శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Khammam - Mar 03, 2020 , 00:16:59

అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి

అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి

మామిళ్లగూడెం, మార్చి 2: జిల్లాలో అభివృద్ధి పనులను మరింత వేగంగా చేపట్టాలని జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ లింగాల కమల్‌రాజు అధికారులను ఆదేశించారు. జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో జడ్పీ స్థాయీ సంఘాల సమావేశం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అభివృద్ధి పనులతోపాటు సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. 1వ స్థాయీ సంఘంలో జిల్లా చేపడుతున్న అభివృద్ధి పనులపై సమీక్షించారు. ప్రస్తుతం కొనసాగుతున్న గ్రామ పంచాయతీ భవనాలు, అంగన్‌వాడీ భవనాలు, వైకుంఠధామాలు, డంపింగ్‌ యార్డుల పనులను సత్వరమే పూర్తి చేయాలని సూచించారు. పార్లమెంటు, శాసనసభ, శాసనమండలి సభ్యుల నుంచి వచ్చిన నియోజకవర్గాల అభివృద్ధి నిధుల ద్వారా చేపడుతున్న పనులను పూర్తిచేయాలని ఆదేశించారు. పల్లెప్రగతిలో చేపట్టిన పనులను అధికారులు సాధ్యమైనంత త్వరాగా పూర్తిచేయాలన్నారు. 4వ స్థాయీ సంఘంలో విద్య, వైద్యంపై ప్రధాన చర్చ జరిగింది. రానున్న పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించి జిల్లా విద్యార్థులు మంచి ఫలితాలు సాధించే విధంగా విద్యాశాఖ అధికారులు కృషి చేయాలని సూచించారు. వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రజలకు కార్పొరేట్‌ స్థాయిలో వైద్యసేవలందుతున్నాయన్నారు. ఈ వేసవిలో సంక్రమించే వ్యాధులతో పాటు ప్రభుత్వమందించే కేసీఆర్‌ కిట్లు, కాన్పులు, కుటుంబ నియంత్రణ వంటి శస్త్రచికిత్సలు ఇతర వైద్యసేవలను ప్రజలకు మరింత సమర్థవంతంగా అందించాలని సూచించారు. జిల్లాలో మూడో స్థాయీ సంఘం సమీక్షలో భాగంగా వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై సమీక్షించారు. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతులకు శాస్త్రీయ పద్ధతులను ఆనుసరించే విధంగా చైతన్య కార్యక్రమాలను చేపట్టాలని తెలిపారు. డిప్యూటీ సీఈవో వీవీ అప్పారావు మాట్లాడుతూ ఒకటో స్థాయీ సంఘంలో సభ్యులుగా ఉన్న జడ్పీటీసీలు, అధికారులు వివిధ కారణాలతో రాకపోవడంతో దానిని మంగళవారానికి వాయిదా వేసినట్లు తెలిపారు. సాధ్యమైన మేరకు సమావేశాలను జిల్లాస్థాయి అధికారులే హాజరుకావాలన్నారు. జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ మరికంటి ధనలక్ష్మి, స్థాయీ సంఘాల్లో సభ్యులుగా ఉన్న జడ్పీటీసీలు తిరుపతి కిశోర్‌, బెల్లం శ్రీను, నంబూరి కనకదుర్గ, ప్రియాంక, వివిధ శాఖ జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.


logo