సోమవారం 30 మార్చి 2020
Khammam - Mar 03, 2020 , 00:33:55

గులాబీ శ్రేణుల్లో జోష్‌..

గులాబీ శ్రేణుల్లో జోష్‌..

ఖమ్మం, నమస్తే తెలంగాణ : తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటన ఆ పార్టీ శ్రేణుల్లో జోష్‌ను నింపింది. గతానికంటే భిన్నంగా యువనేత తనదైన శైలీలో ప్రజలను ఆకట్టుకుంటూ తన పర్యటన ఆద్యాంతం ముందుకు సాగారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పట్టణ ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయ వంతం చేసే దిశగా ఆయన పర్యటన కొనసాగింది. ఆదివారం ఖమ్మంలో నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు నగర,జిల్లా ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా అన్ని పట్టణాలు, నగరాలలో పట్టణ ప్రగతి ప్రణాళిక పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గత నెల 24వ తేదీన ప్రారంభమైన పట్టణ ప్రగతి ఈ నెల 4వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ పనుల్లో భాగంగా మున్సిపల్‌ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ ఇప్పటికే తెలంగాణలోని అనేక జిల్లాలలోని పట్టణాలను చుట్టివస్తున్నారు. ఆ క్రమంలోనే ఆదివారం ఖమ్మం రావడం జరిగింది. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ నేతృత్వం లో ఖమ్మం నగరంలో పలు అభివృద్ధి పనులను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఆయనతో పాటు రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి కూడా హాజరయ్యారు. నగరంలో చేపట్టిన పనుల్లో భాగంగా పెవిలియన్‌ గ్రౌండ్‌లో నిర్మించిన బాస్కెట్‌బాల్‌ ఇండోర్‌స్టేడియం క్రీడలకు సంబంధించి కనుక ఆ శాఖ మంత్రిని వెంటబెట్టుకుని కేటీఆర్‌ రావడం జరిగింది. నగర సమీపంలోని వైఎస్సార్‌ నగర్‌, రఘునాథపాలెంలో నిర్మించిన 300ల డబుల్‌బెడ్‌రూమ్‌ ఇండ్లను నిర్మాణం చేపట్టింది రోడ్లు, భవనాల శాఖ కనుక ఆ శాఖ మంత్రిని వెంటపెట్టుకుని రావడం జరిగింది. నలుగురు మంత్రులు నగరంలో ఉండి అనేక అభివృద్ధి పనులను ప్రారంభించడం పట్ల నగర ప్రజలు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

మాట తప్పని..మడమ తిప్పని నేత కేటీఆర్‌

రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు తగ్గ తనయుడు కేటీఆర్‌ అని జిల్లా ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇచ్చిన మాట తప్పని నేతగా కేటీఆర్‌ కీర్తిప్రతిష్టలు సంపాదించారు. తెలంగాణ వ్యాప్తంగా జరిగిన శాసనసభ, పార్లమెంట్‌ ఎన్నికల ప్రచార సందర్భంలో యువనేత కేటీఆర్‌ ఖమ్మం నగర పర్యటనకు రావడం జరిగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మంలో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా గోళ్ళపాడు చానల్‌ బాధితులకు ఇండ్లు కట్టించి ఇస్తామని హామీని చ్చారు. దీంతో పాటు గాంధీచౌక్‌ కూడలిని అద్భుతంగా తీర్చిదిద్దుతామన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం గాంధీచౌక్‌కూడలిని అత్యంత అద్భుతంగా తయారు చేశారు. దాదాపు రూ.60 లక్షలతో గాంధీచౌక్‌ సెంటర్‌లో జాతిపిత మహాత్మగాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠించి దాని చుట్టూ ఫౌంటేన్‌ ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నికల సందర్భాలలో హామీలివ్వడం, అధికారానికి వచ్చాక మాట తప్పిన నేతలను ఇంత వరకు చూసిన ప్రజలు మాట తప్పని మడ తిప్పని కేటీఆర్‌ను చూసి ప్రజలు ఆనందంతో పాటు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేటీఆర్‌ లాంటి నాయకులు ఉంటే దేశం ఎప్పుడో బాగుపడేదని పలువురు ప్రజలు చర్చిస్తున్నారు. అదే విధంగా గోళ్లపాడు మురికి కాలువపై కొన్ని సంవత్సరాలుగా ఎంతోమంది పేదలు గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారు. సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌ల పర్యటనల సందర్భంలో గోళ్లపాడు చానల్‌ బాధితులందరికీ డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు నిర్మించి ఇస్తామని గతంలో హామినిచ్చారు. దాని ప్రకారం ఖమ్మం నగరంలోని 240 మంది నిరుపేదలకు రూ. 134 కోట్ల వ్యయంతో వైఎస్సార్‌నగర్‌లో మహానగరాలకు దీటుగా డబుల్‌బెడ్‌రూమ్‌ ఇండ్లను నిర్మించడం జరిగింది. దీనిని ఆదివారం గృహప్రదేశాలు చేసి పేద ప్రజల కోరికను తీర్చినవారయ్యారు. అంతేకాకుండా శాంతినగర్‌ జూనియర్‌ కళాశాలలో అధునాతన కళాశాల భవనాన్ని నిర్మించి తాను చదువుకున్న  కళాశాల రుణాన్ని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ తీర్చుకున్నారు. 

వెజ్‌ అండ్‌ నాన్‌వెజ్‌ మార్కెట్‌తో నూతన ఒరవడి.. 

