ్చు కానీ.. కుటుంబ పెద్ద చనిపోయి నిస్సాహాయ స్థితిలో ఉన్న  కుటుంబంలో మాత్రం తిరిగి నవ్వులు తేవచ్చని భావించిన  సీఎం కేసీఆర్‌ రైతుబీమా పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం ద్వారా రూ.5లక్షలు నేరుగా బాధిత రైతు కుటుంబంలోని నామినీ ఖాతాలోనే జమ చేస్తున్నారు. 2018 ఆగస్టు 14 నుంచి అమల్లోకి వచ్చిన  ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 1,148 మంది రైతుల కుటుంబాలకు రూ.57.40 కోట్ల బీమా పరిహారం అందింది. పట్టాదారు పాసుపుస్తకం పొంది 59 ఏళ్ల లోపు ఉన్న ప్రతీ రైతు ఈ పథకానికి అర్హుడే. బీమా ప్రీమీయాన్ని కూడా ప్రభుత్వమే భరిస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా జిల్లాలోని ఎన్నో కుటుంబాలు ఆదుకోబడుతున్నాయి. తిరిగి ఆ కుటుంబం వ్యవసాయం చేసేలా  ప్రోత్సాహం లభిస్తున్నది. - ఖమ్మం వ్యవసాయం, విలేకరి


తక్కువలో తక్కువ గుంట భూమి కలిగిన రైతునుంచి మొదలుకొని అధిక మొత్తంలో భూమి ఉన్న రైతుల వరకు ఈ రైతుబీమా పథకాన్ని వర్తింపజేయడం అన్ని వర్గాల ప్రజల్లో సంతోషాన్ని నింపింది. నేటి వరకు జిల్లా వ్యాప్తంగా  1,238 మంది రైతులు వివిధ కారణలతో మరణించారు. వీరిలో ఇప్పటికే  1,148 మంది రైతు కుటుంబాలకు రూ 57.40 కోట్ల బీమా పరిహారం అందింది. మిగిలిన రైతు కటుంబాలకు మరికొద్ది రోజుల్లోనే పరిహారం సదరు నామినీల అకౌంట్లలో జమ కానుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబీమా పథకం అమలులో  ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం పటిష్ట ప్రణాళిక తయారు చేసింది. రైతు చనిపోయిన పది రోజుల్లోపు సదరు రైతు కుటుంబంలోని నామినీ అకౌంట్లో పరిహారం అందే విధంగా రూపకల్పన చేశారు. మధ్య దళారులు, ఇతర మూడవ వ్యక్తి ప్రమేయం లేకుండా నయాపైసా ఖర్చు లేకుండా నేరుగా రూ.5లక్షల పరిహారం అదే విధంగా చర్యలు తీసుకుంది. దేశంలోనే అత్యంత నమ్మకమైన జీవిత బీమా సంస్థతో ఒప్పందం చేసుకుంది. ప్రతీ ఏటా 1,65 628 మంది రైతులకు బీమా ప్రీమియాన్ని ఈ సంస్థకు ప్రభ్వుత్వం చెల్లిస్తుంది.  ప్రమాదవశాత్తుతో పాటు సాధారణ మరణం పొందిన రైతు కుటుంబాలకు సైతం బీమా పరిహారం అందిస్తున్నది. 


 మృతిచెందిన 10 రోజుల్లోపే పరిహారం జమ..

 రైతు మరణించిన వెంటనే  సంబంధిత ఏఈఓ రైతు ఇంటిని సందర్శించి పూర్తి వివరాలతో పాటు మరణ ధ్రువీకరణ పత్రాన్ని ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నారు. ఈ వ్యవహారాలను పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేసేందుకు ఖమ్మం జిల్లా  వ్యవసాయశాఖ కార్యాలయంలో నోడల్‌ అధికారిని  నియమించారు. దీంతో రైతు మరణించిన పది రోజుల లోపే సంబంధిత నామినీ అకౌంట్‌లోని రూ.5 లక్షల పరిహారం అందుతుంది. మధ్యదళారులు, పైరవీలకు తావులేకుండా చేయడంతో లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేవు. 2018-19లో 821 మంది రైతులు మృతిచెందగా 807 మంది రైతు కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున రూ.40.35 కోట్ల పరిహారాన్ని అందించారు. అదే విధంగా 2019 నుంచి నేటి వరకు 417 మంది రైతులు వివిధ కారణాలతో చనిపోగా నేటి వరకు 341 కుటుంబాలకు రూ 17.05 కోట్ల బీమా పరిహారం అందింది. 


హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు..

గత పాలకుల తీరుకు భిన్నంగా సీఎం కేసీఆర్‌ చేస్తున్న రైతు సంక్షేమ పథకాల పట్ల సమాజంలో సబ్బండ వర్గాల నుంచి  హర్షం వ్యక్తమవుతున్నది. సాగుకు సంపూర్ణ సహకారం అందించడమే కాకుండా రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్న తీరు పట్ల అన్నదాతల కుటుంబాలు సీఎం కేసీఆర్‌ను ఆరాధ్య దైవంగా భావిస్తున్నారు. గుంట భూమి కలిగిన రైతుకు సైతం బీమా సౌకర్యం కల్పించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బాధిత కుటంబానికి ఏమాత్రం భారం పడకుండా పరిహారం అందుతుండడంతో రైతు సంఘాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.  గతంలో అరకొర సదుపాయాలు ఉండడంతో సాగు చేసేందుకు రైతులు ఏమాత్రం ఆసక్తి చూపని పరిస్థితి. దీంతో వ్యవసాయంలో నష్టాలు రావడంతో రైతులు నగరాలకు, పట్టణాలకు వలసబాట పట్టారు. 


తెలంగాణ ఏర్పడి కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యాక వ్యవసాయానికి పూర్వ వైభవం తీసుకొచ్చారు. అన్నదాతల కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తుండడం, రైతులకు ప్రోత్సాహకాలు అందుతుండడంతో వలసబాట పట్టిన రైతు కుటుంబాలు తిరిగి పట్టణాల నుంచి గ్రామాలకు చేరుకున్నాయి. రైతును రాజు చేయాలనే ఏకైక లక్ష్యంతో పని చేస్తున్న సీఎం కేసీఆర్‌ ఆశయానికి అనుగుణంగా అన్నదాతలు నేడు ఎవుసం పట్ల ఆసక్తి  కనబరుస్తున్నారు. ఉమ్మడి పాలనలో చిన్నాభిన్నమైన వ్యవసాయ రంగం నేడు విత్తనోత్పత్తి, వివిధ రకాల పంటల సాగులో దేశంలోనే నూతన ఒరవడి సృష్టిస్తున్నది. 
logo
>>>>>>