గురువారం 02 ఏప్రిల్ 2020
Khammam - Mar 03, 2020 , 00:19:14

ప్లాస్టిక్‌కు పాతరే..

ప్లాస్టిక్‌కు పాతరే..

(భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ):పట్టణ ప్రగతిలో భాగంగా ప్రజలతో ముఖాముఖి, అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు ఉమ్మడి జిల్లాకు వచ్చిన ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ స్వయంగా ఖమ్మంలో టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ఓ కార్పొరేటర్‌కు, ఇల్లెందు మున్సిపల్‌ చైర్మన్‌కు ప్లాస్టిక్‌ ప్రధానంగా ఉండే ఫ్లెక్సీలను ఏర్పాటు చేసినందుకు రూ.లక్ష చొప్పున జరిమానా విధించారు. ప్లాస్టిక్‌ వాడకంపై తన నిబద్ధతను చాటుకున్నారు. తన రాక సందర్భంగా ఎక్కడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయొద్దని పదేపదే చెబుతున్నా పెడచెవిన పెట్టిన కారణంగా సొంత పార్టీ వారికే జరిమానా విధించి వసూలు బాధ్యతను కలెక్టర్లకు అప్పగించారు. 

వెల్లివిరిసిన చైతన్యం

అయితే పల్లెకు ప్రత్యేక కార్యాచరణ, పట్టణ ప్రగతికి ప్రణాళిక కార్యక్రమాల్లో ప్రజల్లో చైతన్యం వెల్లివిరిసింది. తమ ప్రాంతాలను తామే బాగు చేసుకుందామంటూ ఐక్యంగా ముందుకు కదులుతున్నారు. ప్లాస్టిక్‌ భూతాన్ని తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరూ ముందుకొస్తున్నారు. దీంతో పల్లెల్లో ప్లాస్టిక్‌ వాడకం గణనీయంగా తగ్గింది. శుభకార్యాల్లో ప్లాస్టిక్‌ వాడినా జరిమానాలు విధిస్తూ ప్రభుత్వ అధికారులు ముందుకు సాగుతుండటంతో ప్లాస్టిక్‌ వాడాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. 

సొంత పార్టీ వారికి జరిమానా..

ప్లాస్టిక్‌పై తెలంగాణ ప్రభుత్వం సమరశంఖం పూరించింది. పల్లె ప్రగతి, పట్టణ ప్రణాళికల్లో ప్రధానంగా దృష్టి కేంద్రీకరించి ప్లాస్టిక్‌ వాడకానికి చరమగీతం పాడాలని కలెక్టర్లకు, ఇతర అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ప్లాస్టిక్‌ వస్తువులను అమ్మే వారికి సైతం జరిమానాలు విధిస్తూ కఠినంగా వ్యవహరిస్తున్నది. గతంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా పర్యటనకు వచ్చిన మంల్రు ఎర్రబెల్లి దయాకర్‌రావు, పువ్వాడ అజయ్‌కుమార్‌ ప్లాస్టిక్‌ వాడుతున్న దుకాణదారులకు జరిమానాలు విధించిన విషయం విదితమే. ఇప్పుడు నేరుగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన ప్రజాప్రతినిధులపైనే మంత్రి కేటీఆర్‌ తక్షణ చర్యలకు ఉపక్రమించి సభావేదికపైనే జరిమానా విధించారు. ప్రజాప్రతినిధులైన మీరే ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన ప్రజాప్రతినిధులే ఇలా బాధ్యతారహితంగా వ్యవహరించడం క్షమించరాని నేరమని ఒకింత అసహనం వ్యక్తం చేశారు. 

హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు

ప్లాస్టిక్‌ మహమ్మారిని పారదోలేందుకు పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని రూపొందించిన సీఎం కేసీఆర్‌ అభినందనీయుడని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఆదివారం ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్‌ స్వయంగా అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులకే ప్లాస్టిక్‌ వాడినందుకు జరిమానాలు విధించడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ప్లాస్టిక్‌ వాడకంపై స్వయానా మంత్రి తీవ్రంగా స్పందించడం ప్లాస్టిక్‌ నిషేధానికి ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుందనడానికి నిదర్శనంగా పలువురు మాట్లాడుకుంటున్నారు. 


logo