ప్రస్తుతం ఖమ్మం నగరంలో సుమారు 3 లక్షల జనాభా ఉంది. అయితే నగర వాసులకు అనుగుణంగా రైతుబజార్లు, ఇతర మార్కెట్‌లు లేకపోవడంతో కొంత అసౌకర్యం కలుగుతుంది. నిబంధనలకు అనుగుణంగా ఉన్న మార్కెట్‌లలో సౌక ర్యాలు లేకపోవడంతో రైతులు, వినియోగదారులు స్వల్ప ఇబ్బందులకు లోన వుతున్నారు. ప్రస్తుతం ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ పరిధిలో హోల్‌సెల్‌, రిటైల్‌ కూరగాయల మార్కెట్‌ అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు మూడు టౌన్‌ల పరిధిలో మరో మూడు రైతుబజార్‌లు ఉన్నాయి. అయితే ఆధునిక పద్ధతిలో నిర్మించిన రైతు బజార్‌లు, కూరగాయాల మార్కెట్‌ల సౌకర్యం అందుబాటులో లేదు. ఆదివారం మంత్రి కేటీఆర్‌ ఆధునిక హంగులు, పరిశుభ్రమైన ఏసీ వెజ్‌ అండ్‌నాన్‌వెజ్‌ మార్కెట్‌ను ప్రారంభించడంతో వినియోగదారులకు నాణ్యమైన కూరగాయాలతో పాటు మాంసం, చేపలు అందుబాటులోకి రానున్నాయి. అదేవి ధంగా పలువురు వీధి వ్యాపారులకు సైతం జీవనోపాధి కలిగినైట్లెంది. గజ్వేల్‌, సిద్దిపేట తరహాలో ఏర్పాటు చేసిన ఈ మార్కెట్‌ ప్రారంభోత్సవం పట్ల నగర వాసుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. రానున్న రోజుల్లో కార్పొరేట్‌ మార్కెట్‌కు అందుబాటులో రావడంతో సబ్బండ వర్గాలకు ప్రయోజనం చేకూరి నైట్లెంది. ఇప్పటి వరకు ఖమ్మం పట్టణంలో వెజ్‌, నాన్‌వెజ్‌ ప్రియులు తమకిష్టమైన వాటిని కొనుగోలు చేయాలంటే వేర్వేరు ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఇక నుంచి కూరగాయల నుంచి మాంసం వరకు ప్రతిదీ ఒకేచోట లభించే విధంగా సమీకృత మార్కెట్‌ను ఏర్పాటు చేయడం పట్ల నగర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

సత్తాచాటిన మంత్రి అజయ్‌.. 

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కారుగుర్తుపై గెలిచిన ఏకైక శాసనసభ్యుడు. సీఎం కేసీఆర్‌ యువనేత కేటీఆర్‌లతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా పువ్వాడకు అమాత్య పదవి లభించింది. ఈ క్రమంలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు.  తెలంగాణ రాష్ట్రంలో ఏ పట్టణంలో జరగని అభివృద్ధి హైద్రాబాద్‌ తరువాత ఖమ్మంలోనే జరుగుతుందనడంలో అతిశయోక్తిలేదు. తాను మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఖమ్మం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఖమ్మానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు యువనేత కేటీఆర్‌ను తీసుకువచ్చి నగరం మొత్తం చూపించారు. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్‌ ప్రతి ఏడాది నగరానికి రూ. 100 కోట్లు నిధులిస్తానని హామినిచ్చారు. ఇచ్చిన హామీ ప్రకారం మూడెండ్లలో రూ. 300ల కోట్లను ఖమ్మానికి తీసుకొచ్చిన ఘనత పువ్వాడకే దక్కుతుంది. దీంతో ఖమ్మం నగరం స్వరూపాన్నే మార్చి వేశారు. ఈ రోజున లకారం ట్యాంక్‌బండ్‌ మణిహారంగా మారింది. ఖమ్మం నగరంలోకి ప్రవేశించే ప్రతి రోడ్డును నాలుగు రోడ్లలైనుగా విస్తరింప చేసి డ్రైనేజీ, డివైడర్లు, సెంట్రల్‌ లైటింగ్‌ను ఏర్పాటు చేయడంతో నగర వీధులు శోభాయమానంగా వెలుగుతున్నాయి. వీటితో పాటు మరికొద్ది రోజుల్లో నూతన బస్టాండ్‌, ఐటీహబ్‌, మున్సిపల్‌ కార్యాలయం అందుబా టులోకి రానున్నాయి. వీటి నిర్మాణం శరవేగంగా జరుగుతుంది. ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న ధంసలాపురం రైల్వే ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణ శరవేగంగా జరుగుతుంది. ఆర్‌వోవీ నుంచి ముస్తఫానగర్‌ సెంటర్‌ వరకు రోడ్డు విస్తరణ పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. వీటన్నింటి వెనుక మంత్రి అజయ్‌ కృషి, పట్టుదల ఎంతో ఉంది. ఖమ్మం నగరంపై మంత్రి పువ్వాడ తన మార్కును చూపించుకో గలుగుతున్నారు. ఆదివారం జరిగిన మంత్రి కేటీఆర్‌ పర్యటన మొత్తం అజయ్‌ విజయవంతంగా నడిపించగలిగారు. సమయానుకూలంగా ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ముందస్తుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారంగా అభివృద్ధి పనులను ప్రారంభిస్తూ కేటీఆర్‌ విజయవంతంగా ముందుకు సాగేలా మంత్రి అజయ్‌ ఎంతో కృషి చేశారు. ఆయన కృషికి పట్టుదలకు మెచ్చిన యువనేత ట్విట్టర్‌లో మంత్రి పువ్వాడను అభినందించడం గమనార్హం. 


logo